When he will come out ? …………………………………
దాదాపు ఆరేళ్లుగా పాకిస్తాన్ జైల్లో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు కాస్త ఊరట లభించింది. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించే విధంగా ఆయనకు అవకాశం ఇస్తూ చేసిన తీర్మానాన్ని పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదించింది. అంతర్జాతీయ కోర్టు సూచన మేరకే పాకిస్తాన్ పార్లమెంట్ ఈ నిర్ణయం తీసుకుని తీర్మానం చేసింది.
ఎవరీ కులభూషణ్ జాదవ్ ?
కులభూషణ్ జాదవ్ మహారాష్ట్రలోని సాంగ్లీలో ఒక మరాఠీ కుటుంబంలో పుట్టాడు. ఆయన తండ్రి రిటైర్డ్ ముంబై పోలీసు అధికారి. జాదవ్‌కు వివాహమైంది.ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని కుటుంబం ముంబైలోని పోవైలో నివసిస్తుంది. పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం జాదవ్ భారత నౌక దళంలో చిన్న వయసులోనే చేరారు.2013 నుంచి “రా” ఏజంటుగా చేస్తున్నారు.
అయితే భారత్ అధికారులు ఈ సమాచారాన్ని ఖండిస్తున్నారు. అతను మాజీ నేవీ అధికారి మాత్రమే అంటున్నారు. జాదవ్ ఇరాన్లోని చబహార్ లో కార్గో వ్యాపారాన్ని పెట్టాడు. అక్కడికి పేరు మార్చుకుని వెళ్లాడని అంటారు. సర్బాజ్ సిటీ నుండి జైష్ ఉల్-అద్ల్‌కు చెందిన ముల్లా ఒమర్ ఇరానీ జాదవ్‌ను కిడ్నాప్ చేసాడు.. తరువాత జాదవ్‌ను పాకిస్తాన్ సైన్యానికి అప్పగించాడు. పాక్ మాత్రం ఇతగాడు బలూచిస్తాన్ లో దొరికారని చెబుతోంది.
జాదవ్ పై చాలా కేసులు బనాయించారు. కులభూషణ్ జాదవ్ భారత గూఢచారి సంస్థ ఆదేశాల మేరకు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా గూఢచర్యం చేశారని .. విధ్వంసక చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది. ఈ భారత నేవీ మాజీ అధికారిని మార్చి 3, 2016న బలూచిస్థాన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారని పాక్ చెబుతోంది. అయితే భారత్ ఈ వాదనను ఖండించింది.
ఆ తర్వాత పాక్ సైన్యం.. ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో జాదవ్ తో మాట్లాడించి ఆ వీడియోను విడుదల చేశారు. పాకిస్థాన్‌ను అస్థిరపరచడంలో భారత గూఢచార సంస్థ‘ రా ’ ప్రమేయం ఉందని జాదవ్ ఆ వీడియోలో పేర్కొన్నాడు . తాను భారత నావికాదళంలో పనిచేస్తున్న అధికారినని, రా ఆదేశం మేరకు పాకిస్థాన్‌లో పనిచేస్తున్నానని కూడాచెప్పాడు. అయితే ఇదంతా బలవంతంగా కూడా చెప్పించి ఉండొచ్చుఅనే వాదన కూడా లేకపోలేదు.
అనంతరం 51 ఏళ్ల జాదవ్ కు 2017 ఏప్రిల్‌లో పాకిస్తాన్ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే ఈ విషయమై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించి జాదవ్ మరణ శిక్షను నిలిపి వేయాలని కోరింది.జాదవ్‌పై పాక్ చేస్తున్న ఆరోపణల్ని కూడా అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ ఖండించింది. దీంతో ఉరిశిక్షపై పునరాలోచన చేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం పాకిస్థాన్ కు సూచించింది.
ఆ దరిమిలా పాకిస్థాన్ పార్లమెంట్ జాదవ్ కి వ్యక్తిగతంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించే విధంగా అవకాశం కల్పించింది. ఇప్పటికే జాదవ్ పాకిస్థాన్ కి దొరికి ఆరేళ్ళు అవుతోంది. ఇక కేసు ఓ కొలిక్కి రావడానికి ఇంకెంత కాలం పడుతుందో ?