Sheik Sadiq Ali……………………………….
యాదాద్రి….ఒక ఇంటర్ నేషనల్ బ్రాండ్ !
అవును మనకొక అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రం కావాలి.ఆ లోటును తీర్చటానికి యాదాద్రి కావాలి.తెలంగాణా వందల ఏళ్ల నుంచీ ముస్లిం పాలకుల పాలనలో ఉండటం వల్ల ఈ నేల మీద సరైన చెప్పుకోదగ్గ ఒక్క హిందూ దేవాలయం,ఆధ్యాత్మిక కేంద్రం అంటూ లేకుండా పోయాయి. కాకతీయుల కాలంలో విలసిల్లిన అనేక క్షేత్రాలు శిథిలమయ్యాయి.పాలకుల నిర్లక్ష్యం వివక్ష కారణంగా మట్టిలో కలిసిపోయాయి.
తెలంగాణ చుట్టూ ఉన్న ఆంధ్ర,తమిళనాడు,కేరళ,కర్ణాటకలో అనేకానేక సుప్రసిద్ధ క్షేత్రాలు ఉన్నాయి,మహారాష్ట్ర,ఉత్తరాది రాష్ట్రాల్లోనైతే అవి అసంఖ్యాకంగా ఉన్నాయి.తెలంగాణా లోనూ అలంపురంలో జోగులాంబ ఆలయం ఉంది.అదెక్కడో దూరాన తుంగభద్రా తీరంలో ఉంది.సరైన రవాణా సౌకర్యాలు లేవు.వేములవాడ లో రాజన్న ఆలయం ఉంది.కానీ సరైన సౌకర్యాల కల్పనకు అవసరమైన భూమి అందుబాటులో లేదు.అక్కడికి చేరటం కష్టమే.బాసర మరీ దూరంగా ఉంది. ఒక్క ఒరుగల్లులో మాత్రమే రామప్ప,వేయి స్తంభాల గుడి వంటివి మాత్రం మిగిలి ఉన్నాయి.అవి కూడా అశేష భక్తుల అవసరాలకు అనుగుణంగా లేవు.
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ, ఆ మాటకొస్తే యావత్ భారతదేశం ఆధ్యాత్మిక అవసరాలు తీర్చటానికి అనువైన క్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామి వారు కొలువై ఉన్నారు.యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారికి ఎంత శక్తి ఉన్నా,ఆ క్షేత్రానికి ఎంతటి చరిత్ర,స్థలపురాణం ఉన్నా శతాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా తగిన గుర్తింపునకు నోచుకోలేదు.అలాగే ఈ తెలంగాణలో ఇటీవల వరకు ఒక ఆవేశం,ఉద్రేకం,ఆవేదన,ఆక్రందన ,అశాంతి కూడా ఉండేవి.మొర ఆలకించటానికి సరైన దేవుడు కానీ,క్షేత్రం కానీ ఉండేది కాదు.
సరిగ్గా ఇలాంటి సమయంలో కేసీఆర్ అనే ఒక విజనరీ వచ్చాడు.ముందు తెలంగాణ స్వరాష్ట్రం తెచ్చాడు.ఒక భరోసా నిచ్చాడు.ఆ తర్వాత కాళేశ్వరం తెచ్చాడు.బీడువారిన తెలంగాణా భూముల్లో గోదారి గంగను పారించాడు..ప్రజల్లో అశాంతి,అసహనం చాలావరకు తగ్గిపోయింది.ఇక రాష్ట్రం ప్రశాంతంగా,ప్రగతి పథంలో సాగాలంటే ఏం కావాలి?ఒక సువిశాల అత్యున్నత ఆధ్యాత్మిక కేంద్రం కావాలి.శాంతి కావాలి.మానసిక ప్రశాంతత కావాలి.అవన్నీ ఇవ్వగలిగిన అత్యద్భుత ప్రదేశం యాదగిరిగుట్ట.
క్షేత్రానికి ఉన్న మహత్తు అందరికీ తెలిసిందే.క్షేత్రాన్ని ఎంత కావాలంటే అంత విస్తరించటానికి అవసరమైన వేల ఎకరాల భూములు చుట్టూ అందుబాటులో ఉన్నాయి.నీటి అవసరాలు తీర్చటానికి గోదావరి జలాలు ఉన్నాయి.జాతీయ రహదారులు, రైల్వే లైన్లు,అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటేమిటి అన్ని రకాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి.దేశ,విదేశీ యాత్రికులకు 24 గంటలూ అందుబాటులో ఈ క్షేత్రం ఉంటుంది.
వందల కోట్ల వ్యయంతో పునరుద్ధరించబడిన ఈ క్షేత్రం భవిష్యత్తులో తెలంగాణ తలరాతను మార్చటం ఖాయం.తెలంగాణ సృష్టించుకున్న ఒక ఇంటర్ నేషనల్ బ్రాండ్ యాదాద్రి.ఇక్కడ భవిష్యత్తులో అనేక ఆశ్రమాలు,ఆధ్యాత్మిక కేంద్రాలు వస్తాయి.ప్రవచన కారులు,ఆధ్యాత్మిక గురువులు వస్తారు.
ప్రపంచం అంతా తలతిప్పి యాదాద్రిని చూసే రోజులు త్వరలోనే వస్తాయి.అయితే నిర్మించగానే సరిపోదు.ఇక్కడి మహత్యాలు,గాధలు ప్రపంచానికి చాటి చెప్పాలి.ఆ సాహిత్యం పంపిణీ చేయాలి.డిజిటల్ రూపేణా నలుమూలలకూ యాదాద్రి గొప్పతనం తెలిసేలా చేయాలి.భక్తుల నోటా అదేలాగూ చేరుకుంటుంది.
అలాగే అక్కడ భద్రత,పరిశుభ్రత లకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.క్షేత్ర పవిత్రతను కాపాడాలి.సంస్థను ఆర్ధికంగా బలోపేతం చేయటమే కాకుండా స్వయంసమృద్ధి సాధించేలా చర్యలు తీసుకోవాలి. స్థానిక ప్రజలకు అది ఎప్పటికీ యాదగిరిగుట్టనే.ప్రపంచానికి మాత్రం తెలంగాణ బ్రాండ్ యాదాద్రి గానే ప్రసిద్ధి చెందుతుంది.
జై నారసింహ.