War Story ………………………………………………..”భుజ్ ” ది ప్రైడ్ ఆఫ్ ఇండియా …. టైటిల్ బాగుంది. కానీ సినిమా తెర కెక్కిన విధానం ఆసక్తికరం గా లేదు. సినిమా 1971 ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలో నడుస్తుంది. భుజ్ ప్రాంతాన్ని ఆక్రమించు కునేందుకు పాక్ పన్నాగం పన్నుతుంది. ఈ క్రమంలో భుజ్ చేరుకోవడానికి మార్గాలను దెబ్బతీస్తుంది. భుజ్ ఎయిర్ బేస్ ను నాశనం చేస్తుంది. వంతెనలను కూలుస్తుంది.
ఈ పరిణామాలను ఎదుర్కొని భారత్ సైన్యం పాక్ ను ఎలా ఎదురు దెబ్బ తీశారనేది కథ. ఈ ఎయిర్ బేస్ నిర్మాణానికి సమీప గ్రామ మహిళలు ఎలా సహకరించారు అనేది మరో పాయింట్. సినిమా లో రెండు ప్రధానమైన పాయింట్లు చారిత్రిక అంశాలే. వాటిని విస్తరించడంలో దర్శకుడు చాతుర్యం లోపించింది.
భుజ్‌లో బాంబు పేలి నాశనమైన ఎయిర్ స్ట్రిప్‌ను పునర్నిర్మించడంలో పనిచేసిన 300 మంది మహిళలో ఒకరైన లక్ష్మి పర్మార్ దర్శకుడు అభిషేక్ సొంత అమ్మమ్మ కావడం విశేషం. ఆ స్పూర్తితో కథ రాసుకున్నారు. మాదాపర్ గ్రామ ప్రజలు ఎయిర్ వే నిర్మాణంలో ఎలా పాలుపంచుకున్నారో చూపించాలనుకున్నారు. ఒక పాట లో చూపించేసి వదిలేశారు. అక్కడక్కడ ఆయన లాజిక్స్ మర్చిపోయారు. మరో 5 గంటల్లో పాక్ సైనికులు దాడి చేయబోతున్నారని తెలిసి ఎవరైనా పాట పాడుకుంటారా ?
ఇక ఈ సినిమా నిర్మాతల్లో అజయ్ దేవగన్ ఒకరు. భుజ్ ఎయిర్ పోర్ట్ ఇంచార్జ్ గా కథలో ఆయన పాత్ర పరిమితం. కానీ కథ ఆయన చుట్టూ నడిపించారు. ఎయిర్ వే నిర్మాణానికి మహిళలను ప్రేరేపించడం … విమానం ముందు భాగాన్ని ట్రక్ పై ఎక్కించుకుని నడపడం వంటి సన్నివేశాల్లో అజయ్ బాగానే నటించాడు. మిగతా సినిమాలో ఎక్కడా బలమైన సన్నివేశాలు .. నాటకీయత కనిపించవు. పాక్ భారత్ ఏజెంట్ గా పనిచేసిన మహిళ ఎపిసోడ్ బాగుంది ..దాన్నికూడా డెవలప్ చేయ లేదు. ధైర్యం, దేశభక్తి నినాదాలు బాగున్నాయి.
బలమైన కథ లేకుండా…. భావోద్వేగాలు లేకుండా .. యుద్ధ సన్నివేశాలను నమ్ముకుని సినిమా తీసినట్టున్నారు. పాక్ సైనికులతో చివర్లో ఏజెంట్ సంజయ్ దత్ వీధి పోరాటాల్లో మాదిరిగా గొడ్డలి తో యుద్ధం చేయడం విచిత్రం అనిపిస్తుంది. కథను ఆర్మీ ఆఫీసర్ చుట్టూ నడిపితే ఇంకా బాగుండేది. శరద్ కేల్కర్ బాగా నటించారు. విజువల్ ఎఫెక్ట్స్ పై ఆధారపడి సినిమా నిర్మించారు. ఆ ఎఫెక్ట్స్ అంత ఆకర్షణీయంగా లేవు.
మంచికథే .. మరింత డెవలప్ చేసి తీస్తే అద్భుతంగా ఉండేది. భుజ్ పై పట్టు సాధించి ఇందిరాగాంధీతో చర్చలు జరుపుతూ టీ తాగాలన్న పాక్ అధినేత యాహ్యాఖాన్ కోరిక అలాగే మిగిలిపోయింది అంటూ కథను ముగించడం బాగుంది. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కొన్నిసన్నివేశాల్లో కెమెరా పనితనం కూడా బాగుంది. కొంచెం ఓపికగా చూడాలి. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.
————–KNM