రేవతి అనే ఒక హిజ్రా స్వయంగా రాసిన పుస్తకమిది. హిజ్రాల జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. రేవతి హిజ్రాగా మారక ముందు పేరు దొరై స్వామి. తమిళనాడు లోని ఓ మారుమూల గ్రామం. ముగ్గురన్నలు .. ఒక అక్క ఉన్నారు.
ఇంట్లో ఎవరికీ లేని విధంగా అతనిలో అంతర్గతంగా చిన్నప్పటినుంచే స్త్రీ లక్షణాలుండేవి. ఆడవాళ్లలా అలంకరించుకోవాలనీ, వాళ్ల దుస్తులు ధరించాలని కోరిక ఉండేది. స్కూల్లో తోటి విద్యార్థులు తనని ‘ఆడంగోడు’ అని పిలుస్తూ ఎగతాళి చేస్తుంటే బాధ పడేవాడు.
తను అమ్మాయిలా ప్రవర్తిస్తున్న విషయం దొరైస్వామికి తెలుసు. ఆ ప్రవర్తన సహజంగా అనిపించేది. ఒక మగ శరీరంలో ఇరుక్కుపోయిన స్త్రీ లా అతగాడు ఫీలయ్యే వాడు. దేవుడు తనకు ఎందుకు ఇలాంటి శిక్ష వేశాడు, తనను పూర్తిగా స్త్రీ గానో లేక పూర్తిగా పురుషుడి గానో ఎందుకు పుట్టించలేదు అని ఏడ్చేవాడు.కాలక్రమంలో దొరైస్వామి రేవతిగా మారిపోయింది.
ఆ పరిణామక్రమాన్ని, నిత్య జీవితంలో రేవతి ఎదుర్కొన్న వివక్షనూ, అవమానాలనూ, అవహేళనలను పుస్తకంలో మనకు కళ్లకు కట్టేలా రాశారు. ఒక హిజ్రాగా తన వ్యక్తిగత విషయాలను… తన లింగ మార్పిడి శస్త్ర చికిత్స… పోలీసులు పెట్టిన హింసల గురించీ, తన క్లయింట్స్ గురించి నిర్భయంగా చెప్పిన తీరు నచ్చుతుంది. హృదయానికి హత్తుకుంటుంది.
జెండర్ గురించి పురుషాధిక్యత గురించి రేవతి చేసిన విమర్శలు, వ్యాఖ్యలు స్పష్టంగా ఉన్నాయి. స్త్రీ పురుషులతో పాటు థర్డ్ జెండర్ ను కూడా అర్థం చేసుకోవాలి అన్న స్పృహ కలుగ జేస్తుంది ఈ పుస్తకం. పుస్తకమంతా రేవతి జీవితంలో తాను ఎదుర్కొన్న భయానక సంఘటనల గురించి వివరిస్తుంది. ఎవరి సానుభూతిని కోరదు. ఆమె అడిగేది ఒక్కటే, హిజ్రాలను కూడా కోరికలూ ఆశలూ వున్న తోటి మనుషులుగా చూడమని.
గత ఏడాది ఈ పుస్తకాన్ని తెలుగులో అనువదించినందుకు గాను రచయిత్రి సత్యవతి కి సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు. తమిళం లో ఉన్న ఈ పుస్తకాన్ని తెలుగు లో అనువదించేటపుడు సత్యవతి కూడా పాత్రలో లీనమై రాశారు. రకరకాల భావోద్వేగాలకు లోనైనట్టు స్వయం గా రచయిత్రి చెప్పుకున్నారు. పాఠకులు కూడా అదే అనుభూతికి లోనవుతారు.
ఆరేడేళ్ల క్రితం ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా రేవతి మాట్లాడుతూ ఇది ట్రాన్సజెండర్స్ అందరి కథ. మా హక్కుల పోరాటానికి కావాల్సిన ఆయుధం. సమాజంలో మాకూ గుర్తింపు, గౌరవం కావాలి. ఇంట్లోనుంచే మా పోరాటం మొదలవుతుందని వివరించారు. హిజ్రాలను సమాజం రెండే రెండు పనులకు పరిమితం చేస్తోంది. అడుక్కోవడం .. సెక్స్ వర్క్ చేయడం. ఈ పనులు ఎవరూ ఇష్టంగా చేయరు.
గత్యంతరం లేని పరిస్థితుల్లోనే చేస్తారు. మమ్మల్ని మనుష్యులుగా గుర్తించి బతికేందుకు ఓ అవకాశం ఇవ్వండి అంటూ వ్యవస్థను అభ్యర్ధించారు. హిజ్రాగా మారాక అడుక్కున్నాను. సెక్స్ వర్కర్ గా చేసాను. సంగమ అనే ఎన్జీవో లో చేసేటపుడు అక్కడున్న నాలాంటి వారినే యాభై మందిని కలిసి ఇంటర్వ్యూ చేసాను. ఒక్కొక్కరిది ఒక్కో కథ .. వ్యధ. వాటిని గుది గుచ్చే ఈ పుస్తకం రాసానని వివరించారు.
ఆసక్తిగలవారు ఈపుస్తకం కొనుక్కొని చదవవచ్చు. ఒక హిజ్రా ఆత్మకథ – ఎ. రేవతి
ఆంగ్ల మూలం :The Truth About Me: A Hijra Life Story by A. Revathi, Penguin Books India, 2010
తెలుగు : పి. సత్యవతి
పేజీలు: 154, ధర : రూ.130/-
ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్ – 500006
ఫోన్ నెం. 040-2352 1849
ఇమెయిల్ : hyderabadbooktrust@gmail.com.