దక్షిణ కొరియాలో ఆస్కార్ అవార్డ్ తో సమానమైన గ్రాండ్ బెల్ అవార్డ్ పొందిన The Way Home.(JIBURO) సినిమా 2002 ఏప్రిల్ లో విడుదలైంది..దర్శకత్వం,కత, లీ జియాంగ్ హ యాంగ్..సినిమాటోగ్రఫీ, యూన్ హ్యాంగ్ సిన్. కత వివరాల్లోకి వస్తే….. తల్లి సియోల్ సిటీ లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సి రావటంతో,తన ఏడేళ్ల కొడుకు సాంగ్ వూ (యూ సియుంగ్ హో) ని కొన్నాళ్ళ పాటు అమ్మమ్మ(కిల్ యుల్ బూన్) దగ్గర వదిలి పెట్టి వెళుతుంది.
సియోల్ లాంటి పెద్ద సిటీ లో పెరిగిన సాంగ్ వూ కి ఎలాంటి ఆధునిక వసతులు లేని అమ్మమ్మ వుండే ఆ చిన్ని పల్లెటూరు అంటే ఏ మాత్రం ఇష్టం వుండదు.ఎంత వద్దని ఏడ్చి, గీ పెట్టినా తల్లి బలవంతంగా సాంగ్ ని ఆ పల్లెకు తీసుకుని వెళ్తుంది.అసలు అమ్మమ్మ రూపమే సాంగ్ కి నచ్చదు. ముడతలు పడ్డ ముదుసలి మొహం,బోసి నోరు, సరిగ్గా ఆనని చూపు,తెల్ల జుట్టు,చిన్ని ముడి, పైగా మాట్లాడలేని మూగది,పూర్తిగా వంగి పోయిన నడుముతో కట్టె పట్టుకుని నడిచే అమ్మమ్మ అంటే వాడికి చిన్నచూపు.
సాంగ్ వూని తన అమ్మ దగ్గర వదిలి వెళ్తూ అమ్మమ్మని ఇబ్బంది పెట్టవద్దు… ఆమె చెప్పినట్లు విను… అని జాగ్రత్తలు చెప్పి వాడికి కావలసిన కోక్ డబ్బాలు, బిస్కట్లు,ఇంకా బోలెడన్ని తినుబండారాలు,ఆట బొమ్మలు,వీడియో గేమ్స్ ఆడుకోవటానికి సెల్ ఫోన్ ఇచ్చి వెళ్తుంది సాంగ్ తల్లి. అమ్మ ఇచ్చి వెళ్ళిన తినుబండారాలు తింటూ,వీడియో గేమ్స్ ఆడుతూ,కాలం వెళ్ళ బుచ్చుతుంటాడు.తోటి పిల్లలు ఆడుకుందాం రమ్మన్నా వెళ్లడు.ఆ పిల్లలు శుభ్రంగా లేరని,వాళ్ళ దగ్గర అధునాతన ఆటబొమ్మలు లేవని వాళ్ళు నచ్చరు.
ఒక రోజు సాంగ్ కి అర్జంట్ గా టాయిలెట్ కి వెళ్లాల్సిన పరిస్థితి. అమ్మమ్మ నీళ్ళు తీసుకుని చెట్ల చాటుకు వెళ్ళమని సైగ చేస్తుంది. వెస్ట్రన్ కమోడ్ అలవాటైన సాంగ్ వూ చెట్ల చాటుకు వెళ్లననీ మొండి కేస్తాడు.ఇక అమ్మమ్మ కి ఏమి చేయాలో పాలుపోక,ఇంట్లో వున్న పెద్ద చట్టి లాంటి పింగాణి గిన్నె తెచ్చి పెట్టీ,అందులో కూర్చో మంటుంది.ఇక దాంట్లోనే పని కానిస్తాడు.అమ్మమ్మకి ఏ పనిలోనూ సాయం చేయడు.
