చూడదగిన మంచి సినిమానే !!

Sharing is Caring...

Subramanyam Dogiparthi ……………………………

‘సత్య చిత్ర’ బ్యానర్ పై నిర్మాతలు సూర్యనారాయణ,సత్యనారాయణలు మంచి సినిమాలే తీశారు. ‘ప్రేమబంధం’ కు ముందు ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ కూడా వారు తీసిందే. రెండింట్లో శోభన్ బాబు హీరో. ఎన్టీఆర్ తో అడవిరాముడు తీయకముందు ఈ ‘ప్రేమ బంధం’ తీశారు.

ఆ తర్వాత అడవి నేపథ్యంలో మరో సినిమా తీయాలని అనుకున్నారు. శోభన్ బాబే హీరో. అయితే ఆయన ఎందుకో చేయనున్నారు. ఆ కథ రకరకాలుగా రూపాంతరం చెంది ‘అడవిరాముడు’ గా తెరకెక్కి సూపర్ హిట్ అయింది.

ఇక ప్రేమ బంధం విషయానికొస్తే … ఈ సినిమాలో నాకు బాగా ఇష్టమయింది జయమాలిని జావళి . అద్భుతమైన సాహిత్యం , సంగీతం . వీటికి ధీటుగా జయమాలిని నృత్యం . జయమాలిని చేత , మంజు భార్గవి చేత కళావర్షాన్ని కురిపించారు కళాతపస్వి కె విశ్వనాథ్ .

” అంజలిదే గొనుమా ప్రియతమా మంజుల బృందా నికుంజ నిరంజనా ” . తెలుగీకరించబడిన సంస్కృతం. ఈ గీతానికి మధురమైన సంగీతాన్ని అందించిన కె వి మహదేవన్ని , పాడిన సుశీలమ్మని స్మరించుకోవాలి .NTR ఆరాధన సినిమా తో పోటీ పడి విశ్వనాథ్ గారి ఈ ‘ప్రేమబంధం’ సినిమా ఆడలేకపోయిందని చాలామంది చెపుతుంటారు.

ఆ పోటీ లేకపోయున్నా కమర్షియల్ గా సక్సెస్ అయి ఉండేది కాదేమో !! నిస్సందేహంగా చక్కటి సినిమా. ఆరాధన పోటీ లేకపోతే ఇంకొంచెం బాగా ఆడి ఉండేదేమో ! ఈ సినిమాలో గుర్తుండిపోయే పాత్రలు సత్యనారాయణ-షావుకారు జానకిలదే.. ఆఇద్దరి పాత్రలు బాగుంటాయి. ఇద్దరూ పోటీ పడి నటించారు. వాణిశ్రీ తన నటనను చూపించే స్కోప్ ఉన్నపాత్ర కాదని నా అభిప్రాయం. తన పాత్రను వాణిశ్రీ సమర్ధవంతంగానే చేసింది.

శోభన్ బాబు చలాకీగా నటించారు . జయప్రద తనకొచ్చిన అవకాశాన్ని బాగానే ఉపయోగించుకుంది. ఇతర పాత్రల్లో దేవదాస్ కనకాల , సాక్షి రంగారావు , గిరిజ , రావు గోపాలరావు , మాడా ప్రభృతులు నటించారు.రావు గోపాలరావు సాఫ్ట్ విలనిజం ఈ సినిమాతోనే మొదలయిందేమో ! రివర్స్ విలనిజం . బాధితుల దగ్గర నుండే డబ్బులు వసూలు చేసే విలనిజం. 

అంజలిదే గొనుమా పాట తర్వాత మెచ్చుకోవలసింది సి నారాయణరెడ్డి వ్రాసిన ఎక్కడున్నాను నేనెక్కడున్నాను పాట . బాలసుబ్రమణ్యం , రామకృష్ణ , సుశీలమ్మలు పాడారు . ఈ పాటలో తాయారమ్మ బంగారయ్యలు గొప్పగా నటించారు. అమ్మమ్మా అల్లరి పిడుగమ్మా , ఏ జన్మకైనా ఇలాగే ఉందామా , పువ్వులా నవ్వితే మువ్వలా మోగితే పాటలు శ్రావ్యంగా ఉంటాయి . సాహిత్యపరంగా సి నారాయణరెడ్డి వ్రాసిన పువ్వులా నవ్వితే పాట బాగుంటుంది. 

ఇంకో పాట చేరేదెటుకో తెలిసి చేరువకాలేమని తెలిసి అనే వేటూరి వారి పాట బాగుంటుంది. ఆ వేటూరి వారే తర్వాత కాలంలో అ అంటే అమలాపురం , ఆరేసుకోపోయి పారేసుకున్నాను హరీ వంటి పాటలు రాశారు. కవుల కత్తులకు రెండు వైపులా పదును ఉంటాయి. వాళ్ళ మూడుని బట్టి , ముడుపులను బట్టి సాహిత్యం కురుస్తుందేమో !

ఈ సినిమా కధా రచయిత్రి జయలక్ష్మి అని టైటిల్సులో వేసారు. మరి ఇది ఏదయినా నవలా లేక పెద్ద కధా అనేది తెలియదు. గొల్లపూడి మంచి సంభాషణలు అందించారు. సినిమా యూట్యూబులో ఉంది . చూడబులే . శోభన్ బాబు , వాణిశ్రీ , సత్యనారాయణ , షావుకారు జానకి అభిమానులు తప్పక చూడవచ్చు ఇంతకుముందు చూడనట్లయితే. 

దురదృష్టం ఏమిటంటే జయమాలిని జావళి వీడియో లేదు . కేవలం ఆడియో మాత్రమే ఉంది . సినిమా రంగంతో సంబంధం ఉన్న వారు ఎవరయినా ఆ వీడియోని యూట్యూబులోకి ఎక్కిస్తే కళాభిమానులకు పసందుని కలగచేసినవారు అవుతారు . లేదా టివిలో వచ్చినప్పుడు ఆ జావళిని చూడండి .

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!