గరం గరం గంగూబాయి !

Sharing is Caring...

కరోనా కారణంగా “గంగూబాయి కతియావాడి” సినిమా విడుదల కాకుండా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయం లో దర్శకుడు సంజయ్ .. ప్రధాన పాత్రధారి ఆలియా భట్ .. ఇతర నటులు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో షూటింగ్ ఆగిపోయింది. తర్వాత షూటింగ్ పూర్తి చేసుకుంది.

అయినప్పటికీ కరోనా అడ్డంకులతో విడుదలలో జాప్యం అయింది. ఎట్టకేలకు 2022 ఫిబ్రవరి 18 న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. అంతకు ముందు రెండుమూడు తేదీలు అనుకున్నప్పటికీ కుదరలేదు.  దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ జనవరి 6, 2022  రిలీజ్ చేయాలనుకున్నారు. జనవరి 7 న  అలియా కీలక పాత్రలో నటించిన ‘RRR’  విడుదల తేదీ ఫిక్స్ కావడంతో..  రాజమౌళి అభ్యర్ధన మేరకు ఫిబ్రవరి 18 కి మార్చుకున్నారు. గంగూబాయి లో కూడా ప్రధాన పాత్రధారి ఆలియా భట్ అన్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను తెలుగులో కూడా అనువదిస్తున్నారు. గంగూ భాయి అనే సెక్స్ వర్కర్ కథ ఆధారంగా ఈ సినిమా సంజయ్ భన్సాలీ తీస్తున్నారు.1960 వ దశకంలో ముంబై రెడ్ లైట్ ఏరియా కామాటిపురా లో ఈ గంగూ భాయి ఓ వెలుగు వెలిగింది. గంగూ భాయి గా ఈ సినిమాలో ఆలియా నటించింది. గంగూ పాత్ర తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని .. అలియా భట్ అంటున్నారు.  

భన్సాలీ ఈ ప్రాజెక్టు టేకప్ చేసాడంటే ఆ కథలో ఎన్నో మలుపులు,ఆసక్తి కరమైన అంశాలు ఉన్నట్టే.గంగూబాయి ది గుజరాత్ లోని  కతియావాడి. .. తండ్రి దగ్గర పనిచేస్తున్న కుర్రాడితో ప్రేమలో పడింది. అతగాడి మాటలు నమ్మి ఇంట్లో చెప్పకుండా బొంబాయి వచ్చేస్తుంది. కొన్నాళ్ళు ఆ ఇద్దరు కలసి కాపురం చేస్తారు.

ఆ కుర్రోడు ఒక రోజు గంగూబాయికి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి ఆమెను ఒక వేశ్యాగృహంలో 500 రూపాయలకు అమ్మేసి పారిపోతాడు.అప్పటినుంచి గంగూ భాయి జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగింది. ఆ మలుపులు ఏమిటన్నవే చిత్ర కథ.

గంగూ బలవంతపు వ్యభిచారాన్ని ప్రోత్సహించలేదు అంటారు. కామాటి పురా లో వృత్తిగా స్వీకరించడానికి ఇష్టపడేవాళ్లే ఉండాలని స్పష్టం గా చెప్పేదట. ఒక మహిళగా  ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న గంగూబాయి తనలా కష్టాలు పడిన సమాజంలోని ఇతర స్త్రీల పట్ల సానుభూతి కలిగి ఉండేవారు. సెక్స్ వర్కర్ల హక్కులు,వారి సాధికారత కోసం గంగూ భాయి గట్టి ప్రయత్నాలు చేసింది.  

కామాటిపుర లో జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. అక్కడివారికి ఆమె అంటే గౌరవం అభిమానం. ఆమె ఫోటోలు ఆ ప్రాంతంలోని ఇళ్లలో కనిపిస్తాయి. స్థానికులు ఆమె గౌరవార్థం ఒక విగ్రహాన్నికూడా నిర్మించారు.

హుస్సేన్ జైదీ రాసిన పుస్తకం “మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై ” ఆధారంగా తీసిన ఈ సినిమా ఎలా ఉంటుందో ? గంగూ భాయి పాత్ర ఎలా ఉంటుందో ? సెక్సీ క్వీన్ గా చూపుతారా ? గూండాలను శాసించిన డాన్ గా చూపుతారో ? అనేది సస్పెన్స్. సినిమా విడుదల అయితే కానీ ఏదీ చెప్పలేం .  

—————–KNMURTHY

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!