ఆయారాం గయారాం సంస్కృతి అంటే ?

Sharing is Caring...

Bhandaru Srinivas Rao……………….

నిజానికి ప్రతి అయిదేళ్లకు ఓసారి మననం చేసుకోవాల్సిన విషయం. ‘నదిలో పడవ ప్రయాణం సాగుతోంది. ప్రయాణీకులందరూ ప్రశాంతంగా వున్నారు.ఉన్నట్టుండి తుపాను కమ్ముకుంది. ప్రచండమైన గాలులు వీస్తుంటే పడవ అతలాకుతలం అవుతోంది. ప్రయాణీకుల్లో కలవరం మొదలయింది. కానీ ఎవరూ ఆ పడవ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయలేదు.

సరంగు ఏదో విధంగా తమని రేవుకు చేరుస్తాడనే నమ్మకమే దానికి కారణం. ఈలోగా ఎవరో ‘పడవకు చిల్లుపడింది, నీళ్ళు లోపలకు వస్తున్నాయి’ అని కేకలు వేశారు. అంతే! పడవలోని వారందరూ ఒక్క పెట్టున నదిలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరే ప్రయత్నం మొదలుపెట్టారు. 

‘మీరు ఇన్నాళ్ళు వున్న పార్టీని, మీకు ఎన్నో పదవులు కట్టబెట్టిన పార్టీని  విడిచిపెట్టి ఎందుకు వేరే పార్టీలోకి చేరారు?’ అనే ప్రశ్నకు సమాధానంగా ఒక రాజకీయనాయకుడు చెప్పిన పిట్ట కధ ఇది. అతడు హాస్యానికి చెప్పినా ఇందులో నిజం కూడా వుంది. చిల్లిపడి మునిగిపోయే పడవలో ప్రయాణించడం కన్నా ఏట్లో దూకి ఈదుకుంటూ ఏదో ఒక ఒడ్డుకు చేరుకోవడమే మంచిదనే ఈనాటి రాజకీయుల మనస్తత్వానికి ఇది అద్దం పడుతోంది.

తమ నాయకుడు ఎన్నికల వైతరణిని దాటించలేడు అనే అపనమ్మకం కలిగిన మరుక్షణం అనుచరులు ఆ పార్టీ నుంచి తప్పుకునే ప్రయత్నాలు మొదలు పెడతారు. ఆ క్రమంలో మరో దారి చూసుకుంటారు. వేరే పార్టీలో చేరేందుకు దోవలు వెతుక్కుంటారు.పార్టీ బలం సన్నగిల్లడం, పార్టీ నాయకుడి ప్రజాకర్షణ తగ్గుముఖం పట్టడం పార్టీ మార్పిళ్ళకి ప్రధాన కారణం.

సరే! ఇదొక తరహా రాజకీయం.కొన్ని సందర్భాలలో ఏవో కారణాలు చూపి పార్టీ అధిష్టానం కొందర్ని వేరే నియోజక వర్గాలకు మారుస్తూ వుంటుంది. ఇది నచ్చని వాళ్ళు అదే నియోజకవర్గంలో తనకు టిక్కెట్టు ఇచ్చే వేరే పార్టీ వైపు చూస్తూ వుంటారు.వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు అధికార ప్రతినిధులు టీవీ చర్చల్లో పొట్టుపొట్టవుతుంటారు.

తమ నాయకులను సమర్ధించుకోవడానికి, ఎదుటి పార్టీ అధినాయకులను తూర్పార పట్టడానికి కిందుమీదవుతుంటారు.ఇందులో విచిత్రం ఏమిటంటారా! ఈ ఇద్దరూ కొంతకాలం క్రితం వరకూ ఇదే విధంగా తిరుగులేని వాదనలు చేసేవాళ్ళు.కాకపొతే ఈయన ఆ పార్టీలో, ఆయన ఈ పార్టీలో.

