Arundhathi ……………………………..
అగ్రశ్రేణి నటి అనుష్క శెట్టి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం అరుంధతి విడుదలై అపుడే పదిహేనేళ్ళు అయింది. 2009 జనవరి 16న రిలీజైన ఈ హారర్ ఫాంటసీ చిత్రం టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. అరుంధతి సినిమా అనుష్క కెరీర్‌లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అనుష్కను లేడి ఓరియెంటెడ్ మూవీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మార్చింది అరుంధతినే.
ఈ సినిమాలో జేజమ్మ పాత్రలో అనుష్క అద్భుత నటన కనబరిచింది. నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అప్పటి వరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన అనుష్కను స్టార్ హీరోయిన్ గా మార్చేసిన సినిమా కూడా ఇదే. సినిమాకు కథ కథనం బలాన్ని ఇచ్చాయి. ఎక్కడా సినిమా బోర్ కొట్టదు. ప్రేక్షకులు మంత్ర ముగ్దులై కథలో లీనమవుతారు. కోడి రామకృష్ణ మంచి కసితో ఈ సినిమా తీసాడు. ముందు ‘సభాపతి’ అనే తమిళ డైరెక్టర్ ని ఈ సినిమా దర్శకుడు అనుకున్నారు. తర్వాత కోడిని ఎంచుకున్నారు.
అనుష్కతో పాటు అరుంధతి సినిమా ద్వారా బాగా పాపులర్ అయిన నటుడు సోనూ సూద్. అప్పటి దాకా ఇతగాడి గురించి అంతగా జనాలకు తెలియదు. ఈ సినిమా తో ఒక్కసారి సోను సూద్ ఇమేజ్ పెరిగి పోయింది. తొలుత ఈ పాత్ర కోసం తమిళ నటుడు పశుపతిని తీసుకోవాలనుకున్నారు. అశోక్ సినిమాలో సోనూ నటన చూసిన తర్వాత నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి విలన్ రోల్‌కు ఇతడే సూట్ అవుతాడని కోడి రామకృష్ణ కు సూచించారు. ఆయన కూడా ఒకే అనడం తోపాటు తన కావాల్సిన నటనను కోడి రాబట్టుకున్నారు. పాత్ర గెటప్ పై కూడా ప్రత్యకే శ్రద్ధ చూపారు.
అలాగే సినిమాలో సయాజీ షిండే పాత్ర కూడా కీలకమైనది. నానా పాటేకర్, నజీరుద్దిన్ షా, అతుల్ కులకర్ణీ వంటి బాలీవుడ్ నటులను సంప్రదించారు. అయితే వాళ్ళు దొరకకపోవడంతో షిండే కి ఆ పాత్ర ఖరారు అయింది. షిండే కెరీర్లో ఇది ఒక గొప్ప క్యారెక్టర్. షిండే పాత్రలో ఒదిగిపోయాడు.
అలాగే ముందు అరుంధతి పాత్ర కోసం మమతా మోహన్ దాస్ ను సంప్రదించగా ఆమె కాదన్నారు. ఆ తర్వాత అనుష్క ఎంపికైంది. ఆమె దశ తిరిగింది. హాలీవుడ్ స్టైల్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రూపు దిద్దుకుంది అంటే అతిశయోక్తి కాదు. కథకు తగినట్టుగా గ్రాఫిక్స్ వాడటం కోడి రామకృష్ణ కు అలవాటే. సినిమాలో గ్రాఫిక్స్ టీమ్ కృషి తెరపై అద్భుతంగా పండింది. సెంథిల్ కుమార్ కెమెరా పనితనం సంగతి చెప్పనక్కర్లేదు.
రాహుల్ నంబియార్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. అరుంధతికి చింతపల్లి రమణ మాటలు రాసారు. వదల బొమ్మాళీ వంటి డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి.సుభాషిణి ని చాలా భయానకంగా చూపారు. మనోరమ కూడా పాత్రలో జీవించింది. ఇక సత్యనారాయణ, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, అన్నపూర్ణ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఆత్మలు .. అఘోరాలతో కూడిన ఈ సినిమాను లాజికల్ ప్రశ్నలు వేయకుండా సినిమా గానే చూసి ఎంజాయ్ చేయాలి. బోలెడు నంది అవార్డులను సినిమా కైవశం చేసుకుంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా 350 మిలియన్లు , ఓవర్సీస్‌లో 30 మిలియన్ల మేరకు వసూళ్లను రాబట్టింది. పూర్తి సోషియో ఫాంటసీ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాను మరోసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు. యూట్యూబ్ లో సినిమా ఉంది. చూడవచ్చు.
—–KNM
post corrected on 19-1-24