సుప్రసిద్ధ నటుడిగా చిత్రపరిశ్రమలో రాణించిన కమల్ హాసన్ .. రాజకీయాల్లో ఇప్పటికైతే ఫెయిల్ అయినట్టే. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. కమల్ హాసన్ నటుడిగా ప్రజల ఆదరణ పొందారు కానీ రాజకీయ నాయకుడిగా ఓటర్ల నిరాదరణకు గురయ్యారు.
కమల్ హాసన్ కలతుర్ కన్నమ్మలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఈ సినిమాలో నటనకు గాను రాష్ట్రపతి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 1975లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన అపూర్వ రాగంగళ్(తెలుగులో తూర్పు పడమర ) ఆ తర్వాతగా వచ్చిన వసంత కోకిల, మన్మధ లీల వంటి చిత్రాలు కమల్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ఇంకా స్వాతి ముత్యం, నాయకుడు, భారతీయుడు వంటి చిత్రాల్లో నటించి దేశ వ్యాప్త గుర్తింపు పొందాడు. అంతులేని కథ, మరో చరిత్ర, సాగర సంగమం, ఆకలి రాజ్యం, క్షత్రియ పుత్రుడు, పుష్పక విమానం, ఇంద్రుడు చంద్రుడు, తెనాలి, పంచ తంత్రం, బ్రహ్మాచారి,ఈనాడు, హేరామ్,దశావతారం,విశ్వ రూపం వంటి సినిమాలు కమల్ ఖ్యాతిని ఇనుమడింప చేశాయి.
60 ఏళ్లు సినిమాల్లో పనిచేసిన అతికొద్ది మంది నటులలో ఒకరిగా కమల్ హాసన్ నిలిచారు. కమల్ శివాజీ గణేశన్ ను తన గురువుగా భావించేవాడు.శివాజీ కూడా తన నట వారసుడు కమల్ అని పలుమార్లు చెప్పారు. సినిమాలలో కమల్ గురువు శివాజీని మించిపోయాడు.మూడు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డులు సాధించారు. పద్మశ్రీ ,పద్మభూషణ్ పురస్కరాలు అందుకున్నారు. ఇక చిన్న చితకా అవార్డులకు లెక్కేలేదు.
కమల్ శివాజీ గణేశన్ లాగానే “మక్కల్ నీది మయ్యాం” పేరిట సొంత పార్టీ పెట్టారు.కమల్ సిద్ధాంతాల్లో కొన్ని బాగానే ఉన్నాయి కానీ అవి సరిగ్గా జనంలోకి వెళ్లినట్టులేవు. ఓట్లు కొనుగోలు చేయం..అది పార్టీ పాలసీ ప్రకటించిన కమల్ తన మాట నిలుపుకున్నారు.
2019 లో జరిగిన లోకసభ ఎన్నికల్లో 37 మందిని బరిలోకి దింపారు. ఒక్కరూ కూడా గెలవలేదు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తాను స్వయంగా పోటీ చేస్తూ .. 142 మందికి టిక్కెట్లు ఇచ్చారు. ఎక్కడా పార్టీ ప్రభావం చూపలేకపోయింది. కమల్ తో సహా అందరూ ఓడిపోయారు.
కోయంబత్తూర్ సౌత్ లో బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో 1728 ఓట్ల తేడాతో కమల్ ఓడిపోయారు. పుదుచ్చేరిలో కూడా 22 సీట్లలో పోటీ చేసి ఒక్క సీటులో కూడా గెలవ లేకపోయారు. ఆ పార్టీకి తమిళ నాడులో 1,210,886 ఓట్లు పుదుచ్చేరిలో 15,825 ఓట్లు వచ్చాయి.
ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన కొద్ది రోజుల తర్వాత, పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్ మహేంద్రన్, సంస్థలో “ప్రజాస్వామ్యం” లోపించిందని ఆరోపిస్తూ పార్టీ నుండి వైదొలిగారు.ఇక అప్పటినుంచి పార్టీ లో రాజీనామాల పర్వం మొదలైంది. కీలక నేతలంతా బయటికి వెళ్లిపోయారు. అలా వరుస ఎదురుదెబ్బలు మక్కల్‌నీది మయ్యం వర్గాల్ని డీలా పడేలా చేశాయి.
ఆ పార్టీకి అసలు కొన్ని జిల్లాల్లో కార్యదర్శులే కరువయ్యారు. ఇటీవల జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల్లోనూ కమల్ పార్టీకి ఓటమి తప్పలేదు.కొన్నాళ్ళు పార్టీని ఉంచాలా? మూసివేయాలా అని మల్లగుల్లాలు పడిన కమల్ పార్టీని మూసివేయకుండా నడిపించడం గొప్ప విషయమే. స్వల్పకాలంలో ఫలితాలు రాకపోయినా భవిష్యత్తులో ప్రజలు తన వెంట నడవొచ్చు అనే ఆశాభావంతో పార్టీ నడుపుతున్నారు. ముందు ముందు ఏమి జరుగుతుందనేది కాలమే నిర్ణయించాలి.