Long Journey…………….
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటుల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్ననటుడు శరత్ బాబు.తెలుగు తెరకు హీరోగా పరిచయమై .. విలన్ గా … క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన రాణించారు. విలక్షణ నటుడిగా పేరు సంపాదించారు. తెలుగు ,తమిళం ,కన్నడం ,మలయాళంభాషా చిత్రాలతో పాటు ” వేకింగ్ డ్రీమ్స్ ” అనే ఆంగ్ల చిత్రంలో కూడా ఆయన నటించారు. శరత్ బాబు ఆహార్యం,వాయిస్ విభిన్నంగా ఆకర్షణీయంగా ఉంటాయి.
సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఐదు దశాబ్దాలుకొనసాగారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, స్నేహితుడిగా, విలన్ గా, తండ్రిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన శరత్ బాబు ను ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కు చెందిన శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. సినిమాల్లోకి వచ్చిన చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు.
కానీ శరత్ బాబు మాత్రం పోలీస్ ఆఫీసర్ కావాలనుకుని యాక్టర్ అయ్యారు.శరత్ బాబుకు మొదట్లో సినీ నటుడు కావాలనే కోరిక లేదు. ఆయన పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నారు. తండ్రి విజయ శంకర్ దీక్షిత్ హోటల్ నడిపే వారు.తనని కూడా అదే బిజినెస్ చూసుకోమనే వారట. కానీ శరత్ బాబుకు మాత్రం పోలీస్ ఆఫీసర్ కావాలనుకునేవారు.
కాలేజీ రోజుల్లో ఆయనకు కంటి చూపు దెబ్బతింది. అదే ఆయన కలకు అడ్డంకి గా మారింది. శరత్ బాబు తల్లి సుశీల దీక్షిత్ తో మీ అబ్బాయి బాగున్నాడు. సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అని అందరు అనే వారట. కాలేజీకి వెళ్లినా లెక్చరర్‌లు కూడా ఇదే మాట.. ఇలా అందరు అనే మాటలు శరత్ బాబు మైండ్ ను డైవర్ట్ చేశాయి. ఓ సినిమా సంస్థ ప్రకటన చూసి ఆడిషన్ కు వెళ్లి అలా నటుడిగా కెరీర్ మొదలు పెట్టారు.
1973లో విడుదలైన `రామరాజ్యం` నటుడిగా ఆయన తొలి చిత్రం. ఇదే సినిమాతో సత్యనారాయణ దీక్షిత్ శరత్ బాబుగా మారిపోయారు. ఆయన పేరుని దర్శకుడు కె.బాబురావు, రామ విజేత ఫిలింస్ అధినేత కె. ప్రభాకర్ మార్చేశారు. ఆ తరువాత సుప్రసిద్ధ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన `పట్టిన ప్రవేశం` మూవీతో తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రంగనాథ్ హీరోగా నటించిన `పంతులమ్మ`, అమెరికా అమ్మాయి వంటి సినిమాల్లో శరత్ బాబు నటించారు. ఈ సినిమాలు ఆయనకు తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా మంచి గుర్తింపుని తెచ్చి పెట్టాయి. ఇక కె. బాలచందర్ తీసిన `చిలకమ్మ చెప్పింది` సినిమా కూడా రెండు భాషల్లోనూ మంచి విజయాన్ని సాధించడంతో శరత్ బాబుకు తమిళ, తెలుగు భాషల్లో అవకాశాలు పెరిగాయి.
నటుడిగా సౌత్ ఇండియన్ భాషల్లో దాదాపు 220 సినిమాల్లో నటించిన శరత్ బాబు తన కెరీర్ లో బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎనిమిది నంది పురస్కారాల్ని దక్కించుకోవడం విశేషం.సీతాకోక చిలుక, ఓ భార్య కథ, నీరాజనం సినిమాలకు వరుసగా నంది అవార్డులు వచ్చాయి. బాలచందర్ సినిమాల్లో ఆయనకు మంచి క్యారెక్టర్లు లభించాయి. గుప్పెడు మనసు , ఇది కథ కాదు చిత్రాల్లోని పాత్రలను ఆయన అద్భుతంగా చేసి ప్రశంసలు పొందారు.
నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శరత్ బాబు… వ్యక్తిగత జీవితానికి సంబంధించి మూడు వివాహాలు చేసుకుని వార్తల్లోకి ఎక్కారు. వివాదాలు ఎదుర్కొన్నారు. గతంలో శరత్ బాబు ప్రముఖ నటి రమా ప్రభను, తమిళ నటుడు నంబియార్ కుమార్తె స్నేహ లత లను పెళ్లాడారు. ఈ ఇద్దరితోనూ ఆయన విడిపోయారు. తర్వాత శరత్ బాబు మూడో వివాహం కూడా చేసుకున్నారు.
ఓ ఇంటర్వ్యూలో ఆయనకు వివాహానికి సంబంధించి ప్రశ్న ఎదురు కాగా… భార్య పేరు చెప్పేందుకు నిరాకరించారు. నా భార్యపేరు మిస్సెస్ శరత్‌బాబు అని మాత్రమే చెప్పుకొచ్చారు. పిల్లల విషయం అడిగితే తనకు పాతిక మంది పిల్లలు అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు శరత్ బాబు. మా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల పిల్లలు అందరూ కూడా నా పిల్లలే అని శరత్ బాబు వివరించారు.
మొదటి భార్య రమా ప్రభ ఒక ఇంటర్వ్యూ లో శరత్ బాబు మీద సంచలన ఆరోపణలు చేసారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ ఇద్దరూ 16 ఏళ్ళు కలిసి కాపురం చేసి…తర్వాత విబేధాలతో విడిపోయారు. ప్లాన్డ్ గా తన ఆస్తి అంతా రాయించుకొని ఒక పథకం ప్రకారం విడాకులు తీసుకున్నాడని రమా ప్రభ ఆరోపించారు. ఈ ఆరోపణలను శరత్ ఖండించారు.
రమాప్రభతో అసలు పెళ్లి కాలేదని .. అది కేవలం సహజీవనం మాత్రమే అని వ్యాఖ్యానించారు. శరత్ బాబు రెండో భార్య స్నేహలతా చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకున్నారు. మొత్తం మీద శరత్ బాబు వైవాహిక జీవితం అంత సజావుగా సాగలేదు.
ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో సుప్రసిద్ద నటులు శివాజీ గణేషన్, తమిళ నాడు దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలిత, కేఆర్ విజయ, రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కల్యాణ్ లతో పాటు రామ్ చరణ్, సూర్య తదితర హీరోలతో కలిసి నటించారు. శరత్ బాబు తెలుగులో చివరి సారిగా కనిపించిన మూవీ `వకీల్ సాబ్.