ఇప్పటికి సరిగ్గా 63 సంవత్సరాల క్రితం….1960 ఆగస్ట్ 5వ తేదీ : భారతదేశం అంతటా ‘మొగలే ఆజమ్’ అనే CULT CLASSIC విడుదలై చరిత్ర సృష్టించింది. భారతీయ ప్రేక్షకుడు అలాంటి సినిమా ఎన్నడూ చూసి ఎరగడు. చూపు తిప్పుకోనివ్వని విజువల్ ఎఫెక్ట్‌తో, ఈ జన్మికక చాలు అనిపించే మధుర సంగీతంతో, పృథ్వీరాజ్ కపూర్ డైలాగుల మేఘ గర్జనతో, వెండితెర వీనస్ మధుబాల వెన్నెల సౌందర్యంతో ఆకట్టుకుంటుంది.
బడేగులాం అలీఖాన్ గానామృతధారలతో నిండిన ఆ సినిమా చూసి ఉత్తరాది, దక్షిణాది అనే భేదం లేకుండా, వాళ్ళు క్లాసూ, వీళ్ళు మాసూ అనే తేడా లేకుండా యావద్భారతదేశం పులకించిపోయింది. మొగలే ఆజం చూసి ఒక తరం తరించింది. కె.ఆసిఫ్ అనే దర్శకుడు చేసిన మేజిక్ ఇది.
ఇంతకీ ఆసిఫ్ ఎవడు? ఎ వ డా డు? ( పోకిరీలో మహేష్‌బాబులా అనవలెను? )ఒక పెద్ద వెండిపాత్రని స్టౌ మీద పెట్టి, అందులో ముందుగా శ్రీశ్రీనీ కృష్ణశాస్త్రినీ వేసి, రెణ్ణిమిషాల తర్వాత కేవీరెడ్డినీ, ఎస్వీరంగారావునీ జోడించి, కొంచెం వేగనిచ్చి రెండు చెంచాల శేఖర్‌కపూర్‌ని వేసి, ఆపై తగినంత సత్యజిత్‌రాయ్‌ని చల్లి, మాంచి మల్టీకలర్ వచ్చేదాకా వేయించి, రుచికోసం చిటికెడు శ్యాంబెనగల్ని కలిపి, రమేష్ సిప్పీతో గార్నిష్ చేసిన ఆ మాయాదీపాన్ని లక్ష్మీ,సరస్వతీ, పార్వతీదేవి ఒకేసారి టచ్‌చేస్తే, అందులోంచి నడుచుకుంటూ మన కళ్ళముందుకొచ్చే మహాదర్శకుడే కరీముద్దీన్ ఆసిఫ్.
CECIL B DE MILLE OF INDIA అమెరికన్ సినిమా కన్నతండ్రి కీర్తి గాంచిన సిసిల్ డిమిలీ, టెన్ కమాండ్మెంట్స్, క్లియోపాత్రా, గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్, శాంసన్ అండ్ డెలీలా వంటి ఇంటర్నేషనల్ బ్లాక్‌బస్టర్స్ తీసిన దర్శక రాక్షసుడు. ఆయనతో మాత్రమే పోల్చదగ్గ ఏకైక భారతీయ దర్శకుడు ఆసిఫ్. 1945లోనే మొగలే ఆజం తీద్దామని ప్లాన్ చేశాడు ఆసిఫ్. నర్గీస్ హీరోయిన్, చంద్రమోహన్ (మనవాడు కాదు) హీరో అను కున్నాడు.షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే హఠాత్తుగా చంద్రమోహన్ చనిపోయాడు. దీంతో వాయిదా వేసుకున్నాడు.
1945లోనే ఆసిఫ్ తీసిన ‘ఫూల్’ సూపర్ హిట్ అయింది. తరవాత హల్చల్ తీశాడు. అది 1951లో విడుదల అయింది. అప్పటి నుంచి ఇక మొగలే ఆజమ్‌పైనే దృష్టిపెట్టాడు. ఈసారి మధుబాల,దిలిప్ కుమార్లని ఎంచుకున్నాడు. మూడేళ్ళ ప్లానింగ్, తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిర్మాణం తర్వాత 1960 ఆగస్ట్‌లో మొగలే ఆజమ్ విడుదలయింది.
