Disappearing Road …………………………
కొండ ప్రాంతాల్లో భయం గొలిపే రోడ్ల ను మనం చూసి ఉంటాం. అయితే వీటకి భిన్నంగా ప్రపంచంలో ఒక రోడ్డు ఉంది. అది రోజులో కేవలం గంట లేదా రెండు గంటలు మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన సమయంలో మాయమై పోతుంది. ఇలాంటి రోడ్డు గురించి మీరు విని ఉండకపోవచ్చు.
ఆ మాయమయ్యే రోడ్డు ఫ్రాన్స్‌లోని అట్లాంటిక్ తీరంలో బ్యూవోయిర్-సుర్-మెర్ – నోయిర్ మౌటియర్ ద్వీపం మధ్య ఒక కాజ్‌వే గా నిర్మితమైంది.ఈ కాజ్‌వే పొడవు 4.125 కిలోమీటర్లు (2.6 మైళ్ళు. అధిక నీటి ఆటుపోట్ల వల్ల రోజుకు రెండుసార్లు వరదలు వస్తాయి.ఆ సమయంలో రోడ్డుకు నలువైపులా నీరే కనిపిస్తుంది.
ఈ రోడ్డును ‘పాసేజ్ డూ గోయిస్’ పేరుతో పిలుస్తారు. ఫ్రెంచ్ భాషలో ‘గోయిస్’ అంటే ‘చెప్పులు విడిచి రోడ్డు దాటడం’ అని అర్థం. ఇది రోజులో ఒక గంట లేదా రెండు గంటలు మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన సమయంలో నీటిలో మునిగిపోతుంది.
ఆటుపోట్లవలన రోడ్డుకు రెండు పక్కల నీటిమట్టంపెరుగుతుంది.ఆ సమయంలో అక్కడి నీటి లోతు 1.3 మీటర్ల నుంచి 4 మీటర్ల వరకూ ఉంటుంది.ఈ రోడ్డు మీదుగా ప్రయాణించే చాలామంది ప్రతీయేటా మృత్యువు పాలవుతుంటారు.ఈ రోడ్డు తొలిసారిగా 1701లో మ్యాప్ లో కనిపించింది.
మొదట్లో జనం ఈ ప్రాంతానికి పడవల్లో వచ్చేవారు.తరువాత ఇక్కడ రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు.1840లో గుర్రాల సాయంతో జనం ఇక్కడికి వచ్చేవారు. 1986 తరువాత ఇక్కడ ప్రత్యేకమైన రేసులు నిర్వహించేవారు.1999 నుంచి ఫ్రాన్స్ ఈ రోడ్డుపై ‘టూర్ ది ఫ్రాన్స్’ పేరిట సైకిల్ రేసులు నిర్వహిస్తోంది.
ఈ రోడ్డు అందంగా కనిపించినా .. ప్రయాణం మాత్రం చాలా ప్రమాదకరం. రోడ్డు రెండు వైపులా నీటి పోటుపెరగడం వల్ల ప్రతి ఏటా ప్రయాణికులు మార్గ మధ్యంలో చిక్కుకుపోయిన సందర్భాలున్నాయి.రహదారి ప్రయాణించదగినదా కాదా అని సూచించే ప్రత్యేక ప్యానెళ్లు ఉన్నాయి. ఒకవేళ అలల మధ్య చిక్కుకుంటే రక్షణ పొందటానికి ఆ మార్గం పొడవునా ఎత్తైన టవర్లు నిర్మించారు.