పార్టీ మార్పిళ్లు అనగానే చప్పున గుర్తొచ్చే రాజకీయ నాయకుడు భజన్ లాల్. స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో తొలిసారి జరిగిన ప్రతిపక్షాల ఐక్యతా ప్రయోగం ‘జనత పార్టీ’  విఫలం అయిన తర్వాత, 1980లో ఇందిరాగాంధీ తిరిగి కేంద్రంలో  అధికారంలోకి వచ్చింది. వచ్చీ రావడమే తడవుగా, ఆనాటి హర్యానా ముఖ్యమంత్రి భజన్ లాల్ మహాశయులు రాత్రికి  రాత్రే పార్టీ మార్చి, ‘సహేంద్ర తక్షకాయస్వాహా’ అన్నట్టుగా తన కేబినేట్ మంత్రులు, తన పార్టీ ఎమ్మెల్యేలతో సహా కాంగ్రెస్ (ఐ) లో చేరిపోయారు.

ఇది చూసి నాటి మరాఠా రాజకీయ నాయకుడు ఎస్.బీ. చవాన్ ‘రాజకీయ కప్పదాట్ల’కు కొత్తగా చేసిన నామకరణమే ఈ  ‘ఆయారాం గయారాం’. అప్పటినుంచి ఈ రాజకీయ విష సంస్కృతి మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొత్త రెమ్మలు తొడుగుతూనే వస్తోంది. ఈ  విష సంస్కృతి సాధిస్తున్న అభివృద్ధి రేటు పెరుగుదల చూసి దేశంలోని రాజకీయ పార్టీలే  అదిరిపోతున్నాయి.

కోడి మనదే, కోడిని ఉంచిన గంప మనదే అనే ధైర్యం సన్నగిల్లి పోతోంది. గంప గంప లాగానే వుంది. కోళ్ళు మాత్రం మాయం అవుతున్నాయి అని మధన పడుతున్నాయి. పొతే, ఈ ఆయారాం గయారాం ఒరవడికి  మేఘాలయ రాష్ట్రం పెట్టింది పేరు. 1972 లో అస్సాం నుంచి విడిపడి ఏర్పడ్డ మేఘాలయ రాష్ట్రంలో గత నలభయ్ ఏళ్ళ కాలంలో అక్షరాలా ఇరవై నాలుగు ప్రభుత్వాలు ‘ఆయారాం గయారాం’ సంస్కృతి కారణంగా మారాయి.

రెండు సార్లు రాష్ట్రపతి పాలన ఇందుకు  అదనం. అందుకే కాబోలు పార్టీ టిక్కెట్టు మీద గెలిచిన వాళ్ళు తమ కట్టుదాటిపోకుండా అనేక ఎత్తులు వేస్తున్నాయి. ‘ఆయారాం గయారాం’ బెడద తప్పించుకోవడానికి మేఘాలయ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం, ‘యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ’  ఒక కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. అదే ‘నయా రాం’. దీనికింద పార్టీ టిక్కెట్టు ఇచ్చేముందే అభ్యర్ధులతో, ఇండియన్ కాంట్రాక్ట్ ACT కింద  బాండు మీద సంతకం చేయించుకుంటారు. 

అయిదేళ్ళ వరకు పార్టీ ఒదిలి వెళ్ళమని. కానీ రాజకీయాల్లో స్కాచి వడబొసిన ధిగ్గనాధీరులు, యేరు దాటగానే బోడి మల్లయ్య’ అనడం నేర్చిన వాళ్ళు ఈ బాండ్లు, సంతకాలు లెక్కపెడతారనుకోవడం అమాయకం. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా వున్నాయి ఈ కప్పదాట్ల  కబుర్లు. పార్టీ ఫిరాయింపులకు మొదటి బీజం పడింది, స్వతంత్ర భారతంలో 1967 లో జరిగిన నాలుగో సార్వత్రిక ఎన్నికల అనంతరం.

ఆ విత్తనం ఎంత బలంగా పడిందంటే ఈ ఫిరాయింపుల ఫలితంగా 1967 – 1973  మధ్య ఆరేళ్ళ కాలంలో పదహారు రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయాయి. ప్రజలచేత ఎన్నికయిన  మొత్తం రెండువేల
ఏడువందలమంది ప్రజా ప్రతినిధులు, తాము ఎన్నుకున్న వోటర్ల ప్రమేయం లేకుండా వేరే పార్టీల్లో చేరిపోయారు. 1967  నుంచి మూడేళ్ళలో ప్రతి అయిదు మంది ఎమ్మెల్యేలలో ఒకరు పార్టీ మారారంటే ఫిరాయింపులు ఎంత తీవ్రంగా జరిగాయో అర్ధం చేసుకోవచ్చు. 

