Rare experiences …………………………….
కేరళ బ్యాక్ వాటర్స్‌లో హౌస్ బోట్ ప్రయాణం అద్భుతమైన అనుభూతులను ఇస్తుంది.కేరళ టూరిజం వారు ఏర్పాటు చేసిన ఈ బోటు ప్రయాణం అరుదైన అనుభవాల్లో ఒకటిగా మిగిలిపోతుంది. ప్రస్తుతం విహారయాత్రకు ఉపయోగిస్తున్న హౌస్ బోట్‌లు చాలా పెద్దవి, ఒకప్పుడు వీటిని సరుకు రవాణా కోసం ఉపయోగించేవాళ్లు. వీటిని కెట్టు వల్లమ్‌లు అంటారు. పాతవాటికి మార్పుచేర్పులు చేసి విహారయాత్రకు వినియోగిస్తున్నారు.
గతంలో కెట్టు వల్లమ్ లో టన్నుల కొద్దీ బియ్యం, సుగంధ ద్రవ్యాలను కొచ్చి పోర్ట్ కు తరలించేవారు. మలయాళంలో కెట్టు అంటే ‘వస్తువుల సముదాయం’, ‘వల్లమ్’ అంటే పడవ అని అర్థం. బొంగులపై తాటాకు కప్పు ఉన్నపడవులు ఇవి. కొబ్బరిపీచుతో జతచేయబడ్డ కలపతో,బద్దలతో ఈ పడవలు తయారు చేస్తారు.ఈ కెట్టు వల్లంలో ప్రయాణీకుల కొరకు ప్రత్యేక రూమ్‌లు కూడా ఉంటాయి.
కొంతభాగాన్నిరెస్ట్‌రూమ్ గా మార్చి, మరికొంత భాగాన్నికిచెన్ కు కేటాయించి పడవలను ఆకర్షణీయంగా రూపొందించి విహారయాత్రలు నిర్వహిస్తున్నారు.ఈ పడవపైనే పర్యాటకుల కోసం ఆహారం తయారు చేస్తారు. బ్యాక్‌వాటర్స్ నుంచి పట్టిన చేపలతో నోరూరించే ఫుడ్ సర్వ్ చేస్తారు.ఇటీవల కాలంలో బ్యాక్‌వాటర్స్‌పై విహారం చాలా పాపులర్ అయింది. అలప్పురలోనే సుమారు 500 లకు పైగా హౌస్ బోట్‌లున్నాయి.
ఈ హౌస్ బోట్లలో అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తున్నారు.హోటళ్ల తరహాలో బెడ్‌రూమ్‌లు,మోడ్రన్ టాయిలెట్లు, కోజీ లివింగ్ రూమ్‌లు, బాల్కనీలుకూడా ఉంటాయి. ఈ పడవలను స్థానికంగా ఉండే వ్యక్తులు నడిపిస్తుంటారు. కొన్నింటికి 40 హెచ్‌పి ఇంజిన్ కూడా ఏర్పాటు చేస్తారు. అవసరాన్ని బట్టి ఇంజన్ వాడతారు. విశాలమైన కాలువల్లో పడవ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది.
చల్లటి గాలులను ఆస్వాదిస్తూ… చుట్టూ ఉన్న ప్రకృతిని, పచ్చదనాన్నితిలకిస్తూ .. రణగొణధ్వనులకు దూరంగా, ప్రశాంత వాతావరణం లో అలా అలా నీళ్ల పై ముందుకు సాగుతుంటే మనసు ఏదో లోకాల్లోకి వెళ్లి పోతుందనడంలో సందేహం లేదు. కాలువకు ఇరువైపులా ఉండే తాటి తోపులు,కొబ్బరి చెట్లు, వరిపొలాల మీదుగా వచ్చేగాలి మన చెవిలో ఏదో గుస గుస లు చెప్పి వెళుతుంది.
చల్లటి గాలికి తనువు పులకరిస్తుంది. వెన్నెల రాత్రుల్లో అయితే ఈ విహారం గురించి ఇక చెప్పనక్కర్లేదు. కేరళ వెళితే ఒకసారి ఈ విహారయాత్ర చేసి రండి. హౌస్ బోట్లు తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, అలప్పురా, ఎర్నాకుళం, త్రిసూర్ , కాసర్‌గోడ్‌లో ఉన్నాయి.
నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ హౌస్ బోట్ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఈ హౌస్ బోట్ ప్రయాణం కొంచెం ఖరీదే అయినప్పటికీ మర్చిపోలేని అనుభూతులు పొందుతాం. రకరకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. కేరళ టూరిజం వారిని సంప్రదిస్తే అన్ని వివరాలు లభిస్తాయి.
————-Theja