Pudota Sowreelu …………………
‘మిన్నమినుంగు … ది ఫైర్ ప్లే” ఈనాటి బంధాలకు … అనుబంధాలకు అద్దం పట్టిన సినిమా. డైరెక్టర్ అనిల్ థామస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భర్తను కోల్పోయిన ఒక ఆడది పేదరాలైనప్పటికి,తన కష్టంతో, ఆత్మాభిమానంతో 70 ఏళ్ల ముసలివాడైన తండ్రితో కలిసి బతుకుతూ వుంటుంది.ఒక్కగానొక్క కూతురు ‘చారు'[రెబక్క]జీవితానికి బంగరుబాటలు వేయాలని తపన పడుతూ వుంటుంది.
ఆమె[సురభి లక్ష్మి] పొద్దున్న లేచింది మొదలు రాత్రి పొద్దు పోయే వరకూ రెండు కాళ్ళు ఒకచోట పెట్టకుండా ఏదో ఒక పని చేస్తూ,ఇటు తండ్రికి,అటు బిడ్డకు కావలసిన అవసరాలు తీరుస్తూ వుంటుంది.కూతుర్ని కాలేజీ హాస్టల్ లో పెట్టి, ఉన్నత చదువులు చదివిస్తూ వుంటుంది.ఆమెకు ఏ లోటు రాకుండా చూడాలనేదే ఆ తల్లి ఆరాటం.
చీకటితోనే లేచి,ఆవుపాలు పిండి,ఇంట్లో పనులన్నీచేసుకుని,వంట వార్పూ ముగించి,పెరట్లోని ఆర్గానిక్ కూరగాయలు తెంపి,కోళ్ళు పెట్టిన గుడ్లు సంచిలో సర్దుకుని,వీటన్నిటిని పట్నంలో అమ్ముకోవటానికి పడవలో బయలుదేరి,బస్ లో పట్నం చేరుతుంది.వాడుక ఇళ్ళలో పాలు,దుకాణాలలో కూరగాయలు,గుడ్లు ఇచ్చి ఉరుకులు,పరుగులు మీద తను అటెండర్ గా పనిచేసే ఆఫీసుకి టయానికి చేరుకుంటుంది.
సాయంత్రం వరకూ ఆఫీస్ లో వూడవటం,తుడవటం,స్టాఫ్ కి ఫైల్స్,కాఫీ,టీలు,భోజనాలు అందించటంతో అలిసి పోతూ వుంటుంది.అంతేగాకుండా వారానికి మూడు రోజులు రచయిత mn మోహన్ ఇంట్లో పనిచేయటం,ఇంకా కొత్త కొత్త పనులు ఒప్పుకుంటూ క్షణం తీరిక లేకుండా కష్ట పడుతూ,కూతురి కోసం పైసా పైసా కూడ బెడుతుంది.ముసలి తండ్రి గూడా ఏదోఒక పని చేస్తూ కూతురికి అండగా ఉంటాడు.
ఈ లోగా తండ్రికి జబ్బు చేసి హాస్పిటల్ పాలవుతాడు.డాక్టర్ ఎంతో శ్రద్దగా వీళ్ళను చూస్తూ,ఈమె స్తితిగతులు కనుక్కుంటాడు.వారం మధ్య లో రావాలంటే ఆఫీస్ కి లీవ్ పెట్టుకోవాలి. కాబట్టి ఆదివారం వచ్చి తాను ఇచ్చే ఉచిత మందులు తీసుకెళ్ళమంటాడు.అలా తన మీద నమ్మకం పెంచుకున్నాక ఒకరోజు డాక్టర్ ”నువ్వు చాలా నీరసంగా కనబడుతున్నావు,బల్ల మీద పడుకో,చూస్తా” అంటూ వెకిలి చేష్టలు మొదలు బెడతాడు.
ఆమె ఎంతో అసహ్యంతో,సివంగిలా లేచి డాక్టర్ ని దులిపేస్తుంది. అక్కడ నుండి రచయిత mn మోహన్ దగ్గరకు వచ్చి తన వేదన వెళ్ళబోసుకుంటుంది.మోహన్ ఆమె పట్ల జాలి చూపిస్తూ,ఆమెకు సలహాలు ఇస్తూ ఉంటాడు.ఇక్కడ mn కి ఆమెకి మధ్య మానవ సంబందాలు,ఒంటరి స్రీల సమస్యల మీద చక్కని సంభాషణ సాగుతుంది.
కూతురు చారు తల్లి కష్టాన్ని అర్ధం చేసుకోకుండా అన్నీ గొంతెమ్మ కోరికలు కోరుతూ,గొప్పోళ్ళ పోకడలు పోతూ వుంటుంది.ఆఖరికి హాస్టల్ నుండి రెండురోజులు ఇంటికి వచ్చి,తల్లి,తాతతో గడపటానికి గూడా అంతగా ఇష్టపడదు.తల్లికి తన బాయ్ ఫ్రెండ్ విషయం గూడా తెలియనీయదు.అతనితో కలిసి కెనడా వెళ్లి,అక్కడే స్తిరపడాలని,జీవితాన్ని ఎంజాయ్ చేయాలని అనుకోని ఒక కంపెనీతో మాట్లాడుకుంటుంది.
