Unexpected twists ……..
‘బ్లైండ్ స్పాట్’ (Blind Spot) సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. రాకేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయనే స్వయంగా ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు సమకూర్చారు.కథలో ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కథను మలుపు తిప్పుతుంటాయి. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ చిత్రం థ్రిల్లర్ జోనర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇది ఒక లీనియర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ..నగరంలో ఒక హై-ప్రొఫైల్ హత్య జరుగుతుంది. ఈ కేస్ విచారణలో భాగంగా నలుగురు ప్రధాన అనుమానితులు (Suspects) తెరపైకి వస్తారు. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించే బాధ్యతను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (నవీన్ చంద్ర) తీసుకుంటాడు. విచారణ సాగుతున్న కొద్దీ ప్రతి పాత్ర వెనుక ఒక రహస్యం బయటపడుతుంది.
అసలు నిజమైన హంతకుడు ఎవరు? ప్రతి ఒక్కరూ దాస్తున్న ఆ ‘బ్లైండ్ స్పాట్’ (కంటికి కనిపించని రహస్యం) ఏంటి? అనేదే మిగతా కథ. ఎక్కువ పాత్రలు లేకుండా .. చిన్న నటీనటులతో లోబడ్జెట్ లో తీసిన సినిమా ఇది. ఎప్పటిలాగే నవీన్ చంద్ర తన ఇంటెన్స్ నటనతో సినిమాను నిలబెట్టాడు. ఒక సిన్సియర్ ఆఫీసర్‌గా అతని స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ బాగున్నాయి.మిగతా నటీ నటులు కూడా బాగా చేశారు.
సినిమా చివరి 20 నిమిషాలు, క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉండి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుంది. అలీ రెజా పాత్రకు సంబంధించిన ఒక కీ-ట్విస్ట్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. కేవలం 1 గంట 30 నిమిషాల నిడివి ఉండటం వల్ల పెద్దగా సాగదీత లేకుండా కథ త్వరగానే ముగుస్తుంది.
శ్రీరామ్ మద్దూరి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సస్పెన్స్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. దర్శన్ ఎమ్. అంబట్ కెమెరా పని తనం బాగుంది. ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథకు కావలసిన సస్పెన్స్ మూడ్‌ను క్రియేట్ చేయడంలో లైటింగ్, కెమెరా యాంగిల్స్ సినిమాకు మంచి ప్లస్ అయ్యాయి.
సినిమా రన్‌టైమ్ తక్కువే అయినా, ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్లు నెమ్మదిగా సాగుతాయి.దర్శకుడు ఎంచుకున్న ప్లాట్ బాగున్నా, దానిని ప్రెసెంట్ చేసిన విధానంలో కొత్తదనం లోపించింది. కొన్ని సీన్లు కేవలం ఒకదాని తర్వాత ఒకటి అతికించినట్లు ఉంటాయి తప్ప సహజమైన ఫ్లో అనిపించదు.
నవీన్ చంద్ర మినహా మిగిలిన పాత్రల ఎమోషన్స్ అంతగా పండలేదు. సినిమా మొదటి నుండి ఒకరిపై అనుమానం కలిగేలా కథను నడిపించిన దర్శకుడు, చివరి 20 నిమిషాల్లో అసలు హంతకుడు ఎవరనేది చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాడు. ఈ ట్విస్ట్ చాలా మంది ఊహకు అందదు.
విచారణలో భాగంగా నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్నప్పుడు, ప్రతి పాత్రకు సంబంధించిన ఒక భిన్నమైన గతాన్ని, వారు దాస్తున్న రహస్యాలను బయటపెట్టే సీన్లు బాగుంటాయి.నటుడు అలీ రెజా పోషించిన పాత్ర చుట్టూ వచ్చే ఒక సస్పెన్స్ ఎలిమెంట్ సినిమాకు మంచి మలుపుగా మారుతుంది.
మర్డర్ మిస్టరీ ట్విస్ట్‌లను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. యూట్యూబ్ లో ఈ సినిమా ఉంది .. ఆసక్తి గలవారు చూడవచ్చు.

