Wonderful story……………………………
భూమన్..………………………………………………………………
“అర్ధనారి” చేతిలోకి తీసుకున్నప్పుడు కొంచెం కొంచెంగా చదవచ్చులే అనే భరోసాతో మొదలు పెట్టినాను. మొదలుపెట్టి పెట్టగానే నా వశం తప్పింది. అక్షరమక్షరం… వాక్యం.. వాక్యం తరుముకుంటూ ముందుకు పోతున్నాయి. మధ్యలో అర్ధనారి రచయిత స్వామి పలకరింపు కోసం ఫోన్ చేస్తే విసిగ్గా కట్ చేసి పారేసినాను.
అంతగా నన్ను ఆవరించి… మధ్యలో ఏ ఉచ్చకో ఇంత కతకటానికో తెరిపి నిచ్చి.. నిరంతరాయంగా దాదాపు పది గంటల్లో నవల పూర్తి చేస్తే గాని నాకు ఊపిరాడలేదు. ఎన్ని నవలలు చదివినాను గాని ఇంతగా కట్టిపడేసిన నవల ఇదే. ఇంత కవితాత్మకంగా, గొప్ప తాత్వికచింతనతో పఠణా పరుగులు పెట్టించింది అర్ధనారి. అర్ధనారి మొదలు పెట్టనంతవరకు ఇది ట్రాన్స్ జెండర్స్, హిజ్రా, వేశ్యలకు సంబంధించిన కథని తెలియనే తెలియదు.
మొన్నటికి మొన్న కాలిఫోర్నియాలో ఉండగా ఈ అంశం మీద ఒక వ్యాసం రాస్తే *ఆంధ్రజ్యోతిలో అన్ని పుటకలను అక్కున చేసుకోవాల్సిందే* పేరిట ప్రచురణ అయింది. ఈ అంశం మీద లోతైన అధ్యయనంతో ఒక నవల రావాల్సిన అవసరాన్ని ఉమామహేశ్వరరావు గుర్తు చేసినారు. ఇంతలోనే స్వామి అర్ధనారి రావటం ఉబ్బి తబ్బిబయేట్టుగా ఉంది.
ఇంతవరకు ఎవరు చూడని.. పట్టించుకోని వారి గురించి ఇంత ఆర్తితో.. వారిలో ఒకడిగా మునిగి అద్భుతంగా రాయటం తెలుగు నవల చరిత్రలోనే అపురూపం. మనుషులు ఆడ, మగ గానే కాదు మరెన్నో రకాలుగా పుట్టటం అనాదిగా జరుగుతున్నది. కానీ వారి పట్ల వివక్ష, అణచివేత, దారుణాతి దారుణ మానవహింస, సామాజిక వెలివేత… మానవజాతికి హీనాతి హీనమైన పాపం.
అట్లాంటి వారి గురించి రాయాలనిపించటమే స్వామి తాత్విక చింతనేమిటో తెలియజేస్తున్నది. ఇట్టాంటి వారి గురించి ఇష్టంగా.. ప్రేమతో.. అనురక్తితో ఒక నవల రాసి స్వామి చరితార్దుడైనాడు. చంద్రన్న, రమణి, రామలక్ష్మీల చుట్టు తిరిగే ప్రధానమైన కథ. చలపతి, ఆదిమూర్తి చంద్రన్న తల్లిదండ్రులు, బావ, అక్క, రామలక్ష్మి భర్త, ఆమె తల్లిదండ్రులు రఘునాథరెడ్డి, మణిమాల, రసూలమ్మ, తనుజ, రూప, సరోజ, పుష్ప, పిట్ పిట్ భాషాల చుట్టూ తిరుగుతూ… మన చుట్టూ ఉన్న జీవితాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించినాడు తన మెరికల్లాంటి వాక్యాలతో స్వామి.
ఇది మనకు తెలియని జీవితం కాదు. రోజువారి చూస్తున్నదే.. గమనిస్తున్నదే.. తెలియనట్టు, గమనంలో లేనట్టు నటిస్తూ పోతున్నామే.. అట్టాంటి మనందరికీ తట్టి లేపి… ఇదిగో మా చుట్టూ ఉన్న జీవితం ఇలా ఉందని… గొప్ప ఊపుతో… తాత్విక చైతన్యంతో బలంగా ఎడమర్చి చెబుతున్నాడు స్వామి ఈ నవలలో. రెండు శరీరాలు.. రెండు ఆత్మలుగా కలగలిసిపోవడం… వారు ఆడ మగ కావచ్చు… కానీ వారు కావచ్చు. ఆడ ఆడ, మగ మగ, ఆడ మగ కాని వారు కావచ్చు.
ఆ శరీరాల మధ్య పొంచి ఉండే వాస్తవాధీన స్పృహను పసిగట్టి.. వర్ణించిన.. తీరు తిరుగులేనిది. ఎక్కడ అసభ్యత లేకుండా శృంగారాన్ని ఇంత అద్భుతంగా రాసి చూపెట్టిన వైనం రచయిత రచన చమత్కృతికి నిదర్శనం. నవలలోని కథ, పాత్రలు, కథనం, శిల్పం… ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయని చెప్పటం అర్థం లేని వ్యవహారం.
సూటిగా నవల ఏం చెప్పాల్నో… ఎవరికి చెప్పాల్నో స్పష్టంగా ఉంది. నవల చదవమని ఏ సిఫారసు చేయ పనిలేదు. ఈ శతాబ్దంలోనే ఇంతటి అపురూపమైన.. అద్భుతమైన.. నవల రావడం చదువరులమైన మనందరి అదృష్టం. ఇంతటి గొప్ప నవలను అందిస్తున్న తాన వారిని మెచ్చుకోకపోవడం.. మనల్ని మనం చిన్నబుచ్చుకోవడం. అర్ధనారి చదవండి. పదిమంది చేత చదివించండి. మనల్ని మనం కడిగేసుకోవటానికి… మనుషులంగా ధన్యులం కావటానికి ఈ నవల చదవడం తప్పనిసరి బాధ్యత.