ఎన్టీఆర్ నటించిన ‘అడవి రాముడు’ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఎన్టీఆర్, రాఘవేంద్రరావుల కలయకలో వచ్చిన తొలి చిత్రం ఇది. ఈ సినిమాతో రాఘవేంద్రరావు స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో 12 చిత్రాలు రూపొందాయి. తెలుగు సినీ ప్రపంచంలో కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టింది అడవి రాముడు సినిమా.
తొలిసారిగా సాంఘిక కథా చిత్రమైన ‘అడవి రాముడు’ అప్పట్లో 4 కోట్ల గ్రాస్ సాధించి చరిత్ర సృష్టించింది.ఏడాది పాటు ఏకధాటిగా ఆడింది. తెలుగు సినిమా స్టామినా ఎంతో బాక్సాఫీస్ వద్ద చాటి చెప్పింది. ‘అడవి రాముడు’ తర్వాతనే భారీ సినిమాలు తీయడానికి దర్శక, నిర్మాతలు ధైర్యం చేశారు. నలభై మూడేళ్ళ ఏళ్ళ క్రితం నాటి టికెట్ రేట్లు, రూపాయి విలువ లెక్కల్ని ఇప్పటి లెక్కలతో పోల్చి చూస్తే, అడవి రాముడు దాదాపు 500 కోట్ల వసూలు చేసిన సినిమాగా చెబుతారు.
ఎన్టీఆర్, జయప్రద, జయసుధ, కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘అడవి రాముడు’. ఈ సినిమా తర్వాత వీళ్లిద్దరు టాప్ హీరోయిన్లుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్‌కు ఈ సినిమా సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. ఈ సినిమాతో ఎన్టీఆర్ నటించిన చిత్రాల సరళిలో మార్పులొచ్చాయి. తెలుగులో నంబర్ వన్ హీరో అయ్యారు. ఈ చిత్రంతోనే ఆయన పారితోషికం రూ.12 లక్షలకు పెరిగింది. ఇందులో నటించిన వారందరికి స్టార్‌డమ్ వచ్చింది.
సాంకేతిక నిపుణుల స్థాయి పెరిగి పోయింది. ఎన్టీఆర్ ఈ చిత్రం కోసం 85 రోజులు మధుమలై అడవుల్లో ఉన్నారు. ఎన్టీఆర్ అలా ఔట్‌డోర్‌లో ఉండడమనేది కూడా ఈ చిత్రంతోనే మొదలైంది. అడవిరాముడు సినిమాలో ఎన్టీఆర్ ధరించిన దుస్తులు, ఆ తర్వాత సినీ హీరోల కాస్ట్యూమ్ ల విషయంలో కొత్త ట్రెండుకు దారితీశాయి. విజయవాడకు చెందిన యాక్స్ టైలర్స్ ఎన్టీఆర్‌కు ప్రత్యేక శ్రద్ధతో దుస్తులు కుట్టారు. దీంతో యాక్స్ టైలర్సు ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.
ఎన్టీఆర్ కూడా అనేక చిత్రాలకు యాక్స్ టైలర్స్‌నే రికమండ్ చేసేవారు. ఇక వేటూరి, జంధ్యాల ఇద్దరూ ఈ సినిమాతో స్టార్ రైటర్లుగా మారిపోయారు. ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ అని వేటూరి రాస్తే ‘చరిత్ర అడక్కు… చెప్పింది విను’ పంచ్ డైలాగ్ జంధ్యాల రాశాడు. జంధ్యాల చెలరేగిపోయి డైలాగులు రాసిన సినిమాలలో ఇదొకటి. ఈ సినిమాలో నాగభూషణం తన కొడుకైన సత్యనారాయణ ఏదడిగినా ఏదో ఒక పాత సంగతి చెబుతుంటాడు.
“రేయ్..హరిశ్చంద్ర నాటకంలో కృష్ణుడి పద్యాలు పాడి చెప్పుదెబ్బలు తిన్న దొనకొండ గాబ్రియల్ లాగా కావడం నాకిష్టం లేదు” “చరిత్ర అడక్కు… చెప్పింది విను” అన్న డైలాగులు చాలా పాపులర్ అయ్యాయి. వేటూరి మాస్టారి పాటల్లో “మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ”, “అమ్మతోడూ అబ్బతోడూ నీ తోడూ నాతోడూ” వంటి పాటలు ఇప్పటికి వినబడుతుంటాయి. మహదేవన్ కూడా అద్భుతమైన ట్యూన్స్ అందించారు.
ఈ సినిమా మూల కథ కన్నడ హీరో రాజకుమార్ నటించిన హిట్ చిత్రం “గంధడ గుడి” సినిమాది. జంధ్యాల,రాఘవేంద్రరావులు దాని రూపు రేఖలు మార్చి ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టుగా కథ రూపొందించారు. కొన్నేళ్ల తర్వాత ప్రభాస్ హీరోగా ఇదే టైటిల్‌తో సినిమా వచ్చింది. ఈ చిత్రంలో “ఆరేసుకోబోయి” పాటను రీమేక్ చేసారు.
అడవి రాముడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బి.గోపాల్ కొత్త అడవి రాముడు సినిమాను డైరెక్ట్ చేసారు. కానీ పెద్దగా ఆడ లేదు. ఏప్రిల్ 28,1977లో విడుదలయిన ఈ చిత్రం 32 కేంద్రాలలో 100 రోజులు ఫుల్ కలెక్షన్లతో ఆడింది. అలాగే 16 సెంటర్లలో 175 రోజులు, 4 సెంటర్లలో ఏడాదిపాటు ఆడి రికార్డులు సృష్టించింది. 8 సెంటర్లలో 200 రోజులుకు పైగా నడిచింది. నెల్లూరు కనక మహల్ థియేటర్‌లో రోజూ 5 షోలతో 100 రోజులు ఆడింది.
———-KNM