సంఘటితమై సత్తా చాటారు!

Sharing is Caring...

రమణ కొంటికర్ల……………………………………………. 

సంఘటిత శక్తికెంత ఎంత శక్తి ఉంటుందో నిరూపించారు ఆ విద్యార్థులు. అచేతనంగా తయారై… ఎవరేమన్నా…
ఏం చేసినా… కనీస హక్కులను కాలరాసినా కనీసం గళమెత్తి మాట్లాడే నిరసన హక్కూ ఓటుందని మర్చిన జనానికి ఓ చైతన్య సూచికయ్యారు ఆ విద్యార్థులు. ఒక దశలో ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మద్దతు పలికేవారికి తెగేదాకా లాగుతున్నారనిపించినా… ససేమిరా అన్న వాళ్ల అంకుఠిత దీక్ష ఇప్పుడు తెలంగాణాలో ఓ ప్రధాన చర్చయ్యింది.

కుక్క తోకను పట్టుకుని గోదారీదిన చందంగా పార్టీలు, నాయకులు ఓవైపు సంఘీభావం ప్రకటిస్తూనే… విద్యార్థుల సమస్యను రాజకీయం చేయాలనుకున్నా.. వారు మాత్రం అవేమీ పట్టించుకోలేదు. అంతెందుకు వారికి కనీసం కొందరు నాయకుల పేర్లు కూడా తెలియవు. వారి ముందుంది వాళ్ల సమస్యలు… వారు కొట్లాడదల్చుకుంది వారి హక్కుల కోసం. ఇదీ మొత్తంగా తెలంగాణా రాష్ట్రమేర్పడ్డాక మొట్టమొదటిసారి ఓ బలమైన సర్కారును కదిలించిన విద్యార్థి నిరసనోద్యమం.

ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నిరసన దీక్షకు తెలంగాణా సర్కారు దిగివచ్చింది. ఎందరు వచ్చినా… ఎంత నిర్భంధం
విధించినా… వారి వాయిస్ ని ప్రజల్లోకి వెళ్లకుండా మీడియాకూ, విద్యార్థులకు మధ్య పోలీసుల రూపంలో బారికేడ్లు వేసినా… నిరసన ఆగలేదు… ఉద్యమం చల్లబడలేదు. ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా ఏడురోజులు.. పగలూ,  రాత్రి తేడాలేదు… ఎండావానా జాన్తానహీ… తమ హక్కులు సాధించుకునేవరకు.. తగ్గేదేలె.

ఇదీ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కథ. ప్రతిపక్షాలే గళమెత్తాలంటే అణిచివేతకు భయపడే కాలంలో… సామాన్యజనం మనకెందుకులే అని తమ ఇంటిదాకా.. తమదాకా  వచ్చినా సర్దుకుంటున్న రోజుల్లో… ఒక్కమాటలో చెప్పాలంటే చైతన్యం చచ్చిపోయి అచేతనావస్థ ఆవహించిన రోజుల్లో… ట్రిపుల్ ఐటీ విద్యార్థుల స్ఫూర్తి కేవలం వారి సమస్యల సాధన వరకే పరిమితం కాదు…. ఇవాళ ఎందరికో ఓ దిక్సూచి.

ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు… ఆ తర్వాత ఆ ప్రజల్నే గాలికొదిలేస్తే… అడిగానా పట్టించుకోకుంటే… నిరసనలకు దిగితే అణిచివేస్తే… ఇలాంటి వేళ… ట్రిపుల్ ఐటీ మిగిలిన లోకానికి ఓ మార్గదర్శి అయింది. అయితే ఇదేం రాత్రికి రాత్రే వీళ్లంతా ఇలా ఉద్యమానికి శ్రీకారం చుట్టలేదు. ఎంతోకాలంగా తమ మౌలిక సమస్యలపై గళమెత్తుతూనే ఉన్నారు. వైస్ ఛాన్స్ లర్ల హోదాలో లీడ్ చేసే ఐఏఎస్ లకు, స్థానిక ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికీ తమ ఆవేదనను వెళ్లగక్కారు.

కానీ… లోకంలో మిగిలిపోయిన… మిగిలిపోయేందుకు నిర్లక్ష్యం చేయబడిన ఎన్నో సమస్యల్లాగానే ట్రిపుల్ ఐటీదీ అందులో ఓ స్థానమైంది. కానీ, ఇక్కడే అలా కానివ్వద్దన్న బలమైన కాంక్ష అప్పుడప్పుడే విరబూస్తున్న పిల్లల్లో పురుడు పోసుకుంది. ఈ నిరంకుశత్వానికి ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యారు.

