జగనన్నకు బహిరంగ లేఖ !

Sharing is Caring...

ఏపీ సీఎం జగనన్న కు ……..  మీ వీరాభిమాని ఆరుమళ్ల అప్పారావు నమస్కరించి రాయునది. 

ఇంటర్ , పదో తరగతి పరీక్షల నిర్వహణపై తమరు మొండిగా వ్యవహరిస్తున్న తీరుపై సోషల్ మీడియా లో మన వాళ్లే విమర్శలు చేస్తున్నారు. మీ అభిమానులుగా మేము సమాధానం చెప్పలేకపోతున్నాం.
ఏపీ లో సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది. రోజుకి 10 వేల కేసులు నమోదు అవుతున్నాయి. పరిస్థితి గందరగోళంగా ఉంది. ప్రజలు బతికుంటే బలుసాకు తిందామని యోచనలో ఉంటే మీరు పరీక్షలు పెడతామనడం ఏం మాత్రం బాగా లేదు. ఎందుకు మీరు రిస్క్ తీసుకుంటున్నారో ? అర్ధం కాని విషయం. పిల్లలకు ఏమైనా అయితే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. ప్రజలను మీరైతే బాగా చూస్తారు  అనే ఉద్దేశ్యంతో మీకు 150 సీట్లు కట్టబెట్టారు. ఆ బాధ్యత మీపై ఉంది. మరి ఆ ప్రజల గురించి ఆలోచించండి.

టీడీపీ నేత లోకేష్ డిమాండ్ చేసాడని … ఇంకొకళ్ళు పరీక్షలు రద్దు చేయమన్నారని మీరు పట్టుదలకు వెళ్తున్నారని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. వాళ్ళ డిమాండ్ల గురించి పట్టించుకోకండి. మీకు ప్రజలే ముఖ్యం.  నిన్నటి “నాడు -నేడు” సమీక్షలో మీరు మాట్లాడుతూ “కేంద్రం ఏ విధానాన్ని ప్రకటించలేదు. నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసిందన్నారు. అది మంచిదే కదా. పరీక్ష పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్ మార్కులే ఇస్తాయి. అలాంటపుడు మంచి కాలేజీలలో సీట్లు ఎలా వస్తాయి” అని మీరు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల మీకున్న కన్సర్న్ కు ధన్య వాదాలు. అవన్నీ మామూలు రోజుల్లో.

ఇపుడు బయట కాలుపెడితే ఏమౌతుందో అన్న ఆందోళనలో పిల్లలు .. వారి తల్లి తండ్రులు ఉన్న తరుణంలో పరీక్షలు పెడితే .. పొరపాటున వారు వైరస్ కాటుకి గురైతే  బాధ్యత ఎవరిది ? ఇంట్లో కూర్చుంటేనే వైరస్ అటాక్ చేస్తున్నదని  వార్తలు వస్తున్నాయి. ప్రజలు హడలిపోతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు లేవు .. వ్యాక్సిన్ లేదు .. ఆక్సిజన్ అందుబాటులో లేదు. ఇలాంటి సమయంలో ఒక విద్యా సంవత్సరం నష్ట పోతే ఏమౌతుంది ? పరీక్షలు రాయక పోతే  కొంపలు మునిగి పోతాయా ?  ఇవాళ కాకపోతే రేపు .ఎల్లుండి రాస్తారు ?  బెటర్మెంట్ అవకాశాలున్నాయి. 

కోర్టు కూడా మీ నిర్ణయాన్ని పునస్సమీక్షించమని చెప్పింది. అందులో తప్పు ఏమి లేదు కదా ? విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పునరాలోచన చేయండి. ఒక సారి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో లేవో స్వయంగా విచారించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే విద్యార్థుల తల్లిదండ్రుల ఫీడ్ బ్యాక్ తీసుకోండి. సీఎం మాతో మాట్లాడారు అని వాళ్ళు సంతోష పడతారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలను తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. ప్రతి ప్రక్షాలకు క్రెడిట్ పోతుందని భావించకండి. ప్రజల శ్రేయస్సు .. సంక్షేమమే ప్రధానమని గుర్తించండి. మీ నిర్ణయం మార్చుకోకుండా ముందుకు పోతామంటే ..  ఒకవేళ కోర్టు మీకు వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే సర్కార్ ఇమేజ్ పోతుంది. కాబట్టి ఆలోచించి .. నిర్ణయం తీసుకోండి. ఇలా బహిరంగ లేఖ రాసానని తప్పుగా భావించకండి.

ఇట్లు

ఆరుమళ్ల అప్పారావు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!