Padmakar Daggumati…………………………………………
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాక విజువల్ మీడియా జర్నలిజంలో విలువలు, విశ్లేషణలు పూర్తిగా ఏకపక్షంగా మారిపోయాయి. సరే ఏ ఛానెల్స్ ఏ పార్టీపక్షం అనేది వదిలేద్దాం. అదంతా అందరికీ తెలిసిన రహస్యమే. అయితే ముఖ్యంగా గమనించ వలసిన విషయం ఏమంటే ఎవరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు, వారి ప్రయోజనాలు గురించి సొంతంగా విశ్లేషణ చేయడం మానేశారు.
రాజ్యానికి ప్రాతినిధ్యం వహించే మంత్రులని “ఫలానా సమస్య ఉంది. దానిని మీరు గ్రహించారా? దానికి మీ సమాధానం ఏమిటి?” వంటి సొంత పరిశీలనాత్మక ప్రశ్నలు వేయడం వల్ల, సమాధానాలు ప్రజలకు అందించడం మానేశాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏం చెబితే అది రాసుకోవడం. అమరావతి రాజధాని అంటే శివరామకృష్ణన్ కమిటీ సంగతేంటని ప్రశ్నించరు.
హోదా బదులు ప్యాకేజ్ ఎందుకు తీసుకున్నారో ఆ ప్రయోజనాలు ఏంటో అడగరు. హోదాతో ఏమొస్తుందని ముఖ్యమంత్రి అంటే దానివల్ల ఏం కోల్పోతామో నిలదీసే జర్నలిస్టు లేడా రాష్ట్రంలో. హోదా అంటే అరెస్టే అంటే అదే వార్త. మళ్లీ ప్రత్యేక హోదా కావాలంటే అదీ ఒకవార్త. నిలదీసి అడిగేవారే ఉండరు. ఏం చెబితే అది రాసుకోవడమే. ప్రభుత్వం ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా తనే తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు వల్ల ఏం జరిగిందో చూశాం. ప్రజలు ఏక పక్షంగా ప్రతిపక్షాన్ని గెలిపించారు.
తర్వాత 2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీడియా వైఖరిలో ఏమైనా తేడా ఉందా? మీడియా లేదా మేధావులు వదిలేసిన విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రానికి ఏది అవసరమో ప్రభుత్వం తనకి తోచినట్టు సచివాలయాలు, గ్రామ సెక్రటరీలు, వాలంటీర్లు, ఆర్బీకేలు, ప్రభుత్వ బడులలో నాడు నేడు వంటి వ్యవస్థాగతమైన మార్పులు చేయడం మొదలుపెట్టింది.
వీటిలో జరిగే అవకతవకలు లోటుపాట్లు జరుగుతున్నాయి. ఆ లోటుపాట్లు ఏమైనా రాజ్య ప్రతినిధులు అయిన మంత్రులను ప్రశ్నిస్తున్నారా అంటే అదీలేదు. ఎప్పుడు ఎవరు ఏ మంత్రి దగ్గర మైక్ పెట్టినా.. “చంద్రబాబు అలా అన్నారు. దానికి మీరేమంటారు. లోకేష్ అలా అన్నారు. దానికి మీరేం చెప్తారు.
యనమల, అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా, కేశినేని నాని అలా అన్నారు.. ఇలా అన్నారు. మీరేమంటారు? ఎవరేం అన్నారో వాటిని ఇంకోచోటకి మోయడం, వాళ్లు తిడితే అది మాత్రమే ఇంకోచోట వార్తకావడం. అవతలి పక్షం రోజూ ఏదోవొకటి వ్యక్తిగతంగా అంటుంటే వాటిని మోయడమే జర్నలిజమా?
ప్రతిపక్షం వైపునుంచి నిర్మాణాత్మకమైన ప్రశ్నలు వచ్చేలా చేయడం, ప్రభుత్వానికి వ్యవస్థాగతమైన ప్రశ్నలు వేయడం ఒక్కటీ కనపడదు. అసలిదంతా రాస్తుంటే ఇలా ఎందుకు జరుగుతుందో కూడా తెలీదా అని నవ్వుకుంటారేమో అనిపిస్తుంది. విజువల్ మీడియా సంస్థలన్నీ హైదరాబాదు ఉండడం ఒక కారణం. దాంతో నిర్మాణాత్మకమైన పని విధానం అంతరించి, ఏదోలా ఎమోషనల్ ప్లేతో వార్తలు నడిపించి అన్ని ఛానెల్స్ మేనేజ్ చేస్తున్నాయి.
వార్తల సమయం ఉండేది అరగంట అయితే అందులో ప్రకటనల సమయం 10 ని.లు పోను మిగిలిన సమయంలో తెలంగాణ వార్తలు ఆంధ్ర వార్తలు కలిపి కొడతారు. ఇక రాష్ట్రానికి మిగిలేది 10 నిమిషాలు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం గురించి ఆలోచించాల్సి ఉంది.
ఏ రాష్ట్రాల ప్రజలకి ఆ రాష్ట్రం వార్తలు తెలుసుకునే హక్కు ప్రజలకి ఉంది. మీడియా అందరికీ చెప్పేది అదేకదా. ప్రజలకి సమాచారం తెలపాలనే హక్కుతోనే కదా బిడ్డ చనిపోయిన దుఃఖంలో కూడా తల్లిదండ్రులని ప్రశ్నలతో వేధించినా, మంత్రి ముందు ధైర్యంగా మైక్ పెట్టినా? మరి ఆ హక్కు ఎందుకు కుదించబడాలి? ఇవన్నీ చాన్నాళ్ల ప్రశ్నలు నాకు.