A new experiment at that time !!…………………..
పాత పేపర్లతో ఒక వ్యక్తి ఇల్లు కట్టి తన సృజనాత్మకతను చాటుకున్నాడు. వినటానికి కొంత ఆశ్ఛర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. వార్తాపత్రికలతో నిర్మించిన ఈ ఇల్లు అమెరికాలోని మసాచుసెట్స్.. రాక్ పోర్ట్‌లోని పీజియన్ హిల్ స్ట్రీట్ లో ఉన్నది.
మెకానికల్ ఇంజనీర్ ఆలిస్ స్టెన్‌మన్ కి ఈ ఆలోచన ఎందుకు ? ఎలా వచ్చిందో తెలీదు కానీ 1922 లో ఈ పేపర్ హౌస్ నిర్మాణం పూర్తి అయింది. ఇంటి నిర్మాణం లో కొన్నిచోట్ల కలప ఫ్రేమ్‌లు ఉపయోగించారు. ఆపై పైకప్పు జోడించారు. ఇక గోడల విషయానికి వస్తే వార్తాపత్రికలను నిలువుగా పేర్చి వార్నిష్‌తో పూత పూశారు. వార్తాపత్రికల పొరలు అతికించడానికి జిగురు ఉపయోగించారు. దాన్ని కూడా ఇంట్లో తయారు చేశారు. మైదా పిండి, నీరు .. ఆపిల్ తొక్కతో జిగురు తయారు చేశారు.
కాంక్రీట్ లేదా చెక్కతో చేసిన చాలా ఇళ్ళు కూడా ఎక్కువ కాలం ఉండవు. కానీ ఈ రోజు వరకు స్టెన్‌మన్ కట్టిన ఇల్లు మటుకు చెక్కు చెదరక పోవడం విశేషం. . ఇక ఇంట్లో కుర్చీలు, గడియారం, అల్మారాలు, బల్లలు, దీపాలు కూడా న్యూస్ పేపర్లతోనే తయారు చేయడం మరో విశేషం.
ఈ ఇంటి నిర్మాణానికి 100,000 పాత న్యూస్ పేపర్లు వార్నిష్ చేసి ఉపయోగించారు. ఈ పేపర్ హౌస్ ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు పర్యాటకుల సందర్శనార్థం తెరిచి ఉంటుంది. ఈ ఇంట్లో స్టెన్‌మన్ కొంతకాలం నివసించారు. 1942 లో ఆయన మరణించారు. తర్వాత ఈ ఇంటిని మ్యూజియం గా మార్చారు.