Subramanyam Dogiparthi …………………….
సుడిగుండాలు…. అప్పటికన్నా ఇప్పుడు ఎంతో అవసరమయిన సంచలనాత్మక,సందేశాత్మక చిత్రం. ప్రతీ పాఠశాలలో , కళాశాలలో , యూనివర్సిటీలో , ఇంట్లో అందరూ అప్పుడప్పుడూ చూడాల్సిన చిత్రం . సరదాకి , మెంటల్ కి , బలిసిన ఒంటికి , డబ్బెక్కువ అయి చేసే , అధికారం నెత్తికెక్కి , చట్టం అంటే భయం లేక చేసే హత్యలు , మానభంగాలు సాధారణమై పోయిన 21 శతాబ్దానికి అవసరమైన సినిమా ఇది.
ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు .. మరో ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు సంయుక్తంగా తీసిన ప్రయోగాత్మక సినిమా ఈ సుడిగుండాలు. డిటెక్టివ్ పుస్తకాలు , బూతు పుస్తకాలు చదివి పాడయిపోయే 1960 దశకంలో వచ్చిన సినిమా . సినిమాలో ANR పాత్ర , నటన సూపర్బ్ . కోర్టులో సుకన్య నటన చాలా బాగుంటుంది.
తేనె మనసులు సినిమాలో నటించిన రామ్మోహన్ , సంధ్యారాణి , పుష్పకుమారి ప్రభృతులు ఇందులో కూడా నటించారు. ప్రముఖ నటుడు కాంతారావు కుమారుడు రాజా ANR కుమారుడి పాత్రలో నటించారు. నటుడు విజయచందర్ మొదటి సినిమా.అక్కినేని వెంకట్ , నాగార్జున అతిధి పాత్రల్లో దర్శనమిస్తారు.
ఈరోజుల్లో చాలామంది యువతీయువకులకు స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర తెలియదు . అలాంటి వారు ఈ సినిమాలో బుర్ర కధ కం నాటకం చూస్తే కాస్తయినా అర్థం అవుతుంది . ప్రముఖ రచయిత యన్ ఆర్ నంది డైలాగులు చాలా బాగుంటాయి. ఆదుర్తి .. దర్శకుడు కె విశ్వనాధ్ స్క్రీన్ ప్లే సమకూర్చారు . కె వి మహదేవన్ సంగీత దర్శకులు.
సినిమాలో కనిపించే ANR ఇల్లు ఆయనదే అనుకుంటా . 1969 జనవరిలో P.U.C విద్యార్ధిగా కాలేజి టూర్లో ఆయన్ని ఇంట్లో కలిసాం. లీలగా గుర్తుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు , ఉత్తమ చిత్రంగా నంది అవార్డు , ఫిలిం ఫేర్ అవార్డు , మాస్టర్ రాజాకు అవార్డులు వచ్చాయి . తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్లో , మన దేశంలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమా ప్రదర్శితమైంది.
ఈ సినిమా మొదలు కావడానికి ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. కథ విన్న నిర్మాతలు సుడిగుండాలు సినిమా తీయడానికి ముందుకు రాలేదు. ఇక చేసేది ఏమి లేక ఆదుర్తి తనే నిర్మాణ బాధ్యతలు నెత్తికెత్తుకున్నారు. ఈ క్రమంలో అక్కినేని కూడా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. అలా ఆ ఇద్దరూ సంయుక్తంగా చక్రవర్తి చిత్ర అనే సంస్థ స్ధాపించి చిత్రనిర్మాణం పూర్తి చేశారు.
యూట్యూబులో ఉంది.. తప్పక చూడవలసిన సినిమా. స్లోగా ఉంటుంది . కషాయం తియ్యగా ఉండదు కదా ! స్లో అయినా చూడండి .