ఈ కాకినాడ శంకర్ కథే వేరు!

Sharing is Caring...

Subbu Rv …………………………………….. 

Inspiration …………………………………….

భాగ్యనగరంలో బ్రతుకు బాగుంటుందనే ఆశతో ఎక్కడెక్కడి నుండో చేరిన బాటసారుల ఎందరో. ఒక్కోరిదీ ఒక్కో కథ.. ఎవరు ఎక్కడినుండి వచ్చినా చక్కగా చేరదీస్తుంది ఈనగరం. స్వాగతం తప్ప తిరస్కరణ ఎరుగని నగరమిది.. మనలేక, మనసు చంపుకోలేక వచ్చినోళ్ళ బ్రతుకు కథలతో ఎప్పుడూ పరిగెడుతుండే హైదరాబాద్ లో గల్లీ గల్లీకో గుండె తడి చేసే కహానీలు కోకొల్లలు. కాకినాడ నుండి అలా బయల్దేరి వచ్చిన వ్యక్తే శంకర్. 

బొంగులో చికెన్ అంటే గుర్తొచ్చేది అరకు. అరకు వెళ్లిన వాళ్ళు  దీని రుచికి దాసోహం అవ్వాల్సిందే. అదే సువాసన నాకు మంజీర మాల్ పక్క సందులో వచ్చింది. అక్కడే కొత్తగా పెట్టిన బొంగులో చికెన్ స్టాల్  కనిపించింది. భాగ్యనగరంలో బొంగులో చికెనా..? అది కూడా అరకులో ముక్కుకి చేరిన ఘుమఘుమలతో.. నోట్లో లాలాజలం జలపాతంలా ఊరుతోంది, వెళ్ళి తినాలనిపించింది. అరకు దాకా అంటే ఆలోచన చెయ్యాలి కానీ ఆరడుగుల దూరంలో ఉంటే ఆలోచిస్తా కూర్చుంటామా..? అందుకే ఠక్కున వెళ్లి  బొంగులో చికెన్తో పాటు శంకర్ కథ కూడా పట్టేశా..

వంట మాస్టర్ కావాలి అనే ప్రకటన శంకర్ ని హైదరాబాద్ చేర్చింది. ఒక హోటల్ పెట్టడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. శంకర్ ఇక్కడికి వచ్చాక రమ్మన్న వ్యక్తి కొన్ని కారణాల వల్ల పని మొదలు పెట్టలేదు. మరేదైనా పనికి వెళ్ళాలా ఇంకేదైనా చేద్దామంటే పెట్టుబడి లేదు. కానీ శంకర్ కి ఒక కుటుంబం ఉంది, ఇలాగే ఉంటే ఊర్లోని వాళ్ళు ఎదురుచూస్తూ వుంటారు కదా., అందుకే ఆ వ్యక్తితో మాట్లాడి ఫిఫ్టీ ఫిఫ్టీ పార్టనర్షిప్ మీద ఇది స్టార్ట్ చేశాడు. 

బొంగులో చికెన్ చేయడం లో శంకర్ చేయి తిరిగినోడు. అందులోనూ పెట్టుబడి తక్కువ, లాభనష్టాలు ఏరోజుకారోజు తెలుస్తాయి. మొదటి అడుగు వేశాడు.  బొంగులు, మసాలా ఊరి నుండి తెప్పించి పదివేలతో మొదలుపెట్టాడు. అక్కడ స్థలం ఒక వ్యక్తి ఇచ్చాడు. మసాలా చెయ్యడం వచ్చినా ఇక్కడున్న కారానికి ఆ రుచి రావడం లేదు కాబట్టి బొంగులతో పాటు మసాలా కూడా అక్కడనుండే తెప్పిస్తాడు.

మధ్యలో మసాలా చేసినా సరిగా రుచి రాక ఇబ్బంది పడ్డాడు. బేరం మొదట్లో అంత లేదు, మళ్ళీ మసాలా అంటే ముఖ్యంగా కారం మార్చాక బాగుందట. బహుశా బొంగులో చికెన్ కి బొంగు ముక్కలే కాదు, కారం కూడా ఆ ఊరిదే కావాలనుకుంటా.. బొంగు ఒక్కోటి ఏభై రూపాయలు పడుతుంది.  ఒక్కోసారి పైన పెద్ద బొంగులు వేసి లోపలికి పోయేసరికి చిన్నవి వేసి పార్సిల్ పంపుతారు.

ఒక బొంగులో అర కేజీ నుండి కేజీ వరకు చికెన్ పడుతుంది. ఒక కేజీ చికెన్ ఉడికాక షుమారుగా 400 గ్రాముల బరువు తగ్గుతుంది. కాబట్టి బొంగులో చికెన్ కేజీ ఏడు వందల రూపాయలకు అమ్ముతాడు. ఒక్కసారి వాడిన బొంగు మరలా ఉపయోగపడదు. ఒక ప్లేట్ వచ్చి 150 రూపాయలకు అమ్ముతాడు. వేడి వేడిగా తింటే యమా రుచిగా ఉంటుంది. 

బ్రతకాలి అనుకుంటే ఎన్నో మార్గాలు. జీవితం అనేక పరీక్షలు పెడుతుంది. శంకర్ కూడా ఇలాంటి ఎన్నో ఎదుర్కొన్నాడు. అన్నీ దాటి ఈరోజు ఇంకో బ్రాంచ్ పెట్టబోతున్నాడు. శంకర్ చేస్తున్న బొంగులో చికెన్ కి అభిమానులు పెరిగారు. రోజుకి 10 నుండి 15 కేజీల చికెన్ అమ్ముతున్నాడు. నేను మొదలుపెట్టిన రెండో రోజు వెళ్ళాను.

తరువాత రెండు నెలలకి వెళ్ళాను. ఈలోపు ఎన్నో మార్పులు. శంకర్ నిలదొక్కుకున్న తీరు అద్భుతం. బొంగులో చికెన్ తినాలని ఉంటే వెంటనే శంకర్ దగ్గరకు వెళ్ళండి. మంచి రుచికరమైన చికెన్ మీకు దొరుకుతుంది పూర్తి అరకు రుచిలో నాదీ గ్యారెంటీ. ఉద్యోగం లేదని ఎవరినో నిందిస్తూ కూర్చునే కంటే స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకుని ఎందరికో స్ఫూర్తి గా నిలవడం గొప్ప విషయం. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!