Govardhan Gande…………………………………………..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అఫ్గాన్ వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. సరైన ముందస్తు వ్యూహం లేకుండా సైనికులను, అఫ్గాన్ ప్రజలను హడావుడిగా తరలించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఫ్గాన్ దేశం నుంచి సైనిక ఉపసంహరణకు తాలిబన్లతో లోప భూయిష్టమైన ఒప్పందం కుదుర్చుకున్నది డొనాల్డ్ ట్రంపే అయినప్పటికీ … ఇపుడు అధికారంలో ఉన్నారు కాబట్టి బైడెన్ ని అందరూ టార్గెట్ చేస్తున్నారు.
మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇది బైడెన్ వైఫల్యమేనని .. ఆయన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలన్నీ బైడెన్ వైఫల్యాన్ని సూచిస్తున్నాయని పులిట్జర్ అవార్డు గ్రహీత, చరిత్రకారుడు జోసెఫ్ ఎలిస్ కూడా వ్యాఖ్యానించారు.మరెందరో కూడా అమెరికా గౌరవానికి భంగం కలుగ కుండా వ్యవహరించడం లో బైడెన్ ను తప్పుబడుతున్నారు. ఈ విమర్శల జోరు మరింత పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఇపుడు ఎన్ని విమర్శలు చేసినా పరిస్థితుల్లో మార్పు వచ్చే సూచనలు లేవు. మంట పెట్టి .. తప్పుకున్నారు. ఇపుడు ఆ సెగల వేడిని ఆఫ్ఘన్ ప్రజలు అనుభవిస్తున్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తానని 20 ఏళ్ల నాడు అక్కడ తిష్ట వేసి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నడిపించి అర్ధాంతరంగా వదిలి వేసిన ఫలితమిది.ఉగ్రవాదాన్ని అణచి వేయలేదు. పౌర పాలనా రాజ్య వ్యవస్థ నిలదొక్కుకునే స్థితిని సైతం అక్కడ అమెరికా కల్పించలేకపోయింది.
మూడు ఆత్మాహుతి దాడులు, వంద మందికి పైగా బలి. తామే దాడులు జరిపామని ఐసిస్ ప్రకటించింది.అమెరికా ప్రతీకార దాడులు చేసింది.మరికొన్నింటికి ప్లాన్ చేస్తున్నది. తాలిబన్లు ఒకవైపు … ఇతర ఉగ్రవాద గ్రూపులు మరోవైపు ఆఫ్ఘన్లను పీడిస్తూ .. వేధిస్తూ భయ పెడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించిన ఫలితం అనూహ్యమైనది ఏమీ కాదు. అంతర్జాతీయ సమాజం ఊహించినదే.
ఐక్య రాజ్య సమితి తో సహా అన్ని దేశాలు ఆందోళన చెందుతూనే ఉన్నాయి. ఇలాంటి దాడులు జరుగుతాయని అందరూ ఊహించారు. పరిస్థితి అందరికీ అర్ధమవుతూనే ఉన్నది.కానీ ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరి అవసరాలు వారివి. ఇందులో వ్యాపార అవసరాలు ఇమిడి ఉన్నాయి. అలాగే ఎవరి పరిమితులు వారివి. ఎవరి భయాలు వారివి. ఆత్మాహుతి దాడులను ఖండించడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి చాలా దేశాలది.ఈ మంటల్లో చలి కాచుకునే దేశాలు కూడా ఉన్నాయి.భూమిపై ఇపుడున్న అన్ని ఉగ్రవాద సంస్థలు పుట్టుకకు నారు,నీరు పోసింది,పెంచి పోషించింది అమెరికాయే అన్న సంగతి మొత్తం అంతర్జాతీయ సమాజానికీ తెలుసు.