ఆఖరికి చూపు ఆనక సూది లో దారం ఎక్కించి ఇవ్వమన్నా,చిరాకు పడతాడు . ఆడి ఆడి,ఫోన్ లో బ్యాటరీలు అయిపోతాయి..కొనివ్వమని బామ్మతో పేచీ..బామ్మ డబ్బులు లేవని సైగ చేస్తుంది. అమ్మమ్మ నిద్ర పోయేటప్పుడు,ఆమె జుట్టుముడిలో దోపి ఉంచుకునే వెండి ముడి పుల్లను మెల్లగా తీసుకుని షాప్ కి వెళ్తాడు.ఆ పిన్నుని గుర్తించిన దుకాణదారుడు సాంగ్ ని మందలించి పంపుతాడు.అమ్మమ్మ ముడిపిన్ను కానరాక ఒక చిన్న స్పూన్ ముడికి గుచ్చి పెట్టుకుంటుంది. వాడు కాళ్ళకు స్కెట్స్ వేసుకుని ఇల్లంతా తిరుగుతూ అల్లరి చేస్తున్నా అమ్మమ్మ ఒక్కమాట అనదు.. ఓర్పుతో ఉంటుంది.
ఒకరోజు కెంటకీ ఫ్రైడ్ చికెన్ కావాలని గోల పెడతాడు..సైగలతో అడిగి,అది కోడి కూర అని తెలుసుకుంటుంది బామ్మ.తను కష్ట పడి పండించే,పుచ్చకాయలు నాలుగింటిని తీసుకుని పక్కనే వున్న చిన్న టౌన్ కి నడుచుకుంటూ వెళ్ళి,కోడి పుంజుని తెస్తుంది.దాన్ని కోసి పెద్ద పెద్ద ముక్కలు చేసి… వుడికించి ఇస్తుంది. దాన్ని చూసిన సాంగ్ వు ఏడుపు ఎత్తు కుంటాడు..నేను కెంటకీ చికెన్ ఫ్రై అడిగితే ఇలా చేశావు అని తినకుండా అలిగి అలాగే పడుకుంటాడు.
ఆకలికి ఆగలేక ఒక రాత్రి వేళ లేచి,శుభ్రంగా తినేస్తాడు. ఒకరోజు అమ్మమ్మకి జ్వరం రావటంతో ఏ పని చేయలేక,నీరసంగా పడుకుండి పోతుంది..దాంతో సాంగ్ కి అమ్మమ్మ విలువ తెలిసీ వస్తుంది.అప్పటి వరకూ అమ్మమ్మ తనకు చేసిన సేవలు గుర్తు చేసుకుంటాడు.అమ్మమ్మకి సకల సపర్యలు చేస్తాడు.
ఇంకో రోజు అమ్మమ్మ పెరటిలో పండించే గుమ్మడికాయలు తీసుకుని సాంగ్ ని గూడా దగ్గరలో వున్న టౌన్ కి తీసుకెళ్ళి హోటల్ లో వాడికి కావలసిన నూడిల్స్ తినిపిస్తుంది. చాక్లెట్ పీ కొనిస్తుంది.డబ్బులు చాలవని తను మాత్రం ఏమీ తినదు..డబ్బులు చాలక సాంగ్ ని బస్ ఎక్కించి అంత దూరం తాను నడిచి ఇంటికి చేరుకుంటుంది.నడుం వంగి పోయి,కళ్ళు సరిగ్గా కానరాక… అతి కష్టం మీద నడిచి వస్తున్న అమ్మమ్మని చూసి సాంగ్ మనసు తీవ్రంగా కలత చెందుతుంది..ఇక్కడ మనవడు,అమ్మమ్మ నటన చాలా గొప్పగా వుంటుంది.
ఇంకో రోజు సాంగ్ పెరిగిన తన జుట్టు ని చూపిస్తాడు.అచ్చం సిటీ లో చేసినట్లే చేయమని బామ్మతో చెప్తాడు..స్టూల్ మీద కూర్చోబెట్టి,ఎంతో జాగ్రత్తగా చేసినా,కళ్ళు సరిగా కానరాని అమ్మమ్మకు అది కాస్త వంకర టింకర గా పొట్టిగా అవుతుంది..ఇక వాడు రాగాలు తీస్తూ ఏడుపు.. మెల్లగా అమ్మమ్మ చూపే ప్రేమ తోటి వారితో అమ్మమ్మ ప్రవర్తన… ఆమె కున్న మంచి పేరు … ఊర్లోని ప్రతి ఒక్కరూ అమ్మమ్మని ఎంతో ప్రేమతో,గౌరవం గా చూడటం ఇవన్నీ సాంగ్ లో మార్పు తెస్తాయి.అప్పటి వరకూ అమ్మమ్మని రకరకాల మారు పేర్లతో(నిక్ నేమ్స్) ఎడ్పించిన సాంగ్ ఇప్పుడు ఎంతో ప్రేమతో అమ్మమ్మా అని పిలవడం మొదలెడతాడు.
