ఏపీ లో కమలనాధులకు కష్టాలు!

Sharing is Caring...

ఏపీ బీజేపీ పంచాయితీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. వైసీపీ ని ఓడించి రాబోయే కాలంలో అధికారంలోకి వస్తామని పదేపదే చెబుతున్న ఆ ఆ పార్టీ నేతలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. కరెక్టుగా ఇన్ని పంచాయితీలు వచ్చాయని కూడా ఆ పార్టీ నేతలు చెప్పుకోలేకపోతున్నారు. సరిగ్గా ఎన్నికల సమయానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఓటర్లలో ఆగ్రహాన్ని రగిలించాయి. బడ్జెట్ లో ఆంధ్రా కు కేటాయింపులు లేకపోవడం .. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ అంశం పార్టీని దెబ్బ తీసాయనే చెప్పాలి. ఎన్నికల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు సెంటిమెంట్ బాగానే పనిచేసింది. 

ఈ అంశంపై మాట్లాడేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , బీజేపీనేత సోము వీర్ర్రాజు ఢిల్లీ వెళ్లినప్పటికీ కేంద్ర పెద్దల నుంచి సరైన సమాధానం లేదు. దీంతో ఏమి చేయాలో తోచక నీతి ఆయోగ్ ‘ఒక్క చిన్న ట్వీట్‌ చేస్తే ఇంత రాద్ధాంతం చేస్తారా..? విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేస్తారని మీకెవరు చెప్పారని  బీజేపీ నేతలు అంటున్నారు. అంతే కానీ  స్టీల్ ప్లాంట్ అమ్మకం జరగదు అని ఘంటా పదంగా చెప్పలేకపోతున్నారు. ఈలోగా విశాఖలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయగా.. సీఎం జగన్ … విపక్ష నేత చంద్రబాబు రంగం లోకి దిగారు.   విశాఖ వెళ్లి ఉక్కు కార్మికులతో మాట్లాడారు.ఈ పరిణామాలన్నీ బీజేపీపై వ్యతిరేకత పెంచాయి. ఫలితంగా పంచాయితీ ఎన్నికల్లో పెద్ద దెబ్బ తగిలింది.

కాగా అంతకుముందు ప్రజల్లోకి వెళ్ళడానికి హిందూ ఆలయాలపై దాడుల అంశం బాగా ఉపకరించింది.కొన్నాళ్ళు అదే అంశంపై బీజేపీ నేతలు జగన్ పై విమర్శలు గుప్పించారు. అంతర్వేది రధం దహనం కేసులో  ఆందోళనకు దిగారు. దీంతో ఏపీ సీఎం ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అలాగే రామతీర్ధం ఆలయం విషయంలో కూడా బీజీపీ నేతలు హడావుడి చేశారు. సోము వీర్రాజు రామతీర్ధం యాత్ర తలపెట్టి దూసుకెళ్లారు. కపిల తీర్ధం నుంచి రామతీర్ధంవరకు రథయాత్రకు సన్నాహాలు చేశారు. ఈ లోగానే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది.జనసేన తో కలసి బరిలోకి దిగినా సత్తా చాటుకోలేకపోయారు. ఆ ఆందోళనల ప్రభావం ఎన్నికలపై పనిచేయలేదు. ఇప్పటికైనా కేంద్రం ఏపీ పై శ్రద్ధ చూపకపోతే బీజేపీ పై వ్యతిరేకత తగ్గదు. నేతలు సరైన ఫలితాలు రాబట్టలేరు. ఈమాటలు బీజేపీ నేతలే అంటున్నారు.విశాఖ ఉక్కు ప్రబావం మరికొంత కాలం ఉండే అవకాశాలున్నాయి. పాపం వీర్రాజు ఎంత కష్టపడినా కేంద్రం సహకరించక పోతే ఆయన మాత్రం ఏమి చేయగలడు ? 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!