ఆ నటనకు వేయాల్సిందే వేయి వీరతాళ్ళు !!

Sharing is Caring...

 Amazing Performance……………..

తెలుగు సినిమా చరిత్రలో ఘటోత్కచుడు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మహానటుడు ఎస్.వి. రంగారావు (SVR) మాత్రమే. ‘మాయాబజార్’ (1957) చిత్రంలో ఆయన పోషించిన పాత్ర తెలుగు సినీ చరిత్రలోనే ఒక అద్భుతం. చాలామంది ఆ పాత్ర పోషించినప్పటికీ ఎస్వీఆర్ లా ఎవరూ చేయలేదు. దర్శకుడు కేవీ రెడ్డి ఈ పాత్ర పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు.అందుకే ఆపాత్ర అజరామరంగా నిలిచి పోయింది.   

సినిమాలో ఆపాత్ర ఎంట్రీ అద్భుతంగా ఉంటుంది. హై హై నాయకా అంటూ అనుచరులు నినాదాలు చేస్తుండగా ఎస్వీఆర్ ఎంట్రీ కనుల పండుగగా ఉంటుంది. మొదట్లోనే తన మనసులోని మాట పద్యం రూపంలో చెప్పేస్తాడు.

భారీ కాయం, గంభీరమైన స్వరం కలిగిన ఎస్వీఆర్  ఘటోత్కచుడి పాత్రకు ప్రాణం పోశారు. ఆయన వేషధారణ, నడకలో ఒక రాజసం ఉట్టిపడుతుంది. ఆ పాత్రలో కేవలం క్రౌర్యం మాత్రమే కాకుండా, అమాయకత్వం, హాస్యం, ప్రేమను ఎస్వీఆర్ అద్భుతంగా పండించారు. ముఖ్యంగా తన పిన్నమ్మ సుభద్ర పట్ల చూపించే భక్తి, అభిమన్యుడి పట్ల చూపే వాత్సల్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.  

మాయాబజార్‌లో ‘శశిరేఖ’గా మారి ఆయన చేసిన నటన అద్వితీయం. ఒక పురుషుడు, స్త్రీ హావభావాలను (ముఖ్యంగా లక్ష్మణ కుమారుడితో) అతిగా అనిపించకుండా, కేవలం కళ్ళతో, చిరునవ్వుతో ప్రదర్శించడం ఆయనకే సాధ్యమైంది.అహనాపెళ్ళంట పాటలో  ఎస్వీఆర్ హావభావాలు,మధ్యలో సావిత్రి ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇక రేలంగిని భయపెట్టే సీన్ సంగతి చెప్పనక్కర్లేదు. 

కనుబొమలతోనే నవరసాలను పలికించగల గొప్ప నటుడు రంగారావు, ఘటోత్కచుడి పాత్రలో సందర్భోచిత నటనను ప్రదర్శించారు.  వివాహ భోజనంబు పాటలో ఆయన ప్రదర్శించిన హావభావాలు, తిండి పట్ల చూపే మక్కువ, పాట చిత్రీకరణ తీరు అపూర్వం గా నిలిచి పోయాయి.  

క్లుప్తంగా చెప్పాలంటే, ఘటోత్కచుడి పాత్రలో ఎస్వీఆర్ నటించలేదు,ఆ పాత్రలో జీవించారు. అందుకే దశాబ్దాలు గడిచినా, ఆ పాత్రకు ఆయనే సాటి లేని మేటి గా నిలిచిపోయారు. తన అద్భుతమైన నటనతో,పాత్ర తాలూకూ విభిన్న కోణాలను ఆవిష్కరించారు. ఇది తెలుగు సినీ చరిత్రలో ఒక మరపురాని పాత్రగా నిలిచిపోయింది.

ద్వారక లోకి ప్రవేశించినపుడు వృద్ధునితో సంభాషణలు  ఆసక్తికరంగా ఉంటాయి.ఆ వృద్ధుడిని ఎత్తలేక ఇబ్బంది పడే సన్నివేశం ప్రేక్షకులను అలరిస్తాయి. ‘ఏనుగులు తిన్నావా ? పర్వతాలు మింగావా ?’ అంటూ హుంకరించే సీన్ బాగుంటుంది. నమో కృష్ణ నమో కృష్ణ అనే డైలాగ్ పలికే తీరు ..కృష్ణుడి ముందు ఒదిగి పోయి మాట్లాడే తీరు అందరినికట్టుకుంటాయి.  

మొత్తంగా, ఎస్.వి. రంగారావు ఘటోత్కచుడిగా  కేవలం నటించడం కాదు, ఆ పాత్రలోకి పూర్తిగా పరకాయ ప్రవేశం చేసి, తన నటనతో, హావభావాలతో, వాచికంతో దానికి శాశ్వతమైన గుర్తింపు తెచ్చారు.  మాయాబజార్‌ సినీ రంగానికే కాదు, తెలుగు భాషకూ కొత్త సొబగులను చేకూర్చింది. కొత్త పదాలను పరిచయం చేసింది.  

పాండిత్యం కంటే జ్ఞానమే ముఖ్యం .. వేసుకో వీరతాడు…. ఎవరూ పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి ? అస్మదీయులు, తస్మదీయులు అనే పదాలు జనాల్లో వాడుకలోకి వచ్చాయి. ఘటోత్కచుడి అనుచరులు తస్మదీయులు పదాన్ని సరిగ్గా పలకలేక దాన్ని ముక్కలు, ముక్కలుగా పలికిన తీరు అప్పట్లో ధియేటర్లలో నవ్వులు పండించింది. ఇప్పుడు చూసినా కడుపుబ్బా నవ్వాల్సిందే!

రాక్షస గురువు రమణారెడ్డి దాని అర్ధం శత్రవులని వివరించినప్పుడు, ఘటోత్కచుడిగా ఎస్‌వి రంగారావు ఇచ్చిన ముక్తాయింపు… అలా విరిచి పలికిన తన అనుచరులకు ఒకటికి రెండు వీర తాడులు వేయించిన తీరు దేని కదే అపూర్వంగా నిలిచాయి. దర్శకుడు ఆయా సన్నివేశాలను తెరకెక్కించిన తీరు అద్భుతం. 

పాత్రకు సంబంధించి అనుచరుల మాటలు హైహై నాయకా…గిలపం, గింబలి వంటి ఎన్నో పదాలు ఈ సినిమా తరువాత జనాల్లో బాగా పాపులర్ అయ్యాయి. మాటల రచయిత పింగళి నాగేంద్రరావు ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ అని చెప్పుకోవచ్చు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!