తోటి పిల్లలతో గూడా చక్కగా కలిసి పోయి ఆడుకుంటాడు.ఆ వూర్లో ఒక పిచ్చి పట్టిన ఆవు దారెంట పోయే వాళ్ళని,కుమ్ముతూ పొడుస్తూ వుంటుంది..దారిలో, అది వచ్చేటపుడు ఎవరైనా వుంటే చూసిన వాళ్ళు ఆవొస్తుంది,ఆవోస్తుంది తప్పు కొండి,తప్పు కొండి.అని హెచ్చరిస్తూ వుంటారు. సాంగ్ ఆవు రాకపోయినా వస్తుంది,వస్తుంది అని అరిచి వాళ్ళను పక్కదారి పట్టిస్తాడు. ఒకరోజు అదిగో పులి వచ్చేఅన్న కత చందాన ఎవరూ వీడి మాటలు నమ్మరు..నిజంగానే ఆవు వచ్చి వాళ్ళని గాయ పరుస్తుం ది. అమ్మమ్మ తో,తోటి పిల్లలతో ఎంతో ప్రేమానుబంధం పెంచుకున్న సాంగ్ ని తీసుకుని వెళ్ళటానికి తల్లి వస్తుంది. అమ్మమ్మ ను వదిలి వెళ్ళటానికి చాలా బాధ పడతాడు.. సూదులన్నిటికి దారాలు ఎక్కించి ఉంచుతాడు.
బామ్మకి చదువు రాదని,రకరకాల బొమ్మలు వేసిన కార్డు లు తయారు చేసి వాటిని అప్పుడప్పుడు పోస్ట్ చేయమని అమ్మమ్మకి చెబుతాడు.బస్ ఎక్కించి చేయి వూపుతున్న అమ్మమ్మని చూస్తూ… ఏడుస్తూ… వదల్లేక వదల్లేక వెళ్ళిపోతాడు . ఈ సినిమా లో కిమ్ యుల్ బూన్ అమ్మమ్మ గా నటించిందని చెప్పలేము.జీవించినదనే చెప్పాలి.నిజంగానే 78 ఏళ్ళ కిమ్ అప్పటి వరకూ ఒక్క సినిమాలో గూడా నటించలేదట.పైగా ఎప్పుడూ సినిమా గూడా చూడ లేదట.నడుము వంగి పోయి,నడుస్తూ, దయ కలిగిన మొహం తో ఆమె నటన అద్భుతం.
ఇక ఏడేళ్ళ యూ సీయుంగ్ హో చిన్నవాడైనా సందర్భోచితంగామొహంలో చిరాకు… అయిష్టత… ప్రేమ,దయ ను అద్భుతంగా ప్రదర్శించాడు. ద.కొరియా లోని పల్లె వాతావరణం… అక్కడి మనుషులు .. ప్రకృతిని దర్శకుడు చక్కగా చిత్రీకరించాడు. ఈ సినిమాకి గ్రాండ్ బెల్ అవార్డ్,బెక్సంగ్ ఆర్ట్స్ అవార్డ్,యంగ్ ఆర్టిస్ట్ అవార్డ్ వచ్చాయి.ద.కొరియా లో ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించింది . దర్శకుడు ఈ సినిమాని అందరి గ్రాండ్ మా లకు అంకితం చేశారు..సినిమా యూ ట్యూబ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వుంది.
ఈ సినిమా చూస్తున్నంత సేపూ,మనకి గూడా మన నానమ్మో, అమ్మమ్మో గుర్తుకు వచ్చి,వాళ్ళతో మనకున్న అనుబంధము మదిలో మెదిలి,కళ్ళు చెమర్చక మానవు… ఇప్పటి చిన్న పిల్లలకు తప్పక చూపించాల్సిన సినిమా ఇది.
—————– పూదోట శౌరీలు (బోధన్ )
ఇది కూడా చదవండి >>>>>>>>>> ఈ ఉక్కుమహిళ ఏం చేస్తున్నారో తెలుసా ?