ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు అళగిరి. దివంగత నేత కరుణానిధి పెద్ద కుమారుడు .. ప్రస్తుత డీఎంకే నేత.. తమిళనాడు సీఎం స్టాలిన్ అన్న. అళగిరి మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్తగా పార్టీ పెడతానంటూ హడావుడి చేసాడు. అసలు కార్యకర్తలు అంతా తన వెనుకే ఉన్నారంటూ బీరాలు పోయాడు. అంతకు ముందు కూడా చాలా సార్లు పార్టీ పెడుతున్నట్టు చెప్పాడు కానీ అవన్నీ ప్రకటనలకే పరిమితమైనాయి.
డీఎంకే పార్టీ పగ్గాల కోసం స్టాలిన్ తో పోరాటం చేస్తానంటూ చాలాసార్లు ప్రకటనలు చేసాడు. ఎన్నికల సమయంలో ఏదో హడావుడి చేసేందుకు ప్రయత్నించాడు కానీ కుటుంబ సభ్యులు అడ్డం పడ్డారు. ఎన్నికలు ముగిసే వరకు ప్రశాంతంగా ఉండమని స్నేహితులు కూడా సలహా ఇవ్వడంతో అళగిరి “సైలెంట్ మోడ్”లో ఉండిపోయారు.ఎన్నికలు పూర్తి అయ్యి డీఎంకే అధికారంలోకి రావడంతో ప్రెస్ మీట్ పెట్టి మరీ స్టాలిన్ ను అళగిరి అభినందించారు.
స్టాలిన్ ప్రమాణ స్వీకారానికి అళగిరి వెళ్ళలేదు కానీ కుటుంబ సభ్యులను పంపారు. తర్వాత పార్టీ లో చేర్చుకోమని సన్నిహితుల ద్వారా స్టాలిన్ కి రాయబారాలు పంపుతున్నారు. కానీ స్టాలిన్ వాటిని పట్టించుకోలేదు. చూద్దాములే అంటూ వాయిదా వేస్తున్నారట. అళగిరి వ్యవహారశైలి తెలిసిన పిల్లలు ఆయన పై ఆంక్షలు పెట్టారని అంటారు. అందుకే సైలెంట్ అయ్యారట.
అళగిరి కొన్నేళ్ల క్రితమే కుటుంబానికి ..పార్టీకి దూరమయ్యారు. అళగిరి కి దూకుడు ఎక్కువని గ్రహించిన కరుణానిధి ముందుగానే తన రాజకీయ వారసుడిగా స్టాలిన్ పేరును ప్రకటించాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అళగిరి అప్పట్లోనే తండ్రి ప్రకటనపై నిరసన వ్యక్తం చేశాడు. అయితే అళగిరిని బుజ్జగించిన కరుణానిధి అతనికి కేంద్రమంత్రి పదవిని కట్టబెట్టి, రాష్ట్ర పార్టీ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోరాదని, డీఎంకే పార్టీ పగ్గాలను స్టాలినే చేపట్టేందుకు సహకరించాలని ఒత్తిడి తెచ్చాడు.
అప్పటికి కరుణానిధి మాట విని కేంద్ర క్యాబినెట్లో చేరిన అళగిరి 2014 ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమయ్యేలా వ్యవహరించాడని అంటారు. దీంతో కరుణానిధి ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. తర్వాత కొంత కాలం మౌనంగా ఉన్న అళగిరి, తండ్రి మరణంతో మళ్లీ పార్టీ పగ్గాలకోసం రంగం లోకి దిగి హడావుడి చేసాడు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు.
ఒక తల్లి బిడ్డలే అయినప్పటికీ అళగిరి, స్టాలిన్ వర్గాల మధ్య పోరు ఈనాటిది కాదు. పార్టీలో ఏ పదవులు ఇవ్వలేదని అలిగి అళగిరి 1989 నుంచి తండ్రికి దూరంగా మధురై లో ఉండేవారు. ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థుల విజయం కోసం కృషి చేసేవాడు. ఆ ప్రాంతంలో కొంత పలుకుబడి సంపాదించారు. అక్కడ సొంత మనుష్యులనే నేతలుగా పెట్టుకున్నారు.స్టాలిన్,అళగిరి వర్గాల మధ్య ఎన్నో సార్లు గొడవలు జరిగేయి.
2007 లో పార్టీ పత్రిక ‘దినకరన్’ మధురై కార్యాలయం పై అళగిరి అనుచరులు దాడిచేసి నిప్పుపెట్టారు. ఈ దాడిలో దినకరన్ స్టాఫ్ ముగ్గురు చనిపోయారు. అప్పట్లో అదొక సంచలన ఘటన. దినకరన్ సన్ టీవీ గ్రూప్ పత్రిక. కరుణానిధి మేనల్లుడు మురసోలి మారన్ ఈ పత్రిక వ్యవహారాలు చూసేవారు. ఇందులో మేజర్ వాటా కరుణానిధి దే అంటారు. స్టాలిన్ .. అళగిరి లలో ప్రజలు స్టాలిన్ వైపు అధికంగా మొగ్గు చూపుతున్నారని ఆ పత్రిక అప్పట్లో వార్తాకథనాలు ప్రచురించింది.
అదే సమయంలోనే సన్ టీవీ కార్యాలయంపై కూడా దాడులు జరిగేయి.మారన్ కొడుకు దయానిధి ఈ వ్యవహారం పై కరుణానిధి చర్య తీసుకోలేదని,ఆయనపై కోపం తో ప్రధాని మన్మోహన్ సింగ్ చెన్నై పర్యటనకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే ఆయన పదవిని కోల్పోయారు. ఈ గొడవలు జరిగిన నేపధ్యంలోనే కరుణానిధి కొడుకును పిలిపించి గట్టిగా మందలించి బుద్ధిగా ఉంటే ఎంపీగా కేంద్రంలోకి పంపుతా అని చెప్పి 2009 ఎన్నికల్లో మధురై ఎంపీ టిక్కెట్ ఇచ్చారు.
ముందే చెప్పకున్నట్టు అపుడు తండ్రి మాట కు ఒప్పుకుని అళగిరి కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు. ఎరువుల శాఖ మంత్రిగా పని చేసిన అళగిరిపై అప్పట్లో కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. 2013 లో యూపీఏ నుంచి డీఎంకే శ్రీ లంక తమిళుల వ్యవహారంలో వైదొలగింది.ఇక 2014 ఎన్నికల్లో పార్టీ అళగిరికి టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన కూడా పార్టీకి వ్యతిరేకంగా పని చేయడంతో అక్కడ అన్నా డీఎంకే అభ్యర్థి గెలిచారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అళగిరి.. పార్టీని చావుదెబ్బ కొట్టారు. ఫలితంగానే డీఎంకే అధికారానికి దూరమైంది. దీంతో అళగిరిని కరుణానిధి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి అళగిరి దాదాపుగా పార్టీకి అలాగే తండ్రికి దూరంగా ఉంటూ వచ్చారు. వారసత్వవ్యవహారం పైనే అలిగిన అళగిరి.. గతంలో ఎన్నోసార్లు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. అళగిరి ఎప్పటినుంచో కొత్త రాజకీయ పార్టీని స్థాపించే ఉద్దేశంలో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాడు . కానీ పెట్టింది ఏమీ లేదు.
———- KNM