Strange shapes…………………..
మెక్సికో పార్లమెంటు (కాంగ్రెస్) సమావేశాల్లో రెండు చిన్న వింత ఆకారాలను ప్రదర్శించారు. సభ్యులంతా ఈ వింత ఆకారాలను చూసి విస్తు పోయారు. గ్రహాంతరవాసుల భౌతికకాయాలుగా భావిస్తున్న రెండు వింత ఆకారాలను కొందరు పరిశోధకులు పార్లమెంటుకు తీసుకొచ్చారు. తమ పరిశోధనల్లో ఇప్పటివరకూ వెలుగుచూసిన అంశాలను సభ్యులకు నివేదించారు. ఇలా పార్లమెంటు సభ్యుల ముందు తమ పరిశోధన వివరాలను తెలియజేసినవారిలో మెక్సికోతో పాటు అమెరికా, జపాన్, బ్రెజిల్ పరిశోధకులూ ఉన్నారు.
గ్రహాంతరవాసుల ఉనికి నిజమే అయ్యుండొచ్చని వారు భావిస్తున్నారు . పెరూలోని నజ్కా ఎడారిలో జరిపిన తవ్వకాల్లో 2017లో రెండు విచిత్ర ఆకారాలు బయటపడ్డాయి. అవి గ్రహాంతరవాసులవేనని అప్పటి నుంచి పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా బయటపడ్డ వాస్తవాలను మెక్సికో కాంగ్రెస్ సభ్యులకు తెలియజేసేందుకే..ఆ రెండు ఆకారాలను పరిశోధకులు పార్లమెంటుకు తీసుకొచ్చారు. ఇవి వెయ్యేళ్ల క్రితం నాటివని భావిస్తున్నారు.
మెక్సికో పాత్రికేయుడు జోస్ జైమ్ మౌసాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ- ఆ వింత ఆకారాలు మానవేతరులవని డీఎన్ఏ పరీక్షల్లో స్పష్టమైందని అంటున్నారు. భూ ప్రపంచంలో వేటికీ అవి సరిపోలడం లేదని చెబుతున్నారు. కాబట్టి గ్రహాంతరవాసుల ఉనికి వాస్తవమేనని విశ్వసించాల్సిన అవసరముందని అంటున్నారు. పార్లమెంటులో ప్రదర్శించిన ఈ ఆకారాలు.. గ్రహాంతరవాసులవేనని పక్కాగా ఇప్పుడే తాను చెప్పలేనని అంటున్నారు.
ఈ అంశంపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా(NASA) తన అభిప్రాయం వ్యక్తం చేసింది. వాస్తవంగా అవి ఏమిటో స్పష్టత లేదని, అయితే ఈ విషయంలో పారదర్శకత ముఖ్యమని అంటోంది. ఆ ఆకారాలు దేనికి సంబంధించినవో స్పష్టత లేదు. ఏదైనా వింతగా అనిపించినప్పుడు.. వాటిని నిపుణుల ముందుకు తీసుకెళ్లాలి.. మరింత లోతుగా శోధించాల్సి ఉందని నాసా అభిప్రాయపడింది. ఈ ఆకారం తల కింది భాగం మానవుని శరీర భాగాన్ని పోలిఉంది.