రాయబరేలీ పై బీజేపీ కన్ను!!

Sharing is Caring...

Sonia Good bye to direct elections………..

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ నియోజకవర్గంపై బీజేపీ దృష్టి సారించింది. ఆ ఒక్క సీటులో కాంగ్రెస్ ను ఓడిస్తే ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోతుంది. ఒక వ్యూహం ప్రకారం అక్కడ బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అటు అమేధీ తో పాటు రాయబరేలీ లో కూడా తరచుగా  పర్యటిస్తున్నారు.

గత లోక సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన సీటు ఇదొక్కటే. పక్కనే ఉన్న అమేధీ లో రాహుల్ గాంధీ స్వయం గా పోటీ చేసి ఓడిపోయారు. ఓటమిని ముందే గ్రహించి సేఫ్ సైడ్ గా ఆయన వయనాడ్ లో కూడా పోటీ చేసారని కూడా అంటారు. వయనాడ్లో మంచి మెజారిటీతో  గెలుపొందారు. ఇక ఈ సారి గట్టి పోటీ ఉంటుందని .. భావించే సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్య సభకు నామినేషన్ వేశారు. అదీగాక సోనియా అనారోగ్యం .. వయసు పెరగడం కూడా వంటి అంశాలు కూడా కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక రాయబరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇటీవల తల్లి తరఫున ప్రియాంక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.  ప్రియాంక గాంధీ ఇప్పటివరకు  ఏ చట్టసభ సభ్యురాలు కాదు.  ఆమె లోక్‌సభ ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. రాజ్యసభకు కూడా నామినేట్ కాలేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రియాంకను పోటీ చేయమని పార్టీ వర్గాలు కోరాయి. అప్పట్లో అందుకు ఆమె సుముఖత చూపలేదు.

రాయ్‌బరేలీ, అమేథీ కాంగ్రెస్‌ కు పట్టున్న స్థానాలు. అయితే 2019లో అమేథీలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ గాంధీ అక్కడ ఓటమి పాలయ్యారు.  2019 లోకసభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ ప్రజలు సోనియా గాంధీ వైపే మొగ్గు చూపారు. సోనియాగాంధీ గత కొంతకాలంగా ఆరోగ్యం బాగోలేక పోవడంతో నియోజకవర్గానికి తరచుగా వెళ్లలేకపోతున్నారు.రాహుల్ కూడా మరల అమేధీ నుంచి పోటీ చేస్తారా ?లేదా ? అనేది సందేహమే.

రాయబరేలీ  జనరల్ కేటగిరీ పార్లమెంట్ స్థానం.ఈ నియోజకవర్గంలో  రాయబరేలీ జిల్లా మొత్తం ఉండడటం విశేషం. ఈ నియోజకవర్గ పరిధిలో  బచ్రావాన్ (SC) హర్‌చంద్‌పూర్,సరేని,ఉంచహర్, రాయబరేలీ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో  మొదటి నాలుగు నియోజక వర్గాల్లో సమాజవాది పార్టీ అభ్యర్థులు  గెలవగా , రాయబరేలీలో మాత్రం బీజేపీ గెలిచింది. కనీసం ఒక్క సీటుకూడా కాంగ్రెస్ గెలవలేదు.

వచ్చే లోకసభ ఎన్నికల్లో కూడా సమాజవాది పార్టీ పూర్తిగా కాంగ్రెస్ కి సహకరిస్తుందని గ్యారంటీ లేదు. కాగా అఖిలేష్ యాదవ్.. యూపీలోని 80 పార్లమెంట్ స్థానాల్లో 15 సీట్లను మాత్రమే కాంగ్రెస్ కు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ వైఖరి తెలియాల్సిఉంది. సోనియా, రాహుల్ సొంత రాష్ట్రం పై అంత శ్రద్ధ చూపకపోవడంతో పార్టీ నిస్తేజ స్థితిలో చిక్కుకుపోయింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 

సోనియా గాంధీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో 55.80% ఓట్లతో ఐదవసారి రాయ్‌బరేలీ నుంచి గెలిచారు. ఆమె 2004 నుండి వరుసగా గెలుపొందారు, 2006లో జరిగిన ఉప ఎన్నికతో సహా ఆమె 80.49% ఓట్లను సాధించారు.
1952లో ఫిరోజ్ గాంధీ (ఇందిరా గాంధీ భర్త) ఈ వెనుకబడిన తరగతుల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎన్నికైనారు .. నాటి నుండి రాయ్‌బరేలీ ఓటర్లు ఎక్కువగా వారితోనే నడిచారు. ఇందిరా గాంధీ గెలిచింది .. ఓడింది కూడా ఇక్కడే. సోనియా ఇక్కడ నుంచి గతంలో 5 సార్లు పోటీ చేశారు. 1996,98 లో ఇక్కడ బీజేపీ గెలిచింది. కానీ పట్టు నిలుపుకోలేకపోయింది. అందుకే ఇపుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. కాంగ్రెస్ నుంచి చేరిన నేతలకు బీజేపీ టిక్కెట్ లభించే అవకాశం ఉంది.

———–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!