రాజ్య సభలో బలం లేకపోయినా బీజేపీ ఎపుడూ కంగారు పడలేదు. చాకచక్యంతో చక్రం తిప్పిన ఉదాహరణలున్నాయి. బీజేపీ అందులో కాంగ్రెస్ ను మించిపోయింది. 2019లో సహ చట్ట సవరణలకు ఉభయ సభల ఆమోదం లభించింది. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలపై ఎన్డీయే ఆధిక్యత సాధించింది.
రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా వైసీపీ , టీ ఆర్ ఎస్, బీజేడీ పార్టీ సభ్యుల సహకారంతో సవరణల బిల్లు పాస్ అయింది. బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించి బిల్లు పాస్ అయ్యేందుకు కృషి చేశారు. కాంగ్రెస్ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించింది కానీ ఆ పార్టీ బలం సరిపోలేదు. అయితే యూపీఏ యేతర పార్టీలతో మాట్లాడి వారి నేతలను ఒప్పించే ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు.
ఈ క్రమంలోనే అమిత్ షా యే స్వయంగా రంగంలోకి దిగి వివిధ పార్టీల అగ్రనేతలతో మాట్లాడి వారిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అమిత్ షా అంతటి వాడు అడిగితే కాదని చెప్పే ధైర్యం ఎవరికుంటుంది. ఏది ఏమైతేనేమి సభను మేనేజ్ చేయడంలో ఎన్డీయే ముందు కాంగ్రెస్ నిలబడ లేకపోయిందనే చెప్పుకోవాలి. రాజ్యసభలో 117 మంది ఎంపీలు సవరణలకు అనుకూలంగా ఓటు వేస్తే కేవలం 75 మంది ఎంపీలు బిల్లును వ్యతిరేకించారు. ఇలా చాలా బిల్లులను పాస్ చేయించుకున్నారు.
2019 లోకసభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి ఎన్డీయే అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే లోక్ సభలో 300 మందికిపైగా ఎంపీలున్నా, రాజ్యసభలో తగినంత మంది సభ్యులు లేరు. దీంతో కీలకమైన బిల్లులు ఆమోదించుకునేందుకు కొన్నాళ్ళు బీజేపీ ఇబ్బందులు పడింది. ఎన్డీయేతర పార్టీలను బుజ్జగించి కొన్ని బిల్లులు ఆమోదింప జేసుకుంది.
కొన్ని బిల్లులు పెండింగ్ లో ఉండిపోయాయి. 2019 కి ముందూ ఐదేళ్లూ అలానే నడిచింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పెద్దల సభలో ‘మైనారిటీ స్టేటస్’తోనే నెట్టుకొచ్చింది. ఇప్పుడు మెజారిటీ దిశగా సాగుతోంది. పార్టీ బలోపేతమై రాజ్య సభలో బలం పెరగడానికి పార్టీకి సుమారు ముప్పయేళ్ల కాలం పట్టింది. ఎంతో కష్టపడితే గానీ 100 సీట్లకు చేరుకోలేకపోయింది.
245 మంది సభ్యులున్న రాజ్యసభలో మెజారిటీ మార్క్‌కు బీజేపీ సభ్యుల సంఖ్య తక్కువగా ఉంది. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి రాజ్యసభలో బీజేపీ బలం క్రమంగా పెరుగుతూ వస్తోంది. అప్పట్లో రాజ్యసభలో బీజేపీకి 55 మంది సభ్యులు ఉండగా.. తర్వాత అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకోవడంతో ఈ సంఖ్య ఇపుడు సెంచరీ మైలురాయిని అందుకుంది.
1990లో రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి 108 మంది సభ్యులు ఉన్నారు. తర్వాత నుంచి ప్రాంతీయ పార్టీల హవా మొదలుకావడంతో రాజ్యసభలో కాంగ్రెస్ బలం తగ్గుతూ వచ్చింది. కాగా, బీజేపీ కొద్దిరోజులు మాత్రమే ఈ సెంచరీ మార్క్‌ను నిలబెట్టుకునే అవకాశముంది. ఏదైనా అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంటే బలం పెరగవచ్చు.