నరేష్కుమార్ సూఫీ………………….
కొన్ని కథలుంటాయ్… పెద్దగా మెసేజ్ ఉండదు, మరీ అద్బుతమైన భాష కూడా ఉండదు. రైటర్ Bathula prasadarao తనలోని అద్భుతమైన ఫిలాసఫీని మనమీద రుద్దే ప్రయత్నం కూడా చెయ్యడు.. అన్నిటికన్నా ముఖ్యంగా “సామాజిక ప్రయోజనమ్” అనే మహత్తర కార్యాన్ని తలకెత్తుకోడు..
అయితే…! మరా కథలో ఏముంటుంది? కేవలం మనల్ని మనంగా చూసుకోదగ్గ వో చిత్రణ ఉంటుంది. నిజ జీవితంలో ఏదైతే మిస్సవుతున్నామో ఆ పాయింట్ మీద మనల్ని ఉంచి కాసేపు మనలోని అశాంతిని పక్కకు తీసేసే ఓ కాల్పనిక కాలం ఉంటుంది. ఆమెకు అడవిలో ఉండే ఒక అరుదైన మొక్క కావాలి, అతనికి…. ఆమె కోసం ఏదైనా చెయ్యటం కావాలి. ప్రాణాలకు తెగించి అడవిలోకి ప్రయాణం మొదలైంది.
ఈ ఇద్దరూ ఎవరు? ఒకరికి ఒకరు ఏమౌతారు? సమాధానం “స్నేహితులు… ఇద్దరిమధ్యా ఉన్నది కేవలం స్నేహం. నలభైలు దాటినా వయస్సులో ఆ ఇద్దరూ చేసిన సాహస యాత్ర ఈ కథ. మధ్యలో కనిపించే కోయ గూడాలూ, యానాది మనుషులు. ఈ సోకాల్డ్ నాగరికతకు దూరంగా వాళ్ళ బతుకుతీరు. అడవి సౌందర్యం, అడవిలోని బీభత్సం అంతా కలిపి ఒక మంచి ఫీల్ ఇచ్చే కథ.
అడవి జంతువుల మధ్య ఉండే పోరాటం కనిపిస్తుంది. మనం కోల్పోతున్న దట్టమైన అడవులు గుర్తొచ్చి బాధగానూ ఉంటుంది. ఉరుము లాంటి కోయ యువకుల లాగా మనమూ జీవించగలిగితే ఎంత బావుండనిపిస్తుంది.ఇదంతా ఒక జర్నీ, మాన్ వర్సెస్ వైల్డ్ లో బేర్ గ్రిల్స్ లాంటి ఒక థ్రిల్లింగ్ ప్రయాణం. అడవిలో వెన్నెల ఎంత అందమో అడవిలో ఉండే ప్రమాదాలు అంత భయానకం. అందుకే అడవి మనల్ని ఆకర్షిస్తుంది.
అనుక్షణం భయం, అద్భుతం అనిపించే జీవితానుభవాన్ని మనం చాలా సార్లు కోరుకుంటాం. ఇక్కడ అది అనుభవిస్తాం. రచయిత బత్తుల ప్రసాద్ గతంలో అడవుల్లో ఎక్కువగా తిరగటం వల్ల అడవిని గురించిన వర్ణన అత్యంత సహజంగా ఉంది. రకరకాల చెట్లు, జంతువులు అవి సంచరించే తీరూ అక్కడక్కడా చెప్పిన తీరు… ఒక అందాన్ని తీసుకు వచ్చాయి.
ఇందులో అన్ని సౌకర్యాలూ ఉండే జీప్, ప్రతి మజిలీ దగ్గరా అతను ఏర్పాటు చేసే టెంట్ ఒక్కసారైనా అలాంటి జర్నీ చేస్తే ఎంత బావుండు అనిపించేలా చేస్తాయి. యానాదుల అటవీ న్యాయం. వాళ్ళ జీవితపు ఫిలాసఫీ మనల్ని ఆకర్షిస్తాయి. వెదురు వనాల మధ్య కొండ తేనెటీగల రక్షణలో ఉండే ఆ మొక్క కోసం ఆమె వచ్చింది. ఆమెకి ఆ మొక్కని ఇవ్వటం కోసం అడవిలో ఉండే మనుషులంతా కదిలారు. అతనూ, ఆమె మనకు ఓ అద్బుతమైన ప్రయాణపు అనుభవాన్నిచ్చి వెనుదిరిగారు.
ఇదంతా ఒక స్క్రీన్ ప్లే లాగా సాగుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలని ఎక్కువ సేపు చర్చించకపోవటం. ఆమె వెతుకుతూ వచ్చిన వస్తువు విషయంలో ఎక్కడా ఎక్కువ చెప్పకపోవటం ఉద్దేశపూర్వకమే అనిపించింది. కథని చివరి వరకూ అలా చదివిస్తూ వెళ్లేలా రాయటం కూడా ఆకట్టుకుంది. ఎక్కడా పెద్దగా బోర్ అనిపించదు.
కేవలం ప్రయాణం, అడవిలో ఉండే చెట్ల గురించి, అడవి దారుల గురించీ ఎప్పటికప్పుడు రంగులు మారే ఆ వాతావరణం గురించి అలా….. చూస్తూ పోవటమే. ఇప్పటికే ఒక చిన్న ప్రయాణం అయిన అడవిలో చేసినవాళ్ళకి మరింతగా నచ్చే కథ ఇది.అయితే…! అచ్చుతప్పులు, రిపీట్స్, పేజీ సెటప్ విషయంలో ఇంకాస్త శ్రద్ద తీసుకోవాల్సింది. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ని దాచి పెట్టటం… కాస్త నిరాశపరిచే అంశం.
where this movie available