ఆమె ఏడాది సంపాదన 10 కోట్లు. అన్నీ వదిలేసి జైన సన్యాసిని గా మారిపోయింది. ఆమె పేరు నిషా కపాషి. అమెరికాలో ఫ్యాషన్ డిజైనర్ గా మంచి పేరు సంపాదించింది. అంతకుముందు ఇటలీ లో కొన్నాళ్ళు చదువుకుని ఉద్యోగం కూడా చేసింది. తర్వాత అమెరికా చేరుకుంది.అక్కడ ఆమె చూడంది,అనుభవించనిది ఏదీ లేదు. విలాసవంతమైన జీవితాన్ని గడిపింది. కానీ ఆమె కేదీ నచ్చలేదు. ఎందులోనూ ఆనందం దొరకలేదు.
నిషా USA లో పుట్టి ముంబైలో పెరిగింది. 20 సంవత్సరాల వయస్సులో, ఆమె న్యూయార్క్ లోని ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (FIT) లో ఫ్యాషన్ మర్చండైజింగ్ కోర్సు చేసింది. జె క్రూ కంపెనీ కోసం ఫ్యాషన్ మర్చండైజర్‌గా పని చేసింది. తర్వాత కాలంలో ఆమె జైన్ సెంటర్ ఆఫ్ అమెరికాలో ‘స్వాధ్యాయ’ ఉపన్యాసాలకు హాజరయ్యేది. ఈ క్రమంలో ఆమెకు భౌతిక ప్రపంచం పట్ల విరక్తి పుట్టింది. ఆధ్యాత్మికత వైపు ఆకర్షితురాలైంది.
కొన్నాళ్ళు జరిగాక ఆమె తన ఉద్యోగాన్నివదిలేసి భారత దేశానికి వచ్చింది. ఎన్నోమఠాలను సందర్శించింది. ఎన్నో పుస్తకాలను చదివింది. ఎందరో ఆచార్యులు…సాధ్వీలను కలుసుకుంది. చివరికి జైన సన్యాసినిగా మారాలని నిర్ణయించుకుంది. 2014 చివరి నాటికి ఆమె ‘దీక్ష’ తీసుకొని, ‘ఆత్మ శుద్ధికి దారి తీసే’ మార్గ అన్వేషణలో పడింది. భౌతిక ప్రపంచాన్ని త్యజించి జైన సన్యాసినిగా మారిన మొట్టమొదటి అమెరికన్ నిషా యే అంటారు.
దీక్ష తీసుకునే ముందు తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. వారు తొలుత షాక్ తిన్నారు. బాధపడ్డారు. కుమార్తెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆమె ససేమిరా అంది. చివరికి తల్లిదండ్రులు అనుమతించారు. ఆమె దీక్షా వేడుక జనవరి 18, 2015 న జార్ఖండ్‌లోని సమ్మెట్ శిఖర్జీలో జరిగింది. సాధ్వి శ్రీ సనవే ప్రజ్ఞ శ్రీ అనే పేరును స్వీకరించింది. ఆమె పూర్వాశ్రమం నుండి విముక్తి పొంది సన్యాస దీక్ష కొనసాగిస్తోంది. నిత్యం భిక్ష స్వీకరిస్తూ . ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ … ధ్యానం చేస్తూ ఆత్మశుద్ధి చేసుకుంటోంది. జైన సాధ్వి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్‌లో ఉన్నారు.
27 సంవత్సరాల వయసులో ఆమె ఆ నిర్ణయం తీసుకోవడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. ఇలా భౌతిక ప్రపంచాన్నివదిలేసి సన్యాసం స్వీకరించినవారు ఎందరో ఉన్నారు. అలాంటివారిలో యువత ఎక్కువగా ఉండటం విస్మయపరిచే అంశం.ఆమధ్య చాలామంది యువకులు నాగ సాధువులు గా మారారు. వారంతా భౌతిక ప్రపంచం పట్ల చిన్నవయసులోనే విరక్తి చెంది సన్యాసులుగా మారారు. ఎవరికి నచ్చిన విధంగా వారు జీవించేందుకు హక్కు ఉంది కాబట్టి .. ఏ రంగంలో ఆనందం దొరుకుతుందో అందులోకి వెళుతున్నారు అనుకోవాలి.
—————- Jogeswara Rao Pallempaati