Inspiring story………………………………….
పై ఫొటోలో కనిపించే మహిళలు ఇద్దరు కాదు ఒక్కరే. అయిదేళ్ల వ్యవధిలో రూపు రేఖలు మారి .. చక్కగా ఉన్న ఆమె వికారంగా మారిపోయింది. విధి ఆడిన వింత నాటకంలో ఆమె పావులా మిగిలిపోయింది. ఆమె పేరు మేరీ ఆన్ బెవన్. ఈమెకు అక్రోమెగలీ అనే అరుదైన వ్యాధి సోకటంతో క్రమంగా ఆమె ముఖం వికారంగా మారిపోయింది. ప్రపంచంలోని అత్యంత వికారమైన మహిళ” అని ఈమెను పిలుస్తారు.
అరుదైన వ్యాధి బారిన పడిన కారణంగా మేరీ ఆన్ బెవన్ ముఖంలోని ఎముకలు, కండరాలు సాధారణం కంటే మూడు రెట్లు పెద్దవిగా మారిపోయాయి.అప్పట్లో ఆ వ్యాధి గురించి వైద్యులకు పెద్దగా తెలియదట. ఏవేవో మందులు వాడారు. కానీ ఫలితం లేకపోయింది. 1874లో లండన్లోని న్యూహామ్లో మేరీ ఆన్ బెవన్ జన్మించారు. చిన్న వయస్సులో ఆమె సాధారణ జీవితాన్ని గడిపారు.
యుక్తవయసులో మేరీ అందంగానే ఉండేది. వైద్య విద్యను పూర్తి చేసిన తర్వాత ఆమె 1894లో నర్సు ఉద్యోగంలో చేరింది. థామస్ బెవాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది, ఆమెకు నలుగురు పిల్లలు కూడా పుట్టారు. కొంత కాలం ఆమె జీవితం సంతోషంగా గడిచింది. ఆ తర్వాత అక్రోమెగలీ అనే వ్యాధి బారిన పడింది. ఆ వ్యాధి ఆమె సంతోషాలను హరించింది. ఆనందాలను చిదిమేసింది. అనూహ్యంగా రూపురేఖలు మారిపోయాయి.
ఆ సమయంలోనే భర్త కూడా మరణించారు. పిల్లలు చిన్న వాళ్ళు కుటుంబ పోషణ కష్టమైంది. అప్పు పుట్టని పరిస్థితి వచ్చేసింది. కష్టాలు మొదలైనాయి. అయినా ఆమె క్రుంగి పోలేదు. మరో వైపు ఆ అరుదైన వ్యాధి ప్రభావంతో ఆమె శరీరంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. కేవలం ఐదేళ్ల వ్యవధిలో ఆమె రూపు రేఖలు గుర్తించలేని విధంగా మారిపోయాయి. ఆమెలో మునుపటి అందం మాయమైపోయింది. దగ్గరి బంధువులు .. స్నేహితులే గుర్తించలేకపోయారు. ఆమె గురించి తెలియని వాళ్ళు అవమానించేవాళ్ళు.. అదోలా చూసే వారు.
సరిగ్గా అదే సమయంలో (1920 ) ‘హోమ్లీయెస్ట్ ఉమెన్’ పోటీ గురించి ఆమె కు తెల్సింది. దాన్నే ‘అగ్లీ ఉమెన్’ పోటీగా కూడా పిలుస్తారు. అందులో పాల్గొని ప్రైజ్ మనీని గెలుచుకుంటే ఆర్ధిక కష్టాల నుంచి బయట పడవచ్చని భావించింది. మేరీ ఆన్ కుటుంబం కోసం తన గౌరవాన్ని త్యాగం చేసింది. ఆమె పోటీలో పాల్గొని గెలిచింది. ‘ప్రపంచంలోని అత్యంత వికారమైన మహిళ’ గా గుర్తింపు పొందింది. అప్పటినుంచే ఆమెను అలా పిలిచే వారు.
తర్వాత ఒక సర్కస్ కంపెనీలో చేరింది. ఆ కంపెనీ కే ఆకర్షణగా నిలిచింది. కొన్నాళ్ళు కోనీ ఐలాండ్ డ్రీమ్ ల్యాండ్ సైడ్షోలో ‘ఫ్రీక్ షో’ ప్రదర్శకురాలిగా కూడా పనిచేసింది. ఏపని చేసినా అది కుటుంబం కోసమే అన్న తృప్తితో పనిచేసింది. అవమానాలు .. అనాదరణ ఎదురైనా వాటిని పట్టించుకోలేదు. చివరికి 1933 లో మేరీ కన్నుమూసింది.
మనిషి బాహ్య సౌందర్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రపంచంలో మేరీ ఆన్ ధైర్యం చేసి తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ‘ప్రపంచంలోనే అత్యంత వికారమైన మహిళ’గా పేరు తెచ్చుకుని తనకు తెలీకుండానే ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
———KNM