ఆ ప్రేమ కవిత చరిత్ర సృష్టించింది. పూర్తిగా కలర్లో తియ్యడం కోసం ‘లవ్ అండ్ గాడ్ ‘ తలపెట్టాడు. గురుదత్ హీరో. నిమ్మి హీరోయిన్లు. షూటింగ్‌కి ముందే 1964లో గురుదత్ మరణించారు. అనేక మార్పులు చేసి,ఈ సారి సంజీవ్ కుమార్‌ని హీరోగా ఎంచుకున్నారు. సినిమా సగం పూర్తయ్యాక 1971లో ఆసిఫ్ చనిపోయారు. ప్రాజెక్టు నిలిచి పోయింది. అచ్చు సినిమాలాగే ఆసిఫ్ జీవితం ముగిసిపోయింది.
1945-1955లో ఒక హిందీ సినిమా తియ్యడానికి పది లక్షలు ఖర్చయ్యేది. మహా అయితే మరో రెండు మూడు లక్షలు అంతే ! అలాంటి రోజుల్లో మొగలే ఆజమ్‌కి అయిన ఖర్చు అక్షరాలా కోటిన్నర రూపాయలు ! లెక్కలేకుండా ఖర్చు చేయించాడు ఆసిఫ్. దర్శకుణ్ణి పూర్తిగా నమ్మిన నిర్మాతలు నోట్లు విరజిమ్మారు.1951 కావొచ్చు.
బొంబాయిలో ఒక సింగిల్ రూంలో వుండేవాడు సంగీత దర్శకుడు నౌషాద్ అలీ. చాలా మెట్లెక్కి వెళ్ళాలి ఆగదికి. ఆసిఫ్, నౌషద్ చాలా మంచి దోస్తులు. ఒక రోజు ఆ మెట్లన్నీ ఎక్కి వెళ్ళాడు ఆసిఫ్. టేబుల్ మీద వున్న హార్మోనియం ముందు కూచుని వున్నాడు నౌషద్. చాయ్ వచ్చింది. ఒన్ బైటూ తాగారు. పాన్ వేసుకున్నారు. బీడీ వెలిగించాడు నౌషాద్. ‘చెప్పరా’ అన్నాడు మొగలే ఆజమ్ అని దుమ్ము రేగిపోయే సినిమా ప్లాన్ చేశా. సలీం అనార్కలీ ప్రేమకథ. సంగీతం నువ్వే. ఏం చేస్తావో మరి, ఈ దేశం పదికాలాల పాటు ఆ పాటలు పాడుకోవాలి” అన్నాడు ఆసిఫ్.
“మన స్నేహం కోసం నువ్వేం చెప్పినా చేస్తా ఇరగదీద్దాం” అన్నాడు నౌషాద్. పాటలింకా రాయలేదు. నిర్మాత ఎవరో తెలీదు. ట్యూన్లు కట్టడం మొదలుపెట్టాడు. ఆసిఫ్ ఇంప్రెస్ అయ్యాడు. మళ్ళీ చాయ్, పాన్, బీడీలు! శాస్త్రీయం,జానపదం, సూఫీ, కమర్షియల్, లలిత సంగీతాల్లో ఆరితేరిన నౌషాద్ 25 పాటలకు మతిపోయే ట్యూన్లు సిద్ధం చేశాడు. రెమ్యూనరేషన్ యివ్వడానికి ఆసిఫ్ దగ్గర డబ్బుల్లేవ్. పాటలు రాసే పనిని కవి షకీల్ బదాయునెకి అప్పజెప్పాడు.
1960లో సినిమా రిలీజ్ అయి,హిట్టయ్యాక, ఆసిఫ్ మళ్ళీ ఆ మెట్లు ఎక్కి నౌషాద్ దగ్గరకెళ్ళాడు. లక్ష రూపాయల నోట్ల కట్టలు తీసి, హార్మోనియం మీద పెట్టాడు. “ఏంట్రాయిది ! మన స్నేహం కోసం చేశానురా, డబ్బు కోసం కాదు” అంటూ నౌషాద్ ఎడం చేత్తో నోట్ల కట్టల్ని తోసేశాడు. పక్కనున్న కిటీకీలోంచి అవి కిందకి పడిపోయాయి. దారిన పోయేవాళ్ళు ఏరుకుని డబ్బు పట్టుకుపోయారు. ఖిన్నుడయిన ఆసిఫ్ క్షమాపణ చెప్పారు. నౌషాద్ భార్య రాజీ చేయడంతో వాళ్ళు మళ్ళీ కలిసి పనిచేశారు.
మిగతాది పార్ట్ 2 లో ఆసిఫ్ పసిడి కలల పంట MUGHAL-E-AZAM 2