ఆకట్టుకునే ‘మాయ’!!

Sharing is Caring...

Pudota Showreelu…………………………….

యవ్వనంలో అనేక ఒత్తిడులకు లోనై వివాహానికి నోచుకోక మనుషులకు దూరంగా .. ఒంటరి జీవితం గడుపుతున్న అందమైన మాయాదేవి,ఒక పెద్ద పురాతనమైన మహల్ లో వుంటుంది. తోడుగా రెండు పెద్ద భయంకరమైన కుక్కల్ని, పక్షుల్ని పెంచుకుంటూ వుంటుంది.

ఎప్పుడూ నల్లని బట్టలు ధరిస్తూ …ప్రపంచం పట్ల ఏహ్య భావం,మనుషుల పట్ల అపనమ్మకం కలిగి వుండే మాయ,ఆఖరికి తను తయారుచేసే అన్నీ ఆడపిల్లల బొమ్మలకు గూడా నల్లని బట్టలు వేస్తుంది. అలాంటి ఆమె జీవితంలోకి ” అన్నా, ఇరా ” అనే ఇద్దరు కాలేజీ అమ్మాయిలు ” ప్రవేశిస్తారు.

రోజూ మాయదేవిని గమనిస్తూ,ఆ మహల్ ముందు నుండి కాలేజ్ కి వెళ్ళే అన్నా,ఆమె స్నేహితురాలు ఇరా కలిసి,చీకటి నిండిన ఆమె జీవితానికి వెలుగు చూపించాలనుకుంటారు. “వేద్” అనే అబ్బాయి కల్పిత పేరుతో లవ్ లెటర్స్ రాస్తూ వుంటారు.ఎలాంటి ప్రేమకు నోచుకోని మాయా జీవితంలో ఆ ఉత్తరాలు పెను తుఫాను సృష్టిస్తాయి.

ఆ ఉత్తరాలు ఆమెలో ఉత్సాహం,ఆనందం, అలంకరణ పట్ల ఆసక్తి కలిగిస్తాయి.ఉత్తరం చదివి,మైమరిచి నాట్యం చేస్తూ,పాటలు పాడుతూ వుంటుంది.ఆ లవ్ లెటర్స్ తో ఆమె ఆత్మ విశ్వాసంపెరిగి, దైర్యం గల స్రీ గా రూపాంతరం చెందుతుంది. ఆ ఉత్తరాలు నిజమని నమ్మిన మాయాదేవి ఇక్కడ తన మహల్,అందులోని పురాతన వస్తువులు అమ్మేసి, ఏ మాత్రం తెలియని వేద్ ని వెతుక్కుంటూ ఢిల్లీ చేరుకుంటుంది.

విషయం తెలిసిన అన్నా బాధతో విలవిలలాడుతుంది.తను రాసిన వుత్తరాల వల్లే మాయా కష్టాలలో పడిందని వేదన చెందుతుంది. అన్నా కూడా ఢిల్లీ కాలేజ్ లో చేరుతుంది.. వీధుల్లో తిరుగుతూ,గోడల మీద మాయా ఫోటోలు అంటిస్తూ వెతుకుతూ వుంటుంది.మరి మాయాదేవి ఏమైంది.ఆమె వెతుకుతూ వున్న, వేద్ దొరికాడా? అసలు వేద్ వున్నాడా? ఎలాంటి పరిస్తితి లో ఆమె ఇరుక్కుంది.

అన్నా, ఇరా స్నేహం ఏమైంది.చివరికి కత ఏమైంది. తెలియాలంటే “DEAR MAYA” సినిమా చూడాల్సిందే. మాయాదేవి గా మనీషా కోయిరాలా అద్భుతమైన నటన ప్రదర్శించింది..క్యాన్సర్ పోరాడి గెలిచిన మనీషా మళ్ళీ నటించిన సినిమా ఇది..అలాగే అన్నా ( మదిహా ఇమామ్) సహజ నటన ముగ్ధ మనోహరమైన ఆమె మనల్ని ఆకట్టుకుంటుంది..

ఇరా( శ్రేయా చౌదరి) నటన గూడా చాలా సహజంగా వుంది. తక్కిన పాత్రధారులందరూ ఎవరికి ఎవరు తీసిపోకుండా చక్కగా నటించారు.పంజాబ్‌లోని ఒక సిక్కు మహిళ గురించి వచ్చిన వార్తాపత్రిక కథనం ఆధారంగా ఈ కథను రూపొందించారు 

2017 లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సునయన భట్నాగర్ దర్శకత్వం వహించారు. ఈ హిందీ సిన్మా,ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో యూ ట్యూబ్ లో వుంది.ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు. మసాలా సినిమా కాదు కాబట్టి .. అందరికి నచ్చకపోవచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!