అయ్యా మా మొర ఆలకించండంటే కూడా కరుణించకుంటే… ఏంచేయాలో పక్కా ప్లాన్ చేసుకున్నారు. అందుకు అటు ఎండల్లోనూ… ఇటు వానల్లోనూ విద్యార్థులంతా కలిసి పట్టుకునే ఒకే రకమైన గొడుగులే నిలువెత్తు సాక్ష్యంగా నిల్చాయి. ఆ ప్లాన్ ప్రకారమే… పక్కా మహాత్ముడి పద్ధతిలో ఎక్కడా హింస ప్రజ్వరిల్లకుండా… శాంతియుతంగా తమ సత్యాగ్రహాన్ని మొదలెట్టారు. ఒక్కరోజైపోయింది. రెండో రోజు నిరసనలకు ఫుల్ స్టాప్ పడుతుందనుకున్నారు. మూడోరోజూ అదే ఊపు. ఇలా మొత్తంగా మొదటిరోజు ఏ స్థాయిలో ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటంలా ఉద్యమం మొదలైందో… అలా ఏడురోజుల పాటు విద్యార్థులు మొక్కవీడని ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించారు.

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ఎస్టాబ్లిష్ అయిన్నాడు… ఆ తర్వాత ఎంత పాప్యులరైందో
తెలియదుగానీ… ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ సాంకేతిక విద్యనందించే ఈ ఆర్జీయూకేటీ అంటే  ఇప్పుడు మాత్రం తెలియనివాళ్లుండరు. అంతగా ఇక్కడి విద్యార్థుల నిరసన ఎగిసిపడింది. దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించింది. ఎంతైనా సాంకేతిక విద్యనభ్యసిస్తున్నవాళ్లు కాబట్టి ప్రత్యక్ష కార్యాచరణకు మాత్రమే పరిమితం కాలేదు.

సోషల్ మీడియాను, మీడియానూ పెర్ ఫెక్ట్ గా వాడుకున్నారు. ఎందుకంటే వాటినే విద్యార్థులు నమ్ముకున్నారు. విద్యార్థుల పట్టుదల యావత్ లోకాన్నెలాగైతే ఆకర్షించిందో.. అదే స్ఫూర్తి ఇటు మీడియాలోనూ నింపింది. అందుకే ఎండైనా, వానైనా ఆ విద్యార్థుల కోసం 24 గంటల ఛానల్సన్నీ అక్కడే తిష్ఠ వేశాయి. ఏంజరుగుతుందో గంట గంటకూ అప్డేట్ చేశాయి.

తమ కర్తవ్యాన్ని లోకానికి పట్టిచూపాయి. వెరసి  విద్యార్థుల ఆందోళన ఇప్పుడు జగమెరిగిన పతాకశీర్షికైంది. ఇక సోషల్ మీడియానూ విద్యార్థులు ఉపయోగించుకున్న తీరు.. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంలో వణుకు పుట్టించింది. ఓ వైపు కేసీఆర్ దేశ రాజకీయాల వైపు దృష్టి సారిస్తున్న వేళ… వచ్చే ఎన్నికల నాటికి తమ పరిస్థితేంటని పీకే లాంటి వాళ్లతో సర్వేలు చేయిస్తున్న సమయాన… రాష్ట్రపతి ఎన్నికల్లో ఎటువైపుండాలో ఆలోచించే రోజుల్లో… కేసీఆర్ తో పాటు… ప్రభుత్వ పెద్దలందరి అటెన్షన్ ను ఆకర్షించిన ఉద్యమం ట్రిపుల్ ఐటీ అయ్యింది.

దాంతో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. నోటీస్ చేసినట్టు చెప్పుకొచ్చారు. దానికి విద్యాశాఖా మంత్రి సబితా ప్రతిస్పందించారు. తక్షణమే పరిష్కారానికి వీలున్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు… మిగిలినవి దశలవారీగా అన్నారు. సిల్లీ ఇష్యూసంటూ కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. మరి ఇంత సిల్లీ సమస్యలైతే… ఇంతకాలమెందుకు ఈ ప్రభుత్వం పరిష్కరించలేదన్నది సర్కారుకు విద్యార్థుల సెటైరికల్ ప్రశ్నైంది.

