JSW ఎనర్జీ …. JSW గ్రూప్ కి చెందిన కంపెనీ ఇది. దేశంలోని ప్రైవేట్ రంగ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలలో ఒకటి. కంపెనీ అందుబాటులో ఉన్న అన్ని రకాల వనరులను సమర్ధవంతంగా వినియోగించుకుంటోంది. ఈ కంపెనీ 1994లో కార్యకలాపాలు ప్రారంభించింది. సజ్జన్ జిందాల్ ఈ కంపెనీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇండియాలోని పలు రాష్ట్రాలలో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దక్షిణాఫ్రికాలో సహజ వనరుల కంపెనీలలో ఈ సంస్థకు వాటాలున్నాయి.
ప్రస్తుతం కంపెనీ 4,559 మెగావాట్లు విద్యుత్ ని ఉత్పత్తి చేస్తోంది. అందులో 3158 మెగావాట్లు థర్మల్ పవర్, 1391 మెగావాట్లు జలవిద్యుత్..10 మెగావాట్ల మేరకు సోలార్ పవర్ ఉత్పత్తి అవుతోంది. పూర్తి-స్పెక్ట్రమ్ పవర్ కంపెనీగా మారాలని లక్ష్యంతో JSW ఎనర్జీ 2006లో JSW పవర్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ (JSWPTC)ని ప్రారంభించింది.విద్యుత్ అమ్మకాలు నిర్వహించడానికి అవసరమైన “I” కేటగిరీ లైసెన్స్‌ను పొందింది, ఇండియా మొత్తం వ్యాపారం చేయడానికి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ జారీ చేసిన పవర్ ట్రేడింగ్ లైసెన్స్ కూడా ఉంది.
గ్రూప్ లో ఉన్న కంపెనీల ద్వారా ఉక్కు.. మౌలిక సదుపాయాలు… సిమెంట్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం..విద్యుత్ వినియోగంలో పెరుగుదల కారణంగా గత కొన్ని నెలలుగా పవర్ స్టాక్‌లు యాక్టీవ్ గానే ఉన్నాయి. ఇతర కంపెనీలు విద్యుత్ సామర్థ్యాలను పెద్దఎత్తున విస్తరించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. దీంతో ఈ రంగంలో పోటీ కూడా పెరగనుంది.
JSW ఎనర్జీ …షేర్ గడిచిన ఏడాది కాలంలో 347 శాతం వరకు లాభపడింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 51 వేల కొట్ల వరకు ఉంది. ప్రస్తుతం కంపెనీ రెన్యుబుల్ ఎనర్జీపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం విద్యుదుత్పత్తి సామర్థ్యంలో 50 శాతం వరకు… 2025 నాటికి గ్రీన్ ఎనర్జీకి మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మార్చి 21 నాటికీ కంపెనీ 2959.94 కోట్ల ఆదాయంపై రూ.186.18 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.మార్చి 2020 తో పోలిస్తే నికర లాభం బాగా తగ్గింది. సెప్టెంబర్ 21 నాటికి కంపెనీ అమ్మకాలు రూ. 802 కోట్లు కాగా నికరలాభం 132 కోట్లు. జూన్ 21 తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే అమ్మకాలు .. నికర లాభం కొంచెం పెరిగాయి. నిర్వహణ వ్యయాలు బాగా పెరుగుతున్నాయి. కంపెనీ పనితీరు మెరుగు పడేవరకు షేర్ ధరలో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చు.
కంపెనీ షేర్లు ప్రస్తుతం రూ. 305 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ డిసెంబర్ నెల లోనే షేర్ ధర 325 వరకు వెళ్ళింది. మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా మళ్ళీ తగ్గింది. 52 వారాల గరిష్ట ధర రూ. 408 కాగా కనిష్ట ధర 66 మాత్రమే.రూ. 100 లోపు షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఈ దశలో లాభాలు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ లాభాలు స్వీకరించవచ్చు. ధర తగ్గినపుడు కావాలంటే మళ్ళీ కొనుగోలు చేయవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ప్రస్తుత తరుణంలో కొంత రిస్క్ అని చెప్పుకోవాలి. కంపెనీ గట్టిదే .. దీర్ఘకాలంలో కానీ మెరుగైన ఫలితాలు అందవు.