ఏదో ప్రతిఫలం లేకుండా ఈ గోడ దూకడాలు జరగవు అనే నమ్మకానికి ఊతం ఇవ్వడానికా అన్నట్టు  అలా దూకిన వాళ్ళలో పదిహేనుమంది ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యారు. 212 మంది మంత్రులు కాగలిగారు. వ్రతం చెడ్డా ఫలితం దక్కించుకున్న బాపతు అన్నమాట. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నఈ వికృత పోకడలకు మొదటి అడ్డుకట్ట వేయడానికి మన రాజకీయ నాయకులకు దాదాపు పదిహేడేళ్ళు పట్టింది.

అదెలా జరిగింది అంటే..1984  డిసెంబర్ 29 వ తేదీన కర్ణాటకలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలకుగాను నాటి పాలకపక్షం అయిన జనతా పార్టీని  మట్టి కరిపించి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వం లోని కాంగ్రెస్ ఇరవై నాలుగు సీట్లు గెలుచుకుని తన సత్తా ప్రదర్శించింది. ఆనాడు రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి  రామకృష్ణ హెగ్డే  ఓటమికి నైతిక బాధ్యత వహించి గవర్నర్ కు మంత్రివర్గం తరపున రాజీనామా పత్రం సమర్పించారు. 

మామూలుగా అయితే అటువంటి పరిస్థితుల్లో గవర్నర్ లేదా కేంద్ర ప్రభుత్వం ముందు రెండు ప్రత్యామ్నాయాలు వుంటాయి. ఒకటి  జనతా పార్టీనుంచి  ఫిరాయింపులు ప్రోత్సహించి  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం.లేదా, రాష్ట్రపతి పాలన విధించడం.అంతకుముందు  శ్రీమతి ఇందిరాగాంధీ రాజకీయ ఎత్తుగడలకు అలవాటు పడిన వారందరూ యువనేత రాజీవ్ గాంధీ కూడా తల్లి బాటలోనే పార్టీ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారని అనుకున్నారు.

కానీ, రాజీవ్ గాంధీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, కర్ణాటకలో అసెంబ్లీ రద్దు చేయడానికి వీలుగా గవర్నర్ కు స్వేచ్ఛ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులకు రాజీవ్ ఎంత వ్యతిరేకం అన్నది ఈ ఒక్క ఉదంతంతో తేటతెల్లమయింది. అంతేకాదు, రాజీవ్ గాంధీపార్టీ ఫిరాయింపులను చాలా తీవ్రంగా తీసుకున్నారు.

ప్రధానమంత్రి పదవి స్వీకరించిన రెండోవారంలోనే పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాలని, అందుకు రాజ్యాంగాన్ని సవరించి ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ఇక ఏమాత్రం కాలయాపన చేయకుండా పార్లమెంటులో తమ పార్టీకి వున్న తిరుగులేని  ఆధిక్యతను ఆసరాగా చేసుకుని 52 వ రాజ్యంగ  సవరణ ద్వారా ఈ చట్టాన్ని తీసుకువచ్చి ఈ దశగా తొలి అడుగు వేసారు.

కాకపొతే, ఏపార్టీ అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా ఇటువంటి చట్టాన్ని తీసుకువచ్చిందో అదే పార్టీ కాలక్రమంలో ఫిరాయింపులకు పుట్టిల్లుగా మారడం ఓవిషాదం. ఈ విషయంలో ఏ ఒక్క పార్టీకి మినహాయింపు ఇచ్చే అవకాశం లేదు.

ప్రతిపార్టీ తన స్వప్రయోజనాలకోసం ఈ చట్టానికి తూట్లు పొడవడమే కాకుండా చట్టంలోని కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకుని పార్టీ ఫిరాయింపులను యధేచ్చగా ప్రోత్సహిస్తూ రావడం మరో విషాదం.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!