పూదోట శౌరీలమ్మ. బోధన్……………………………… The life of nomads
ఈ సినిమా రష్యాలోని సైబీరియా ధృవ ప్రాంతపు మంచు తో కప్పబడి వుండే టండ్రా ప్రాంతానికి చెందిన కథావస్తువుతో నిర్మింపబడింది.రష్యన్ భాషలో బెలీ యాగెల్ అంటే ( the white moss) తెల్లని నాచు అని అర్థం. ఈ సినిమా డైరెక్టర్ వ్లాదిమిర్ టుమొవ్. జూన్ 2014 లో విడుదలై అనేక అవార్డులు పొందింది.
మంచుతో కప్పబడి వుండే ఈ టండ్రా ప్రాంతానికి రెయిన్ డీర్ అనే జింకలే ఇక్కడి వీళ్ళ జీవనాధారం.అవే వీరి ఆహారం,వాటి చర్మమే వీరి దుస్తులు,వాటి కొమ్ములే ఆయుధాలు,అలంకరణలు,వాటి కొవ్వే వీళ్ళ దీపాలకు వెలుగు.అవే వారి సంచార వాహనాలు, వీరి ప్రధాన ఆదాయ వనరులు గూడా ఆ రెయిన్ డీర్ లే.
అలాంటి ఆ జింకలు ఆ ప్రాంతం అంతా పూర్తిగా మంచుతో కప్పబడినప్పుడు,ఆహారం కోసం ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళేముందు అవి ఆకలితో అలమటిస్తూ వుంటాయి.అప్పుడు అవి బతకటానికి ఈ white moss తెల్లని నాచు ఆధారం.మంచు పలకలను పెకిలించి వాటి కింద పెరిగిన నాచునే రెయిన్ డీర్లు తిని బ్రతుకుతాయి.అందుకే ఈ సినిమాకి white moss అని పేరు పెట్టారు.
ధృవ ప్రాంతాల్లో నైనా,ఎడారుల్లో నైనా,పర్వతాల్లో నైనా ఎక్కడ నివసించినా మానవజాతి అంతా ఒక్కటే.వారి అనుభూతులు,అనుభవాలు,మానసిక స్పందనలన్నీ ఒక రకంగానే వుంటాయి.
ఈ సినిమా సైబీరియా టండ్రాలలో నివసించే “సేనెట్స్”అనే ఆదివాసీల జీవనచిత్రణ.
మంచు కొండల్లాంటి వారి ఇళ్లు, వస్త్రధారణ,వారి కేశాలంకరణ,అనుబంధాలు,అలవాట్లు, ఆచారాలు,రెయిన్ డీర్ పెంపకం,వాటితో వ్యాపారం,వారి అతి మామూలు జీవితం,రెయిన్ డీర్ లతో కలిసి వలస వెళ్ళటం,వారి సంచారజీవితం ఇదంతా మనమె ప్పుడూ చూడని అద్భుత మంచు ప్రపంచం.
ఈ సినిమా మన కళ్ళముందు ఒక సుందర మార్మిక సౌందర్యాన్ని రాశి పోసింది. ఇక సినిమా
కథలో కొస్తే,ఆరంభంలోనే రష్యా ప్రభుత్వం వీరి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలనే ఆశయంతో హెలికాప్టర్ ను ఆ ప్రాంతానికి పంపిస్తుంది. దానిలో అక్కడి పిల్లలను తీసుకొచ్చి,ఇక్కడి సిటీ లో వుంచి చదివించాలని వారి ప్రయత్నం.
మన పిల్లల్లాగే వాళ్లూ తల్లితండ్రులను వదిలి ఉండలేక గగ్గోలు పెడుతూ వుంటారు.చాటుమాటుగా నక్కినక్కి చూస్తుంటారు.అయినా వారి తల్లిదండ్రులు వారిని బలవంతంగా హెలికాప్టర్ ఎక్కిస్తారు.
హీరో అలోయ్ షా ( Evgeny sangadzhiew) తల్లి తో కలిసి వుంటాడు.అతని స్నో మోటార్ లో తిరుగుతూ,రెయిన్ డీర్ మందలను మేపుకుంటూ వుంటాడు.
ఆ వూరి మొత్తంలో అతని దగ్గర మాత్రమే చిన్న ఫోన్ వుంటుంది..కానీ అక్కడెప్పుడూ సిగ్నల్స్ వుండవు..సిగ్నల్ కోసమే కట్టిన మూడంతస్తుల భవనం లాంటి మంచె మీదికి ఎక్కాల్సిందే. తల్లి,అతన్ని తొందరగా పెళ్లి చేసుకొమ్మని పోరుతూ వుంటుంది.