ఇక వెళ్ళటానికి సిద్దమవుతూ,ట్రావెల్ ఏజెన్సీకి కట్టాల్సిన ఆరు లక్షల గురించి తల్లికి చెబుతుంది.తాను పై చదువుల కోసం కెనడా వెళ్తున్నానని,పది రోజుల్లో డబ్బు సమకూర్చమని తల్లికి చెబుతుంది.కానీ,అసలు విషయాలేమీ తల్లికి చెప్పదు. కానీ ఆమెకి కూతురు విదేశాలకు వెళ్ళటం ఇష్టం వుండదు.ఇక్కడే వుండి, మంచి వుద్యోగం,పెళ్ళి,సంసారం,చేసుకుంటూ,తాతతో,తనతో గడపాలని కోరుకుంటుంది.
ఇక ఇక్కడి నుండి ఆమె డబ్బు కోసం ఎన్ని బాధలు పడుతుందో చూడాలి.డబ్బు కోసం తన తల్లిదండ్రులు కట్టిచ్చిన ఇల్లు అమ్ముతూ,ఆమె,ఆమె తండ్రి పడిన వేదన వర్ణనాతీతం. ప్రతి ఇటుకను ప్రతి మొక్కను తడిమి తడిమి చూసుకుంటారు. ఆఫీస్ లో ఉద్యోగానికి రిజైన్ చేస్తే,,పిఎఫ్ లక్ష రూపాయలు వస్తాయని రిజైన్ చేస్తుంది.
కూతురి కోసం బంగారం లాంటి వుద్యోగం వదులుకుంటుంది.పాలిచ్చే ఆవులు,గుడ్లు పెట్టె కోళ్ళు అమ్మేస్తుంది.ఇంకా అదిక వడ్డీకి అప్పులు తీసుకుంటుంది.తను పనిచేసే ఇళ్ళలో కొంత అప్పుగా తీసుకుంటుంది.mn కొంత సాయం చేస్తాడు..ఈ పనులన్నిటిలోఆఫీస్ లో తనని అర్ధం చేసుకుని,తనతో స్నేహంగా వుండే పెద్ద ఉద్యోగిని అయిన ‘విని’సాయ పడుతూ వుంటుంది.
ఆరు లక్షలు తీసుకుని,విని తో కలిసి ట్రావెల్ ఏజెన్సీ కి వెళ్తుంది.ఆ ఏజెన్సీ లో ఆమెకు తెలిసినామే ద్వారా కూతురి విషయం మొత్తం తెలుస్తుంది.కెనడా నుండి ఇక తిరిగి రాదనీ,తన ప్రేమికుడితో కలిసి వెళ్ళిపోతుందని తెలుసుకుని, షాక్ కు గురై విపరీతంగా చలించి పోతుంది.అయినా కూతురిని ఈ విషయంలో నిలదీయదు.విషయం తన మనసులోనే వుంచుకుంటుంది.
తండ్రికి గూడా చెప్పదు.తనను తాను ఓదార్చుకుని,డబ్బు కట్టేస్తుంది. ఇంటి కొచ్చిన కూతురికి అన్నీ తయారుజేసి సర్ది ఇస్తుంది.కూతురిని హత్తుకుని గుండె లవిసేలా ఏడుస్తుంది.బిడ్డ గూడా బాధ పడుతుంది గానీ,అప్పటికి గూడా తన విషయం తెలియనీయదు.సూట్కేసులు సర్దుకుని బయలు దేరుతున్న కూతురితో”నీ ఉన్నత చదువులు పూర్తి చేసుకుని తిరిగి రా,నువ్వొచ్చేసరికి కష్టపడి నీకో మంచి ఇల్లు కట్టిస్తాను.” అంటుంది.
బాధ పడుతున్న తాత,తల్లి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతుంది.ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులకు తెలియ కుండా చేసే పనులు,వారికి తెలిసిన తర్వాత,వాళ్ళు అనుభవించే వేదన,తమ అత్యవసరాలు గూడా పక్కన పెట్టి,పిల్ల అవసరాలకే ఇచ్చే ప్రాధాన్యత.. ఈ సినిమాలో చక్కగా చూపించారు.
”సమాజంలో నిరుపేదల దినచర్యను తెరకెక్కించిన సినిమా ఇది.ఈ సినిమాలో సురభి లక్ష్మి అసలు నటించనే లేదు..’జీవించింది’.నగర రహదారులలో ఆమె చురుకైన నడక చూసి తీరాల్సిందే.మలయాళంలో ఈ సినిమాలో సురభి నటనకు ”జాతీయ ఉత్తమ నటి అవార్డు ”వచ్చింది.
2017 లో వచ్చిన ఈ సినిమాకు కథ మనోజ్ సింగ్ ,సినిమాటోగ్రఫీ సునీల్ ప్రేమ,దర్శకత్వం అనిల్ థామస్.ఈ సినిమాలో ఆమె [తల్లి] పాత్రకు పేరుండదు.నేటి పరిస్తితులను కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా netflix లో,ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వుంది.
చివరకు mn తో తన వేదన చెప్పుకుంటూ,అప్పుడే ఆకాసంలో పోతున్న విమానం చూపిస్తూ,తన కూతురు కిటికీ పక్కనే కూర్చుని కూర్చున దని,ఆమె సంతోషమే తన సంతోషమని,ఆమె తప్పక తిరిగి వస్తుందని,అప్పటికీ ఒక మంచి ఇల్లు కట్టటానికి ఇంకా,ఇంకా కష్టపడతానని అంటుంది.పిచ్చితల్లి.” లోకంలో తల్లులందరూ ఇంతేనేమో”
”మిన్నమినుంగు ది ఫైర్ ప్లే” తల్లులందరికి నచ్చే సినిమా.