ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ లో ఈ సారి త్రిముఖ పోరు జరగబోతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ BJP అధికారంలో కొనసాగుతోంది. గత ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. గత కొన్నేళ్లుగా ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు కొనసాగుతోంది. పంజాబ్ లో విజయంతో ఊపు మీద ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లో రంగంలోకి దిగడంతో త్రిముఖ పోరు అనివార్యమైంది.
182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్ లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం 111 ఎమ్మెల్యేలతో BJP అధికారంలో ఉండగా.. 62 మంది ఎమ్మెల్యేలు కలిగిన కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. బీటీపీకి ఇద్దరు, ఎన్సీపీకి ఒకరు, ఒక స్వతంత్ర అభ్యర్థి ఉండగా.. ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
గత ఆరు ఎన్నికల్లో వరుసగా గెలిచిన BJP కి మరోసారి అధికారాన్ని నిలుపుకోవడం కీలకంగా మారింది. 2024 లో సార్వత్రిక ఎన్నికలకు ముంగిట ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం కూడా కావడం తో వారికి కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. ఇప్పటికే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆప్,కాంగ్రెస్ నేతలు పలు కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు.
ఇప్పటికే ప్రధాని మోదీ పలుమార్లు గుజరాత్ లో పర్యటించారు. ఇటీవలే రాష్ట్రంలో వివిధ చోట్ల రూ. 15,670 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి నినాదం తో BJP ప్రచారం చేస్తోంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మోర్బీ దుర్ఘటన జరగడం అధికార పార్టీకి ఇబ్బంది కలిగించే అంశం. దీన్ని ఆయుధంగా మలుచుకోవాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
మోర్బీ విషాదం బిజెపి అవినీతికి ప్రత్యక్ష ఫలితం, ఇక్కడ మానవ ప్రాణాలకు విలువ లేదని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు ఉపశమనం కల్పించడం వంటి అంశాలను ప్రచారంలో ప్రస్తావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిడిపి 18-23 శాతం ఉండగా BJP ప్రభుత్వ హయాంలో రాష్ట్రం 1.35 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో BJP కి గట్టి పోటీ నిచ్చిన కాంగ్రెస్.. ఈ సారి ప్రచారంలో వెనకబడిపోయింది.అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో తలమునకలవ్వగా.. జాతీయ స్థాయి నేతలెవరూ గుజరాత్ లో పెద్దగా కనిపించడం లేదు.
ఇక కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు పెంచింది.గుజరాత్ లోనూ పాగా వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గుజరాత్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఉచిత విద్య, వైద్యం వంటి సంక్షేమ హామీలతో ఆ పార్టీ ప్రచారంలో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలోని అన్ని స్థానాలకూ పోటీ చేయాలని భావిస్తోంది.
గుజరాత్ ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి మూడు ఎన్నికల్లో (1962, 1967, 1972) కాంగ్రెస్సే విజయం సాధించింది. ఎమర్జెన్సీ కారణంగా మధ్యలో అధికారానికి దూరమైనా.. 1980, 85 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించింది. 1990లో తొలిసారి జనతాదళ్ తో కలిసి BJP అధికారంలోకి వచ్చింది.
ఆ మరుసటి (1995) ఎన్నికల నుంచి వరుసగా BJP నే అధికారంలో కొనసాగుతోంది. మధ్యలో 1996-98 మధ్య వాఘేలా తిరుగుబాటు చేసి కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ రెండేళ్లు మాత్రం BJP అధికారానికి దూరమైంది. ఇక సర్వేలు BJP కి అక్కడి ఓటర్లు అనుకూలంగా ఉన్నట్టు చెబుతున్నాయి.
అధికార పార్టీపై కొంత అసంతృప్తి ఉంది కానీ దాన్ని ఎంత వరకు విపక్షాలు సొమ్ము చేసుకోగలవో చూడాలి . ఆప్ .. కాంగ్రెస్ బరిలో ఉండటం మూలానా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. అది BJP కి ప్లస్ అవుతుందని అంటున్నారు. ఫలితాలు వచ్చాక కానీ వాస్తవం ఏమిటో తేలదు.