అలోయ్ మనసులో అదే తెగలోని ” అనికో(aniko) అనే అమ్మాయి వుండటం వల్ల,అతడు వేరే అమ్మాయి తో పెళ్లికి ఇష్టపడడు. కానీ ఇవేమీ పట్టించుకోని అనికొ, అలోయ్ నీ వదిలేసి మంచి జీవితం కోసం సిటీ కి వెళ్ళిపోతుంది. ఆలొయ్ మాత్రం ఆమె కోసం,దిగులు పడుతూ ఎదురు చూస్తూనే వుంటాడు.
తల్లి,చనిపోయిన తన భర్త ఫోటో ముందు నిలబడి,తన కొడుకు తొందరగా ఒక ఇంటివాడు అవ్వాలని కోరుకుంటూ,దైవాలకు కన్నీటి ప్రార్థన చేస్తూ వుంటుంది.చివరకు ఆమె పక్క తండా నుండి,అందమైన” సవానే” అనే అమ్మాయి నీ కోడలుగా తెస్తుంది.పెళ్లి వారి ఆచారాల ప్రకారం అతి మామూలుగా జరుగుతుంది.పెద్దలు పాటల రూపంలో,నూతన దంపతులకు సూచనలు,సలహాలు ఇస్తారు..తర్వాత రెయిన్ డీర్ మాంసంతో విందు భోజనం చేస్తారు.
మనసు నిండా ” అనీకో” వుండటం వల్ల, అలోయ్ నూతన వధువు” సవానే ” పట్ల ఏలాంటి ప్రేమ,ఆసక్తి చూపించడు. ఈ నిరాదరణకు సావానే ఎంతగానో కుంగిపో తుంది.
కొన్ని ఫోటోలు,నిద్రలో అ లోయ్ తన ప్రియురాలు అనికో పేరు కలవరించటం తో సవానె కు పరిస్ఠితి అర్థం అవుతుంది.
అనికో తల్లి రెయిన్ డిర్ల మందను మేపుతూ వుంటుంది.తోడేళ్ళ దాడిలో ఆమె గాయపడి చనిపోతుంది. అనికో తన తల్లి మరణవార్తను తెలుసుకుని సిటీ నుండి హెలికాప్టర్ లో వస్తుంది.పూర్తి నగర జీవితానికి అలవాటు పడ్డ ఆమె వేష భాషలు,అలంకరణలు అన్నీ పూర్తిగా మారిపోతాయి.
టండ్రా ప్రాంతపు ఆదివాసీ అమ్మాయి లక్షణాలేమీ ఆమెలో మిగలవు.ఇక్కడ ఆమె ఇమడలేకపోతుంది.. అలోయ్ ప్రేమను గూడా తిరస్కరించి తిరిగి సిటీ కి వెళ్ళిపోతుంది.
మరి తర్వాత కత ఏమైంది. అలోయ్ ప్రేమకు నోచుకోలేనీ సవానే ఒక రాత్రివేళ లేచి,టెంట్ వదిలి,రెయిన్ డీర్ బండి మీద వెళ్ళిపోతుంది.
ఆ టండ్రా ప్రాంతాలలో తోడేళ్లు వీరి ప్రధాన శత్రువులు.చీకట్లో బయలుదేరిన సవానే ఏమైంది? తోడేళ్లు ఆమెపై దాడి చేశాయా?దిగులుతో తాగి,పడిపోయివున్న ఆలోయ్ ఆమెని కాపాడినాడా?అందమైన ఆ ప్రేమ కతంతా మీరు సినిమాలో చూడాల్సిందే.
ఇప్పటికీ కరెంట్,ఇతర సదుపాయాలు ఏమీ లేని వారి సంచార జీవితాలు,వెచ్చదనం కోసం టెంట్ లో నెగళ్లు,వారి టెంట్ నిర్మాణం, స్లెడ్జ్ బండ్లు,వాటి తయారీ,చనిపోయినప్పటి వారి ఆచారాలు,వారానికి ఒకసారి సిటీ నుండి వచ్చే హెలికాప్టర్ అందులో వచ్చే వస్తు సామగ్రి,బంధువులు,రెయిన్ డీర్ల మాంసం, తోళ్లు, కొమ్ముల కోసం వచ్చే వ్యాపారులు ఇంకా ఎన్నెన్నో విశేషాలు సినిమాలో వున్నాయి.
నాకు నచ్చిన విశేషం..వాళ్ళు టెంట్ కి వున్న తోలు తలుపు తీసుకుని లోపలికి రావడం ఆసక్తికరంగా వుంది.చిటికేసే లోపలే వారు గుండ్రంగా తిరుగుతూ లోపలికి దూరిపోతారు. ఒక్క క్షణం ఆలస్యం చేసినా వారితో పాటు మంచు లోపలికి దూరుతుంది.. వారి సంచార జీవనం తెలుసు కోవటానికి ఈ సినిమా చూడొచ్చునా కెంతో నచ్చిన ఈ సినిమా 1.40 నిమిషాలు.. యూ ట్యూబ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వుంది.