రామోజీని ఏకి పడేసిన సూపర్ స్టార్!

Sharing is Caring...

1984 story……….

అవును నిజమే .. హీరో కృష్ణకు సహజంగా కోపం రాదు.వచ్చిందంటే దాన్ని మనసులో దాచుకోరు.అసలే డేరింగ్ .. డాషింగ్ హీరో. అవతలి వారు ఎంతటివాడైనా నిర్మొహమాటం గా విమర్శించే వారు.అలాంటి ఘటన 1984 డిసెంబర్ లో జరిగింది.

నాదెండ్ల ఎపిసోడ్ తర్వాత ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ఎన్నికల సభలకు జనం పెద్ద ఎత్తున హాజరయ్యేవారు. ఎన్టీఆర్ పై కృష్ణ తన ప్రసంగంలో వేసే చురకలకు,విమర్శలకు ప్రజల్లో స్పందన బాగుండేది.

కృష్ణ ఎన్నికల ప్రసంగాలు రచయిత మహారథి రాసేవారు. అప్పటికే ఎన్టీఆర్ కి కృష్ణకు విభేదాలు ఉన్నాయి.ఇందులో రామోజీ పాత్ర ఏమిటా అని సందేహం రావచ్చు. అప్పట్లో రామోజీ రావు బహిరంగంగానే తెలుగు దేశం పార్టీకి మద్దతు ఇచ్చారు.

ఎన్టీఆర్ ప్రసంగాలు కూడా ఈనాడు సీనియర్ పాత్రికేయులు తయారు చేసేవారు.ఈ బాధ్యతలు మోటూరి వెంకటేశ్వర రావు అనే న్యూస్ టుడే డైరెక్టర్ కి రామోజీరావు అప్పగించారు. అప్పటినుంచే ఈనాడు పై తెలుగు దేశం పార్టీ కరపత్రిక అన్న ముద్ర పడింది. 

ఇక అసలు కథలోకి వెళితే .. 1984 డిసెంబర్ 20 న కృష్ణ నంద్యాల బహిరంగసభలో ఉద్రేక భరితంగా మాట్లాడారు. సహజధోరణిలో ఎన్టీఆర్ ను తూర్పార బట్టారు. జనం భారీగా తరలి వచ్చారు. కృష్ణ సభ ముగించుకుని వెళుతుండగా ఆయనపై  కొంతమంది యువకులు రాళ్ల తో దాడి చేశారు. ఒక రాయి వచ్చి కృష్ణ కంటికి తగిలింది. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు.

ఆ మర్నాడు హైదరాబాద్ లో కృష్ణ ప్రెస్ మీట్ పెట్టి ఈనాడు .. తెలుగు దేశం అధినేత ఎన్టీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఆరోపణలు చేశారు.తనపై జరిగిన దాడికి తెలుగు దేశం పార్టీ .. ఈనాడు బాధ్యత వహించాలని అన్నారు. 

ఈనాడు విలేకరులకు కళ్ళు, చెవులు, బుద్ధి లేవన్నారు. తన సభకు మూడు లక్షలమంది జనం హాజరైతే 1550 మంది వచ్చినట్టు రాసారని కృష్ణ విమర్శించారు. ఒక పార్టీకి ఓటు వేయవద్దనే హక్కు ఈనాడు కు ఎవరిచ్చారని కృష్ణ ప్రశ్నించారు. ‘కాంగీకి శృంగభంగం చేయండి’ అని ఈనాడు రాయడం జర్నలిజానికి సిగ్గు చేటు అని ఎద్దేవా చేసారు.

ఎన్టీఆరే ఈ దాడి చేయించి ఉండొచ్చని  కృష్ణ ఆరోపించారు. తనపై దాడి చేసిన వారు తెలుగుదేశం సన్నాసులని విమర్శించారు. ఈ ప్రెస్ మీట్ కి వచ్చిన ఈనాడు విలేకరి దాడి కి ఈనాడుకి సంబంధం ఏమిటని ప్రశ్నించగా .. కృష్ణ ఈనాడు పాత్ర కూడా ఉండొచ్చని  సమాధానం చెప్పారు. కృష్ణ విమర్శలను .. ఆరోపణలను ఈనాడు మర్నాడు ఫస్ట్ పేజీ లో ప్రచురించింది.

అలాగే ఒక వివరణ ఇస్తూ .. కృష్ణ ఆరోపణలను ఖండించింది. ఈనాడు ఏనాడైనా హింసను ఆమోదించదని స్పష్టం చేసింది. కృష్ణపై దాడికి నిరసనగా కడప ఈనాడు కార్యాలయంపై కొందరు దుండగులు దాడి చేశారని కూడా ఆ వివరణలో చెప్పుకొచ్చారు.

కృష్ణ విమర్శలను కుర్రతనపు వ్యాఖ్యలుగా భావిస్తున్నట్టు ఎడిటర్ తేల్చేసారు. ఆ తర్వాత రామోజీ కృష్ణకు ఫోన్ చేసి పరామర్శించాని అంటారు.విమర్శల తాలూకూ ఎఫెక్ట్ తో నంద్యాల సభ తర్వాత కృష్ణ మీటింగ్స్ కు ఈనాడు కవరేజ్ బాగానే ఇచ్చింది. సూపర్ స్టార్ ఏదీ మనసులో పెట్టుకోరు కాబట్టి తర్వాత కాలంలో రామోజీ మనవరాలి పెళ్ళికి కృష్ణ కూడా హాజరయ్యారు.  

——KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!