Social Work ……………………………………
స్టార్ హీరోయిన్ సమంత కేవలం సినిమా నటి మాత్రమే కాదు.. ఒక సోషల్ వర్కర్ గా కూడా సేవా రంగంలో తన వంతు పాత్ర నిర్వహిస్తున్నారు. తన సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం ఉపయోగిస్తున్నారు. ప్రత్యూష సపోర్ట్ పేరిట సమంత ఫిబ్రవరి 2014 నుంచి మహిళలకు ..పిల్లలకు సేవలు అందిస్తున్నారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న నిరుపేద మహిళలు ,పిల్లలకు మెరుగైన వైద్యం అందించడం .. వారి సంరక్షణ.. సహాయక చర్యలపై ప్రత్యూష సపోర్ట్ దృష్టి కేంద్రీకరించింది.
ఇందుకోసం కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకుని మహిళలు ..పిల్లలకు వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. తెలంగాణ .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రెయిన్‌బో, కాంటినెంటల్, లివ్‌లైఫ్, అంకురా, ఆంధ్రా హాస్పిటల్‌లతో కలసి ప్రత్యూష సపోర్ట్ పనిచేస్తున్నది. అలాగే బెంగుళూరు, కర్ణాటక చెన్నై, WAP ఫౌండేషన్, మీనాక్షి మిషన్ హాస్పిటల్‌తో కూడా ప్రత్యూష కలసి పనిచేస్తున్నది.
ఈ వైద్య సంస్థల సహకారంతో నిరుపేదలకు, వృద్ధులకు కంటి శస్త్ర చికిత్సశిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలను ప్రత్యూష సపోర్ట్ నిర్వహిస్తున్నది. ప్రత్యూష సపోర్ట్ టీమ్ ఉచిత వైద్య పరీక్షల ప్రచారం నిర్వహిస్తుంది. అవసరమైన సందర్భాలలో ఉచిత టీకా, రక్తదాన శిబిరాలు చేపడుతుంది.
ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, ఇతర సొసైటీలలో వివిధ సున్నితమైన అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సినిమా నటీనటులు ఉపయోగించిన వస్తువులను ..దుస్తులను విక్రయిస్తుంది. తద్వారా వచ్చే సొమ్మును సేవాకార్యక్రమాలకు ఉపయోగిస్తుంది. ఇలా పలు మార్గాలలో విరాళాలు సేకరించి పేదలకు సమంత అండగా నిలుస్తోంది.
ఇప్పటివరకు ప్రత్యూష సపోర్ట్ నిరుపేదలకు 150కి పైగా క్లిష్టమైన శస్త్రచికిత్సలను స్పాన్సర్ చేసింది. ఆదిబట్ల సమీపంలోని నాదర్‌గుల్‌లో ఉన్న ప్యారం విజయభారతి విద్యాసాగర్ ఛారిటబుల్ ట్రస్ట్ కి అనుబంధ సంస్థగా సుమారు 28 మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తోంది.వారికి విద్య, వైద్య ఇతర అవసరమైన సౌకర్యాలను సమకూరుస్తోంది.
ప్రత్యూష సపోర్ట్ కు దాదాపు 1200 మంది వాలంటీర్లు ఉన్నారు. ప్రముఖ లాపరోస్కోపిక్ సర్జన్, ప్రసూతి వైద్యురాలు డా. మంజుల అనగాని కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను డా. మంజుల ముందుండి గైడ్ చేసి నడిపిస్తుంటారు.