Bharadwaja Rangavajhala …….……………………………………..
Actress Jayanthi …………………..
పై ఫోటో పేకేటి శివరామ్ ను జయంతి పెళ్లి చేసుకున్నప్పటి రిసెప్షన్ నాటిది.ఆ క్రతువుకు ఎన్టీఆర్ తన సోదరుడు త్రివిక్రమరావుతో సహా హాజరయ్యారు.పేకేటికి అది రెండో పెళ్లి. అప్పటికి పేకేటికి ఐదుగురో ఆరుగురో పిల్లలూ ఉన్నారు. అయినా పెళ్లాడారు జయంతి. పెళ్లైన కొంత కాలం తర్వాత వారిద్దరూ విడిపోయారు.
ఆ తర్వాత జయంతి వేరే పెళ్లి కూడా చేసుకున్నారు. అప్పుడు జయంతికి అది రెండోపెళ్లి. ఆ రెండో పెళ్లి చేసుకున్న ‘చందన’ నిర్మాత గిరిబాబుకూ రెండో పెళ్లే. కొంత కాలం తర్వాత గిరిబాబు, జయంతి విడిపోయారు.
ఇక ఆమె మూడో భర్త రాజశేఖర్(కన్నడ) ఆమె కంటే 25 ఏళ్లు చిన్నవాడు. రాజశేఖర్ హీరోగా స్వీయ దర్శకత్వంలో ఓ కన్నడ సినిమా తీశారు జయంతి. అది కూడా పెద్దగా ఆడలేదు. ఈ మూడో వివాహమూ మూడునాళ్ల ముచ్చటే అయింది.
ఇక నటిగా కన్నడ చిత్రసీమలో జయంతి ఉన్నత స్థానానికి ఎదిగింది. కన్నడ మెగా హీరో రాజ్ కుమార్ తో 30 సినిమాలలో జయంతి నటించింది.ఆమె మాతృభాష తెలుగైనా కన్నడం చక్కగా మాట్లాడతారు. ఆమె అసలైన కన్నడ నటి అని కన్నడ ప్రేక్షకులు భావిస్తారు.ఆమె అసలు పేరు కమలకుమారి. శ్రీకాళహస్తిలో పుట్టింది. చెన్నైలో పెరిగింది
ఎన్.టి.రామారావుతో నటించిన జగదేకవీరుని కథ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. బాలనాగమ్మ, స్వర్ణమంజరి, కొండవీటి సింహం లాంటి హిట్ సినిమాల్లో నటించారు.దర్శకులు కె.వి.రెడ్డి, కె.విశ్వనాథ్, కె.బాలచందర్లు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు. కన్నడ, తెలుగు, మళయాళం భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పడం జయంతి ప్రత్యేకత.
ఇక పెళ్లిళ్లు –విడిపోవడాలు సినిమా వాళ్లల్లో ఇలాంటివి అధికంగా కనిపించడానికి కారణాలు అనేకం.ఇండస్ట్రీలో ఒక అండ కోసం ఓ పెద్దమనిషిని ఆశ్రయించడం ..దరిమిలా వారు వీరి మీద దాష్టీకం చేయడం,కొంత కాలం భరించి నమస్తే గురూ … అన్జెప్పి బయట పడడం.
ఇంతదాన్ని చేస్తే అన్యాయం చేసిందనే ప్రచారాన్ని భరించడం. క్రమంగా మరో వివాహం చేసుకోవడం ఇవన్నీచాలా మంది వీరోయిన్ల తెరవెనుక కథల్లో కనిపిస్తాయి. కొందరు ఈ జర్నీని యాక్సెప్ట్ చేయక డిప్రెస్ అవుతారు,గందరగోళ పడతారు. జీవితాన్ని,కెరీర్ ను నాశనం చేసుకుంటారు …అయితే ఇయన్నీ పాత రోజుల్లోనే.
ఇప్పుడు పర్లేదు … కొంత గ్యానం వచ్చింది ఆ ఏరియాలోనూ …ప్రధానంగా అభిప్రాయబేధాలు వచ్చినప్పుడు విడిపోవడమే మంచిదని చెప్పారుగా పెద్దలు … ఎవరి కోసం ఎవరూ అభిప్రాయాలు మార్చునోక్కరలేదు అని కూడా చెప్పారుగా. మనసులు అర్పణలు ఉండవు. అర్పించుకోడాలు అస్సలు ఉండవు.
ఆత్రేయ గారన్నట్టు ఉన్న ‘మనసు నీకర్పణ చేసి లేని దాననయ్యాను’ లాంటి సినిమాలు వాస్తవంలో ఉండవు. అందాక ఎందుకు ఎఫ్ బిలో ఒకరి అభిప్రాయాలు ఓ దశలో ఓ అంశం మీద నచ్చి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాం. వారు అంగీకరిస్తారు.ఆ తర్వాత అదే వ్యక్తి నుంచీ మనం నొచ్చుకునే అభిప్రాయ ప్రకటనలు వెలువడుతాయి.
అప్పుడు ఫ్రెండ్షిప్ నుంచీ తప్పుకుంటాం … ఇక్కడే నాకు తేడా కొట్టుద్ది ..పెతోడూ మనకు అనుకూలమైన అభిప్రాయాలే వ్యక్తం చేయాలంటే ఎట్టా … మళ్లీ ఆత్రేయే ….’నీ మనసు నీదిరా ఇచ్చుకో దాచుకో ఏమైనా చేసుకో …ఎదుటివాళ్లను మనసిమ్మని అడిగేందుకు నువ్వెవరు?’
అట్టాగే భార్యా భర్తల్లో కూడా వారి అభిప్రాయమే ఈవిడా వ్యక్తం చేయాలంటే ఎట్టా కుదరదుగా . అట్నే ఆవిడ అభిప్రాయాలే ఈయనా వ్యక్తం చేయాలన్నా కుదరదు కదా …జాతులు విముక్తిని కోరతాయి అన్నాడు కదా స్టాలిన్ … పెళ్లిళ్లు విడిపోడాన్ని కోరతాయి.. ‘బంధం ఎప్పుడూ బంధమే’ అన్నారుగా పెద్దోళ్లు.
నేను పెద్దోళ్లను గౌరవిస్తాను …క్రూర మృగమ్ముల కోరలు వంచెనుఘోరారణ్యముల ఆక్రమించెను.. అయినా …మడిసి మారలేదు ఆతడి ఆకలి తీరలేదు . ఏదో జయంతి గారి పెళ్లి రిసెప్షను ఫొటో దొరగ్గానే ఇంత ఆవేశపడిపోయి బైటకే ఆలోచించేత్తే ఎట్టా? ఆలోచనలు ఓవర్ ఫ్లో అంటే ఇదే ..అన్నట్టు జయంతి 2021 జులై లో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది.