ఆర్ధిక ఇబ్బందుల్లో ఆఫ్ఘన్లు…తాలిబన్లు !

Sharing is Caring...

దేశం సంక్షోభంలో చిక్కుకుపోవడంతో ఆఫ్ఘన్లు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఏదేశం కూడా ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రాని నేపథ్యంలో తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక మానసికంగా నలిగిపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు,బ్యాంకులు, పాఠశాలలు, హోటళ్లు , వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. తెరిచిన కొన్ని బ్యాంకుల్లో డబ్బులేదు. కార్యకలాపాలు స్థంభించడంతో ఆర్ధిక వ్యవస్థ పతనమైంది.

ప్రభుత్వ ఉద్యోగులు,టీచర్లు, ఇతరులు జీతాలు రాక, చేతిలోడబ్బులేక ఇక్కట్లు పడుతున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనేలోగా ఆకలి మరణాలు తప్పేలా లేవని అంటున్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ సంస్థలు ఎక్కడికక్కడ డబ్బును నిలిపివేశాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు మొదలై సామాన్యులతో పాటు తాలిబన్లు కూడా ఇబ్బంది పడుతున్నారు.

ప్రభుత్వం చేతిలో ఉంది కానీ డబ్బులు లేవు. ఆర్ధిక వ్యవస్థ కోలుకోవాలంటే మరింత సమయం పట్టవచ్చు. జనంలో భయం తగ్గి మళ్ళీ సాధారణ పరిస్థితి ఎప్పటికొస్తుందో తెలియదు.  తాలిబన్ల వ్యవహారశైలి మారితేకానీ అంతర్జాతీయ సమాజం నుంచి సహాయం అందదు. నిన్న మొన్నటిదాకా మిషన్ గన్లు పట్టుకుని గాల్లోకి కాల్పులు జరుపుతూ జోష్ గా తిరిగిన  తాలిబన్ దళాలు చేతిలోడబ్బులు లేక నానా తిప్పలు పడుతున్నారు. కనీసం సరైన తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. తాలిబన్ సైన్యంలో భాగమైన దళాలకు కొన్ని నెలలుగా జీతాలు కూడా రాకపోవడంతో ఆకలికి అల్లాడుతున్నారని అమెరికన్  మీడియా చెబుతోంది.  దీంతో ఆర్థిక ఇబ్బందులు మొదలై సామాన్యులతో పాటు తాలిబన్లు ఇబ్బంది పడుతున్నారు.

ఇదిలా ఉంటే అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల వ్యవహార శైలి పట్ల మానవ హక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతం లో తమకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి సహకరించిన వారిపై తాలిబన్లు ప్రతీకార చర్యలకు దిగుతున్నారని  మానవహక్కుల సంస్థ అంటున్నది. ఉత్తర అఫ్గానిస్థాన్‌లో ఉన్నగత ప్రభుత్వ మద్దతుదారులపై తాలిబన్లు దాడిచేసి వారిని బలవంతంగా వారి ఇళ్ల నుంచి వెళ్లగొట్టారు. అంతటితో ఆగకుండా ఆస్తులను లూటీ చేశారు. ఆపై వారి ఇళ్లను తగలబెట్టారు.

అమెరికా సేనలు ఇంటి దారి పట్టగానే తాలిబన్లు దేశంలోని ఉత్తర ప్రాంతాలను ఒక్కొక్కటిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కుందుజ్‌తో పాటూ ఇతర ఉత్తర ప్రాంత ప్రావిన్సులలోగల 150కిపైగా జిల్లాల్లో తాలిబన్లు ప్రతీకార దాడులకు దిగారని హ్యూమన్ రైట్స్ వాచ్ ఒక నివేదికలో ప్రస్తావించింది. కొన్ని చోట్ల తాలిబన్ దళాలు కొంత మంది అధికారులను.. భద్రతా దళ సిబ్బందిని ఉరితీసాయి.

అలాగే జర్నలిస్టులు, పౌర సమాజ సభ్యులతో పాటు, మాజీ ప్రభుత్వ అధికారుల ఇళ్లపై దాడులు చేశారు. మీడియా స్వేచ్ఛను నియంత్రించారు. ఇక మహిళల హక్కుల సంగతి అందరికి తెల్సిందే.  ఈ క్రమంలోనే తాలిబన్లు అకృత్యాలకు పాల్పడకుండా తమ దళాలను నాయకులు నియంత్రించాలని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆసియా శాఖ విజ్ఞప్తి కూడా చేసింది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!