కరెక్షన్ చూసి కంగారు పడొద్దు !

Sharing is Caring...

Correction is inevitable ………………………………

స్టాక్ మార్కెట్ గత వారం నష్టాల బాటలోనే నడిచింది. పెరుగుతున్న కరోనా కేసులు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు..దీనికి తోడు చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ భయాలు మదుపర్లను కలవరపెట్టాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్న క్రమంలో గ్లోబల్  సూచీలు దిద్దుబాటుకు గురి అవుతున్నాయి. ఇండియన్ మార్కెట్లు కూడా అదే బాట పట్టాయి.

ఇది స్వల్ప కాలిక దిద్దుబాటేనా ? కొంత కాలం ఇలాగే కొనసాగుతుందో చెప్పలేము. అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఇప్పటికే చాలా షేర్ల విలువలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి షేర్లు కలిగి ఉన్నవారు ఇకనైనా లాభాల స్వీకరణపై దృష్టి పెట్టడం మంచిది. వరుసగా మార్కెట్ పెరగడం కూడా ఎప్పుడూ మంచిది కాదు. ప్రస్తుతం  తాత్కాలికంగా మార్కెట్ కొంత తగ్గినా లేదా మరి కొన్ని పాయింట్లు పెరిగినా …  అప్ ట్రెండ్ ఎక్కువకాలం కొనసాగడం కష్టమే.

కొత్త రికార్డులు నెలకొల్పుతున్న మార్కెట్ ఏరోజు అయినా దిద్దుబాటు కి గురవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్ పూర్తి స్థాయిలో దిద్దుబాటుకి గురి కాకముందే లాభాల స్వీకరణకు పూనుకోవడం మంచిది. ధరలు పెరిగిన షేర్లను ప్రస్తుత దశలో అమ్ముకోవడం సరైన వ్యూహమే.

ఈ దశలో ఇన్వెస్టర్లు తమవద్ద ఉన్నషేర్ల ధరలను కొన్నధరలతో పోల్చి చెక్ చేసుకోవాలి. లాభాలు బాగా వచ్చాయి అనుకుంటే ఆ షేర్లను అమ్ముకునే ప్రయత్నం చేయాలి. కనీసం కొన్ని అయినా అమ్మేసి లాభాలు స్వీకరించాలి. షేర్ల తాలూకూ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నప్పటికీ అమ్మేసుకోవడం బెటర్. ధర తగ్గినపుడు కావాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చు ఇలా ఎప్పటికప్పుడు అదను చూసి అమ్మకాలు.. కొనుగోళ్లు చేస్తేనే మార్కెట్ ద్వారా లాభాలు ఆర్జించగలం. ఇది కూడా ఒక వ్యూహమే.

అందరికంటే ముందే లాభాలు స్వీకరించేందుకు ఇన్వెస్టర్లు రెడీ అవ్వాలి.  అమ్మకాలు వెల్లువెత్తిన సమయంలో కంటే ముందే లాభాలు స్వీకరించాలి. ఇటీవల కాలంలో మార్కెట్లో కరెక్షన్ స్వల్పంగానే ఉంటోంది. గతంలో మాదిరిగా పెద్ద స్థాయిలో మార్కెట్ పతనమవడం లేదు. ఏదో ఒక రోజు ఆ పరిస్థితి కూడా రాకబోదు. ఇదంతా సహజమే. గతంలోనూ ఇలాంటి అనుభవాలు మార్కెట్ కి ఉన్నాయి.  

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐలు) విక్రయాల కొనసాగిన కారణంగా జనవరి 21తో ముగిసిన వారంలో మార్కెట్ మూడు శాతానికి పైగా నష్టపోయింది. గత వారంలో, బిఎస్‌ఇ సెన్సెక్స్ 2,185.85 పాయింట్లు (3.57 శాతం) క్షీణించి 59,037.18 వద్ద ముగియగా, నిఫ్టీ 638.55 పాయింట్లు (3.49 శాతం) పడిపోయి 17,617.2 వద్ద ముగిసింది. 

ప్రతికూల అంశాలు ఇలాగే కొనసాగితే విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల జోరు పెంచవచ్చు. ఈ నేపధ్యం లో ఇన్వెస్టర్లు జాగ్రత్త గా ఉండాలి. ధరలు బాగా తగ్గిన షేర్లను ఎంపిక చేసుకుని పెట్టుకోవడం మంచిదే. మార్కెట్ కదలికలను బట్టి మదుపు చేయవచ్చు. మార్కెట్ లో ఎపుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు.

———-KNM  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!