అద్భుతం .. అరుణాచల జ్యోతి దర్శనం !

Sharing is Caring...

శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు అరుణాచలం కొండమీద దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3 వేల సంవత్సరాల ముందునుంచే జరుగుతోందని చరిత్ర కారులు చెబుతున్నారు. ఈ ఉత్సవాన్నితమిళ కార్తీక మాసంలో (నవంబరు 15 – డిసెంబరు 15) 10 రోజులపాటు పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.  పదవ రోజు తెల్లవారుజామున గర్బగుడిలో భరణి దీపం వెలిగిస్తారు.  అదే రోజు సాయంకాలం 6 గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగిస్తారు.  దీనినే ” కృత్తికా దీపోత్సవం ” అని కూడా అంటారు.

ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిదను ప్రత్యేకంగా రాగితో చేస్తారు. ఇందులో వత్తిగా వెలిగించే వస్త్రం 600 మీటర్ల తో తయారు చేస్తారు. ఈ ప్రమిదను, వత్తిని ” జ్యోతి నాడార్ లేక దీప నాడార్ ” అని పిలిచే వంశస్తులు మాత్రమే అందజేస్తారు. ఇక 2500 కిలోల నెయ్యి అరుణాచలానికీ వచ్చే భక్తులు అందజేస్తారు. అలా వెలిగించిన అరుణాచల మహా దీపం మూడు రోజులు దేదీప్యమానంగా వెలుగుతుంది. షుమారు 24 కిలోమీటర్ల మేరకు ఈ దీపము దర్శనమిస్తుంది.  
ఈ దీపం కోసం పది అడుగుల ఎత్తు, అయిదు అడుగుల చుట్టు కొలతగల పెద్ద లోహ పాత్ర ను ప్రత్యేకంగా తయారు చేస్తారు. అందులో స్వచ్ఛమైన  నేతిని పోస్తారు. భక్తులు దగ్గర ఉండి నేతిని అంచెలంచెలుగా పోస్తుంటారు.

తిరుమలలో బ్రహ్మోత్సవాలు, శబరిమలైలో మకరజ్యోతి ఉత్సవం ఎంత వైభవంగా జరుగుతాయో  అరుణాచలంలో కార్తీగ దీపోత్సవాలు అంత వైభవంగా జరుగుతాయి. పున్నమి రాత్రుల వెన్నెలతో పోటీ పడుతూ వెలిగిపోయే దివ్య జ్యోతి కాంతుల్ని దర్శించుకొనేందుకు లక్షల సంఖ్యలో భక్తులు అరుణగిరికి వస్తారు. ఈ ఉత్సవాల్లో అనేక విశిష్టతలు గోచరిస్తాయి. వీటినే కార్తీక బ్రహ్మోత్సవాలు అనికూడా అంటారు. ఇందులో మొదటి రోజున అరుణాచలేశ్వర ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం పంచమూర్తుల ఊరేగింపు. అంటే వినాయకుడు, కుమారస్వామి, చండీశ్వర స్వామి సహా పార్వతీ పరమేశ్వరుల ఊరేగింపు జరుగుతుంది.అదే రోజు రాత్రి అధికార నంది వాహనంపై సోమస్కందమూర్తి ని మాడ వీధులలో ఊరేగిస్తారు. ఇక రోజూ రెండు పూటలా ఉదయం సమయంలో చంద్రశేఖరమూర్తిగా, రాత్రి సోమస్కంధ మూర్తిగా ఊరేగింపు నిర్వహిస్తారు. ఎనిమిదో రోజు వచ్చేసరికి ఉత్సవాలు ఊపందుకుంటాయి. పదో రోజు కార్యక్రమాన్ని దృష్టిలోపెట్టుకొని చాలా మంది భక్తులు ముందుగానే విచ్చేస్తుంటారు. ఎనిమిదో రోజు ఉదయం అశ్వవాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు జరుగుతుంది.  సాయంత్రం 4 గంటల నుండి భిక్షాటనమూర్తి మాఢవీధులలో ఊరేగింపు జరుగుతుంది. అదేరోజు రాత్రి పంచకళ్యాణివాహనంపై సోమస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు జరుగుతుంది.
తొమ్మిదోరోజు ఉదయం పురుష మృగ వాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు. రాత్రి కైలాస రావణ వాహనంపై సోమస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు జరుగుతుంది. తొమ్మిదో రోజునాటికి  అరుణాచల క్షేత్రం భక్తులతో పోటెత్తుతుంది.

పదవ రోజు  ఉదయం 4 గంటలకు అరుణాచలేశ్వర ఆలయంలో భరణీదీపం వెలిగిస్తారు. ఆ రోజంతా భక్తుల పూజలతో క్షేత్రం మార్మోగిపోతుంది. అదేరోజు సాయంత్రం 6 గంటలకు అరుణగిరి మీద మహాదీపం వెలుగుతుంది. దీనిని  దీపనాడార్‌ వంశస్తులు తీసుకొని రావటం సాంప్రదాయం. మహాదీపోత్సవం కాగానే అరుణగిరి కోటి కాంతులతో ధగధగాయమానంగా వెలిగిపోతుంది. ఈ వైభవాన్ని చూసేందుకు వెయ్యికనులు చాలవంటే అతిశయోక్తి కాదు.

అగ్ని రూపుడైన అరుణాచలేశ్వరుడు దేవేరితో కలిసి అరుణ కాంతులతో వెలిగిపోతూ దర్శనం ఇస్తారు. అరుణాచల శివ అంటూ భక్తులు స్వామి వారిని పిలుస్తూ ఊరేగింపులో పాల్గొంటారు. ఆ సమయంలో జరిగే గిరి ప్రదక్షిణ అద్భుతమైనది. తర్వాత 11వ రోజున  దీపం వల్ల వచ్చిన భస్మాన్ని తీసుకొచ్చి అంజనంగా మార్చి భక్తులకు ఇస్తారు. నల్లగా ఉండే ఈ అంజనాన్ని నుదుటిపై  ధరిస్తారు. అదే రోజున  అయ్యన్‌ కొలనులో చంద్రశేఖరమూర్తి తెప్పోత్సవం జరుగుతుంది.  12వరోజున పరాశక్తి తెప్పోత్సవం, 13వ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెప్పోత్సవం, 14వ రోజున  చండికేశ్వరుని తెప్పోత్సవంతో కార్యక్రమం ముగుస్తుంది.
కరోనా దృష్ట్యా ఈ సారి  భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నారు.

———– KNM 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!