Ramana Kontikarla…………………………………..
ఫొటోలో కనిపిస్తున్న ఇంటి ప్రత్యేకత ఏమిటో కొంచెం కీన్ గా చూస్తే అర్ధమవుతుంది.ఆ ఇల్లు అలా కట్టుకోవడం వెనుక ఒక కథ ఉంది.కొంతమంది కళాకారుల తీరు భిన్నంగా ఉంటుంది. వృత్తిని గాఢంగా ప్రేమిస్తుంటారు. ఆ ప్రేమలో వారు ఇతరులకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. రవి హొంగళ్ కూడా ఆ కోవకు చెందిన వాడే. 33 ఏళ్లుగా రవి తన వృత్తి పట్ల చూపించిన ప్రేమ … మమకారం… తను కట్టుకున్న ఇంటిలోనూ ప్రతిఫలించేలా చూసుకున్నారు.
అంతేకాదు. తన పిల్లలకు వృత్తికి సంబంధించిన పేర్లు పెట్టుకున్నారు. కర్ణాటక బెలగావికి చెందిన రవి ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. మంచి ఇల్లు కట్టుకోవాలనేది ఆయన కల. కల నెరవేరేలా కష్టపడి ఏడాది క్రితం బెల్గామ్ లో ఆయనో ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లంతా కూడా కెమెరా ఆకారంలో ఉండేలా కట్టించారు. ఇక ఇంట్లో ఇంటీరియర్ డిజైన్స్ .. బయట గోడలపైన డిజైన్స్ కూడా కెమెరా కు సంబంధించిన యాక్సెసరీస్ రూపాల్లో అద్భుతంగా తీర్చిదిద్దారు.
అదే ఆయన కల. కెమెరా తనకో లైఫ్ ఇచ్చింది కాబట్టి ఇంటికి కూడా క్లిక్ అని పేరు పెట్టుకున్నారు. ఆయన పిల్లల పేర్లు తెలిస్తే మరింత ఆశ్చర్య పోతారు. వారి పేర్లు కూడా కెమెరా బ్రాండ్ పేర్లు — Canon, Nikon .. Epson. కట్టిన భవనం కున్న మూడు ఫ్లోర్ల కు ముగ్గురి పేర్లు పెట్టుకున్నారు. మొదట్లో తన కల నిజమౌతుందా కాదా రవి కంగారు పడేవారు.
డబ్బు సమకూర్చుకుని పలువురు ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ ను కల్సి మాట్లాడారు. తన ఇల్లు ఏ మోడల్ లో ఉండాలో వివరించారు. రవి ఆలోచన వినూత్నం గా ఉండటం తో వాళ్ళు కూడా ఓకె అన్నారు. కొంత శ్రమ తీసుకుని రవి కోరినట్టుగా భవనం కట్టి ఇచ్చారు. బాల్కనీ రెయిలింగ్ ని కెమెరా రీల్ ఆకారంలో డిజైన్ చేయగా… లెన్స్, దాని పైన ఫ్లాష్, ఇంటి లోపల చిప్, రోల్ ఆఫ్ ఫిల్మ్ వంటి ఆకారాలతో కెమెరాపై తనకున్న ప్రేమను .. మక్కువను మమకారాన్ని చాటుకునేలా ఇల్లు నిర్మించుకున్నారు.
ఇంటి లోపలకు అడుగుపెడుతుంటే కనపడే దర్వాజా.. కెమెరా షట్టర్ ఆకారంలో ఆకర్షణీయంగా కనపడుతుంది. ఈ తరహా ఇల్లు చూసి ఆ ఊరి వాళ్లంతా ఆశ్చర్యపోయారు. తన అభిరుచికి తగ్గట్టుగా ఇల్లు కట్టుకున్న రవిని ప్రశంసల్లో ముంచెత్తారు. కొన్నాళ్ళు పాటు ఆ క్లిక్ హోమ్ గురించి సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ కథనాలు వచ్చాయి.ఇప్పటికి ఆ ఇల్లు చూడటానికి వచ్చే వాళ్ళు ఇంటి ముందు నిలబడి సెల్ఫీలు దిగి సంతోష పడుతుంటారు. అదలావుంటే రవి కుమారులు పెద్దయ్యాక తమకు ఆ పేర్లు ఎందుకు పెట్టారని అడిగారట. కెమెరాపై, ఫోటోగ్రఫీపై తనకున్నమక్కువతో పెట్టానని చెప్పారట. వాళ్లూ అర్థం చేసుకుని గర్వంగా కూడా ఫీలవుతున్నారట. అది ఫోటోగ్రాఫర్ రవి ఇంటి కథ.