ఏవో పది పైసలు పడేసినట్టుగా సర్కారు వెంటనే పదిలక్షలు ప్రకటిస్తే… అస్సలు పట్టించుకోనేలేదు ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్. తమ మొత్తం సమస్యలు తీర్చాల్సిందేనన్నారు. వీసీ కావాలంటూ పట్టుబట్టారు. కేసీఆర్ రావాలని డే వన్ నుంచీ అదే భీష్మ ప్రతిజ్ఞ! మొత్తంగా ట్రిపుల్ ఐటీ ఇక రాజకీయ రంగు కూడా పులుపుకోవడంతో… మొత్తం ఎపిసోడ్ ఒక హైడ్రామాలా మారిపోయింది.

ప్రభుత్వంపై విరుచుకుపడటానికి ఏ బలమైన ఇష్యూ దొరుకుతుందా అని చూసిన విపక్షాలకు.. ట్రిపుల్ ఐటీ
బంపర్ ఆఫరైంది. నేతలు రావడం.. ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం… నినాదాలివ్వడం… ముఖ్యనేతల పర్యటనలుంటాయన్న సమాచారంతో బాసరలో అడుగడుగునా పోలీసులు పికెటింగ్స్ తో నిర్భంధాన్ని పెంచడం… బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కనీసం కామారెడ్డి వరకూ కూడా రాకుండా పోలీసులు అరెస్ట్ చేయడం… నారాయణ క్యాంపస్ దాకా వచ్చినా.. పోలీసులకు చిక్కి అరెస్టవ్వడం… ఆ తర్వాత నాటకీయ పరిణామాలను మరింత రక్తి కట్టిస్తూ  రేవంత్ ఎంట్రీ..  ట్రాక్టర్ ప్రయాణం… ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో పోలీసుల కళ్లుగప్పి దూకడం.. ఆ తర్వాత అరెస్ట్… ఓవైపు ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో లోపలేమీ తెలియకుండా… బారికేడ్లలోంచి ఏమీ కనిపించని స్థితిలో… కొందరు ముఖ్య నేతల పేర్లు కూడా తెలియని పరిస్థితిలో  విద్యార్థుల నిరసన…. మరోవైపు బయట రాజకీయ ఎత్తుగడలాట… ఇదిగో ఇలా రసవత్తరంగా తెలుగు డైలీ సీరియల్ లా సాగింది ట్రిపుల్ ఐటీ ఎపిసోడ్.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు బాసరకు ఐఐటీ తెస్తానంటూ
చేసిన ఎన్నికల వాగ్ధానాన్ని అటకెక్కించి… ట్రిపుల్ ఐటీ ఇచ్చి సరిపెట్టారు. అలా నాటి ఏపీలో మూడు ట్రిపుల్ ఐటీలు ఒకటి బాసరతో పాటు… కడప జిల్లాలోని ఇడుపులపాయ, కృష్ణా జిల్లాలోని నూజివీడులో ఏర్పాటయ్యాయి. ట్రిపుల్ ఐటీల పాలనా వ్యవహారాల కోసం అప్పటి ప్రభుత్వం మూడుచోట్ల ముగ్గురు డైరెక్టర్లను నియమించింది.

మిగిలిన అన్ని యూనివర్సిటీలకు గవర్నర్స్ ఛాన్స్ లర్స్ గా.. ప్రభుత్వ సూచన మేరకు వారికిష్టమైతే గవర్నర్లు నియమించేవారు వైస్ ఛాన్స్ లర్లుగా వ్యవహరించే ప్రక్రియకు భిన్నంగా ఈ ఆర్జీయూకేటి విషయంలో ఛాన్స్ లర్ ను, వీసీని నియమించే ప్రత్యేక గవర్నింగ్ కౌన్సిల్ నియామకై ఉంది. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత… టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ఉమ్మడి ఏపీలోని గవర్నింగ్ కౌన్సిల్ ను రద్దు చేసింది. కొత్త గవర్నింగ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసే క్రమంలో ప్రొసీజర్ ప్రకారం జరగాల్సిన తంతు ప్రకారం.. ఓ గెజిట్ తీసుకొచ్చింది.

అయితే ఆ గెజిట్ లో జరిగిన పొరపాటే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. కొత్త గవర్నింగ్ కౌన్సిల్ నియామకం కోసం యూజీసి బృందం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తో పాటు.. రద్దైన గవర్నింగ్ కౌన్సిల్ కలిసి ఆమోదించాలంటూ… ఏ గవర్నింగ్  కౌన్సిలైతే తీసుకురావాలనుకుంటున్నారో… ఆ గవర్నింగ్ కౌన్సిలే లేకుండా.. అదే గవర్నింగ్ కౌన్సిల్ మిగిలిన బృందాలతో కలిసి కూర్చుని తీర్మానం చేయాలన్న గెజిట్ ప్రచురించిన తీరు హాస్యాస్పదంగా, ప్రశ్నార్థకంగా మారింది.

