రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య సాగుతున్న వార్ ఇప్పట్లో ముగిసే సూచనలు లేవు. శాంతి చర్చలు జరిగినా ఫలితాలు ఏమీ కనిపించడం లేదు.శతఘ్నులు, రాకెట్లు, బాంబులతో రష్యా విధ్వంసకాండ విశృంఖలంగా సాగుతూనే ఉంది. అయినా ఉక్రెయిన్ వెనకడుగు వేయడంలేదు. పుతిన్ సేనతో పోరాడుతోంది.
కీలక నగరాల్లోకి రష్యా సైన్యాన్ని రానీయకుండా అడ్డుకుంటోంది. రష్యా ఆయుధ పాటవం ముందు తన సత్తా ఏ మాత్రం సరితూగదని తెలిసినా ఉక్రెయిన్ ఎందుకు వెనక్కి తగ్గడంలేదు? దీని మొండి ధైర్యానికి కారణం ఏమిటి? అంటే పాశ్చాత్యదేశాల నుంచి అన్ని రూపాల్లో అందుతున్న సహాయమేనని చెప్పవచ్చు. అంతర్జాతీయ మీడియా కూడా అదే కారణమంటోంది.
నేరుగా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగకపోయినా.. వివిధ మార్గాల్లో అమెరికా,నాటోలోని దాని మిత్రదేశాలు ఉక్రెయిన్‌కు విస్తృతంగా సాయం అందిస్తున్నాయి.. ఉక్రెయిన్ ప్రతిఘటనకు ప్రాణవాయువులు అందిస్తున్నాయి. ఈ సమాచారం తెలుసుకునే పుతిన్ దాడులు కొనసాగిస్తున్నారు. ఉక్రెయిన్ కి ఆయుధాలు అందకుండా విమానాశ్రయాలను, నౌకాశ్రయాలను ధ్వంసం చేస్తున్నారు.
అయినప్పటికీ యుద్ధం మొదలయ్యాక వారంలోనే అమెరికా, దాని నాటో మిత్రపక్షాలు 17వేలకుపైగా ట్యాంకు విధ్వంసక అస్త్రాలను ఉక్రెయిన్ కి పంపాయి. ఈ ఆయుధాలలో శక్తిమంతమైన జావెలిన్ క్షిపణులూ ఉన్నాయని మీడియా సంస్థలు రాస్తున్నాయి. ఉక్రెయిన్ కు ఆయుధ సరఫరా చాలా వేగంగా సాగుతోంది. గత ఏడాది ఆగస్టులో ఉక్రెయిన్‌కు అమెరికా ఆరు కోట్ల డాలర్ల ఆయుధ ప్యాకేజీని ప్రకటించింది.
గత నవంబరు వరకూ వాటి సరఫరా పూర్తికాలేదు. గతనెల 26న మరో 35 కోట్ల డాలర్ల ఆయుధ ప్యాకేజీని ప్రకటించింది. 48 గంటల్లోనే వాటి సరఫరా మొదలైంది. 70 శాతం ఆయుధాలు ఐదు రోజుల్లోనే ఉక్రెయిన్‌కు అందాయట. ఐరోపాలోని అమెరికన్ స్థావరాల వద్ద ఉన్న ఆయుధ నిల్వల నుంచే ఈ ఆయుధ సంపత్తిని అందిస్తున్నారు.
వీటిని తొలుత సి-17 సైనిక రవాణా విమానాల్లోకి ఎక్కించి ఉక్రెయిన్‌కు పొరుగునున్న దేశాలకు కేంద్రాలకు తరలించారు. ఇవి ప్రధానంగా పోలండ్, రొమేనియాలో ఉన్నాయి. అక్కడి నుంచి ఉక్రెయిన్ రవాణా విమానాలు తమ దేశ సరిహద్దుల్లోని స్థావరాలకు వాటిని చేరవేస్తున్నాయి. రోడ్డు మార్గంలోనూ వెళుతున్నాయి. అయితే రష్యా దాడుల కారణంగా సులువుగా రవాణా చేసేందుకున్న అవకాశాలు క్రమంగా తగ్గిపోతున్నాయి.
పోలండ్ వద్ద సోవియట్ హయాం నాటి మిగ్-29 యుద్ధవిమానాలు ఉన్నాయి. వీటిని ఉక్రెయిన్ పైలట్లు నడపగలరు. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని ఆ దేశానికి అందించాలన్న ప్రతిపాదన ఉంది. ఆయుధాలు అందించడంతోపాటు ఉక్రెయిన్‌కు తెరవెనుక నుంచి తోడ్పాటునూ అమెరికా అందిస్తోంది. ప్రధానంగా నిఘా, సైబర్ రంగాల్లో ఇది సాగుతోందని అంటున్నారు.
కీవ్‌లో రష్యా బలగాల చేతికి చిక్కకుండా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన అమెరికా అందించిన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సాధనాలను ఉపయోగిస్తున్నారు. వాటిని ట్యాప్ చేయడం అసాధ్యం. ఆ సాధనాల సాయంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ ఆయన రహస్యంగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే వాషింగ్టన్లో లాబీయింగ్ బృందాలు, న్యాయ సంస్థలు ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా ప్రభుత్వంతో విస్తృతంగా మంతనాలు చేస్తున్నాయి. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని బైడెన్ సర్కారును ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ తరహా సేవల కోసం ఒకప్పుడు ఉక్రెయిన్ ప్రభుత్వం నుంచి భారీగా డబ్బు వసూలు చేసిన ఆ సంస్థలు.. ఇప్పుడు ఉచితంగానే పనిచేస్తున్నాయి.
మొత్తం మీద అమెరికా, దాని మిత్రదేశాలు అందిస్తున్న ఆయుధాలను ఉక్రెయిన్ బాగా వాడుకుంటోంది. భుజం మీద నుంచి పేల్చే ట్యాంకు విధ్వంసక జావెలిన్ క్షిపణితో జెలెన్స్కీ సేన.. గత వారం రష్యా ట్యాంకులు, సరకుల సరఫరా వాహనశ్రేణిపై విరుచుకుపడ్డాయి. ఫలితంగా రష్యా దళాలు వేగంగా ముందుకు కదలలేక పోతున్నాయి.
మొత్తం మీద చూస్తే మరికొన్నాళ్లు యుద్హం కొనసాగవచ్చు. నిజంగా ఉక్రెయిన్ కి ఏ దేశం సహాయం చేసి ఉండకపోతే జెలెన్ స్కీ ఈ పాటికి లొంగి పోయేవాడు. జెలెన్ స్కీ తెలివిగా నాటో లో చేరకుండానే సహాయం పొందుతున్నాడని కోవాలా ? లేక బైడెన్ అతగాడిని అడ్డం పెట్టుకుని పుతిన్ తో యుద్ధం చేస్తున్నాడనుకోవాలా ? చివరికి ఏమి జరుగుతుందో చూడాలి.

