Dhoolipala who lived in the role of Shakuni………………
పై ఫొటోలో సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ పక్కన ఉన్నది శకుని పాత్రధారి ధూళిపాళ సీతారామాంజనేయ శాస్త్రి. శ్రీ కృష్ణ పాండవీయం చిత్రంలో శకుని మామ పాత్రలో ధూళిపాళ జీవించారు. అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అంతకు ముందు శకుని పాత్రలు చాలామంది నటులు పోషించారు.
హాస్యం, వెటకారం మాటలతో సీఎస్ ఆర్ కూడా శకుని పాత్రలో తనదైన శైలిని చూపి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మాయాబజార్ లో సీఎస్ ఆర్ నటన విభిన్నంగా ఉంటుంది. కురుక్షేత్రం చిత్రంలో శకుని పాత్రను నాగభూషణం పోషించారు. ఆ పాత్రకు కామెడీ డైలాగులు పెట్టడంతో సీరియస్ నెస్ లేకుండా పోయింది.
కానీ ధూళిపాళ క్రూరమైన చూపులతో.. ప్రత్యేక వాచకం, హావభావాలతో శకుని గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. శకుని అనగానే ధూళిపాళ గుర్తొచ్చేలా చేశారు. అది ఆయన ప్రత్యేకత. ఆయనకు అంత పేరు రావడానికి కారణం ఎన్టీరామారావు అని చెప్పుకోవాలి.
శ్రీ కృష్ణ పాండవీయం లో కానీ దానవీర శూర కర్ణ లో కానీ తాను ధరించిన పాత్రలతో సమానంగా శకుని పాత్ర ను హైలెట్ చేశారు. పదునైన డైలాగులు కూడా ఆ పాత్రకు రాయించారు. అందుకే ఆ పాత్ర పండింది. ధూళిపాళ తన నటనా చాతుర్యంతో ఔరా అనిపించేలా చేసాడు. చాలా సన్నివేశాల్లో ఎన్టీఆర్ తో పోటీ పడి నటించాడు.
శ్రీకృష్ణ పాండవీయం లో “ఆ జీవితాంతం పాండవులు ప్రత్యావమాన క్లేశం తో కృంగి, కృశించి నశించవలె. అపుడు గాని ఈ పరాభవాగ్ని చల్లారదు.” “పగ తీర్చకపోతే గాంధార రాకుమారుడినే కాదు” అన్న డైలాగులు చెప్పేటప్పుడు హావభావాలను అద్భుతంగా పలికించారు ధూళిపాళ. అలాగే కర్ణ లో “మంచి పనులేమోకానీ ఇలాంటి వంచన పనులు ఈ మామకు వెన్నతో పెట్టిన విద్య.”
వ్యసనపరుడైన ధర్మజుడు ఎన్నిసార్లు అయినా జూదానికి వస్తాడు. ఎన్ని అవమానాలైనా భరిస్తాడు” వంటి డైలాగులు చెప్పేటప్పుడు తనదైన శైలిలో చెబుతూ కుటిలత్వాన్ని కళ్ళలో చూపుతారు. దుర్యోధనుడిగా ఎన్టీఆర్ .. శకునిగా ధూళిపాళ పోటా పోటీగా నటించారు కాబట్టే ఆయా సినిమాల్లో ఆ సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కాయి.
సీనియర్ సముద్రాల కానీ .. కొండవీటి వెంకటకవి కానీ ప్రత్యేక శ్రద్ధతో సంభాషణలు సమకూర్చారు. అలాంటి డైలాగులు ఆ రెండు సినిమాల్లో బోలెడున్నాయి. ఇక శ్రీకృష్ణ పాండవీయంలో శకుని ఫ్లాష్ బ్యాక్ కొంత చూపిస్తారు.
ఎన్టీఆర్ శకుని పాత్రను మరింతగా పెంచడం కోసం వ్యాస భారతంలో లేని కథను జొప్పించారు. భారతంలో శకుని పాత్ర ఏమిటో ? శకుని మామ ఎందుకు పగబట్టాడో ? పాచికలను ఎలా రూపొందించాడో కొత్త కోణంలో ఈ సినిమా చూపిస్తుంది.
చిత్రంగా పై రెండు సినిమాలకు కథ దర్శకత్వం ఎన్టీరామారావే కావడం విశేషం. కేవలం తన క్యారెక్టర్ మాత్రమే హైలెట్ చేసుకోకుండా కథకు అనుగుణంగా ఇతర పాత్రలను తీర్చిదిద్దిన వైనం ప్రశంసనీయం.
ఆ రెండు సినిమాలను ఎన్టీఆర్ నభూతో నభవిష్యత్ అన్నరీతిలో తీశారు. ఆ రెండు సినిమాలు యూట్యూబ్ లో ఉన్నాయి .. చూడని వారు చూడొచ్చు. చూసిన వారు కూడా మరొక మారు చూడొచ్చు.
———–KNMURTHY