దాంతో గెజిట్ ను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత ఈ పొరపాటును బయటకు పొక్కకుండా జాగర్తపడుతూనే… మరోవైపు ఈ యూనివర్సిటీల బాగోగులను గాలికొదిలేసింది. ఈ క్రమంలోనే టెక్నికల్ గా వీసీలను నియమించలేని ప్రభుత్వం ఐఏఎస్ లను ఈ యూనివర్సిటీలకు ఇంఛార్జులుగా వేసింది. వాళ్లకున్న శాఖలకు తోడు… ఈ విశ్వవిద్యాలయాల్లో సమస్యలు వాళ్లవి కాకుండా పోయాయి.

దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరమైంది. నళ్లాలుంటై.. కానీ నీళ్లు రావు… మెస్సుంటుంది… కానీ, కప్పలు, బల్లులు, పురుగులన్నం… చదువుకునేది సాంకేతిక విద్య… కానీ, ల్యాపుటాపులు కూడా ఉండవు… విరిగిపోయిన బెడ్స్ పైనే సగం సగం నిద్ర… బాత్రూమ్స్ చూస్తే అశుద్ధభారతానికి కేరాఫ్… ప్రతీ బడ్జెట్ లో తగ్గుతూ వచ్చే నిధులకేటాయింపు… కేటాయించిన నిధులూ మంజూరు చేయకపోవడం… ఇలా ప్రతీదీ ఈ ట్రిపుల్ ఐటీలో ఓ సమస్యే.

ఇలా వీసీ నియామకం ప్రభుత్వానికి కట్టిస్తున్న తలబొప్పి.. దాని వెనుక జరిగే ప్రొసీజర్ తెలిసో, తెలియకో మొత్తంగా మరో 11 డిమాండ్లతో పాటే.. వీసీ నియామకానికి 12  విద్యార్థులు కదం తొక్కారు. ప్రభుత్వ పెద్దలు ఏవైతే సిల్లీవని కొట్టిపడేశారో అవన్నీ తీరుస్తామని కలెక్టర్ బుజ్జగించాడు. విద్యార్థులు వినకపోయేసరికి… టెక్నికల్ గా వీసీని నియమించలేని ప్రభుత్వం మధ్యేమార్గంగా ఓ డైరెక్టర్ ను నియమించినా ఫలితం లేకపోయింది.

ఏకంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వచ్చినా లాభం లేకపోయింది. అదే పట్టుదల.. అదే దీక్ష విద్యార్థుల ఉద్యమం… మొత్తంగా దేశాన్నే బాసర వైపు తిప్పుకునేలా చేసింది. రాహూల్ గాంధీ సైతం ట్వీట్ చేసేలా చేసింది. జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. పక్కనే అచేతనావస్థలో కొట్టుమిట్టాడుతున్న మిగిలిన యూనివర్సిటీలకు.. విద్యార్థీసంఘాలకు ఓ ఊతకర్రైంది. అందుకే ట్రిపుల్ ఐటీ ఇప్పుడు గెల్చి నిలుస్తోంది.

చివరాఖరకు విద్యాశాఖామంత్రి విద్యాశాఖాధికారులు, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మీటింగ్ ఏర్పాటు చేసి..
హుటాహుటీన రాత్రి వేళ వానలో బాసరకు చేరుకున్నారంటేనే… ఇందులో విద్యార్థులేస్థాయి విజయాన్ని సాధించారో కళ్లకు కడుతోంది. ఫలితమేదైనా కావచ్చుగాక! కొమ్ములున్నాయని విర్రవీగే మొండెద్దును సంఘటితంగా ఉంటే ఎలా వంచచ్చో.. ఇప్పుడు దేశానికీ, రాష్ట్రానికీ ఈ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఐకమత్యం మరోసారి గుర్తుచేస్తోంది.

చిమ్మచీకటి ఆవహించిన సమాజానికి కాగడా అయి… ఓ చైతన్యదీపికై… దాన్నెలా చీల్చి చెండాడి సానుకూల ఫలితాన్ని సాధించవచ్చో దారి చూపించింది. మొత్తంగా ఏడురోజుల ట్రిపుల్ ఐటీ ఎపిసోడ్ ఓ బ్లాక్ బస్టర్ సినిమాలా హృదయాలను కొల్లగొట్టింది. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా.. ? బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతీ అని నినదించిన బద్దెన ఐకమత్యానికి.. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ ఓ ప్రతీక!

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!