Taadi Prakash……………………………………………………..
1975 నుంచీ 79 దాకా తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సి.పి.బ్రౌన్ ప్రాజెక్టు రీసెర్చి అధికారిగా, 1980 నుంచీ ఒక ఏడాది వేమన పరిశోధన ప్రాజెక్టులో పని చేశారు.బాసిజం, ప్రభుత్వ ప్రాజెక్టులకు వుండే పరిమితులు ఆయన్ని నిరాశపరిచాయి.
1981లో ఆంధ్రా వర్శిటీ వీసీ ఆవుల సాంబశివరావు బంగోరెని పిలిచారు. ‘వేమన-సి.ఆర్.రెడ్డి’ ప్రాజెక్టు అప్పజెప్పారు. ఎంతో ఉత్సాహంగా దాన్ని టేకప్ చేశారు. పరిశోధన అనే బండ చాకిరీ చేశారు. అయితే 1982 అక్టోబరులో అర్ధాంతరంగా ఆ ప్రాజెక్టును ఆపేశారు. బంగోరె బాగా hurt అయ్యారు.
‘ఈనాడు’ తిరుపతి ఎడిషన్ 1982 జూన్ లో ప్రారంభించాలని రామోజీరావు నిర్ణయించారు. ప్రమోషన్ ఇచ్చి నన్ను తిరుపతి వెళ్లమన్నారు. దాంతో మిత్రులంతా విశాఖలో నాకు వీడ్కోలు పార్టీ అన్నారు. ఈనాడు ఆఫీసుకి దగ్గర్లోనే ఒక డాబా యింట్లో ముగ్గురు జర్నలిస్టులం వుండేవాళ్లం.
ఒక సాయంకాలం డాబా మీద పార్టీ. కొందరు రిపోర్టర్లు, జర్నలిస్టులు, చందు సుబ్బారావు గారు, ఆయన భార్య నిర్మల వచ్చారు. పార్టీ పైన కదా అని ముందు తలుపు గడియ పెట్టేశాం. ఏడున్నర దాటుతోంది. కబుర్లు, డ్రింకూ నడుస్తున్నాయి. ఒక మిత్రుడు నా దగ్గరకొచ్చి, ఎవరో కింద తలుపు కొడుతున్నారు, వినపడ్డం లేదా? అన్నారు. నా గురించి ఎవరూ వచ్చే వీలు లేనే లేదు. కిందికి వెళ్లి తలుపు తీశాను.
ఎదురుగా బంగోరె! “రండి. రండి… ఇలా వచ్చారేమిటి?’’ అన్నాను. ‘‘తిరుపతి వెళ్తున్నావటగా… చూసి పోదామని!’’ అన్నారాయన. అప్పుడాయన వయసు 44 ఏళ్లు. నా వయసు 24 ఏళ్లు. మేం బాగా తెలిసిన వాళ్లమేగానీ, స్నేహితులం కాదు. అయినా ఒక కుర్రాడికి వీడ్కోలు చెప్పడానికి ఆయన వచ్చారంటే, ఆనందంతో నా కాళ్లు తడబడ్డాయి. పిట్టగోడ నానుకుని నిల్చున్న నిర్మల, చందుల పక్కనే ఆయన సెటిలయ్యారు.
గ్లాసు తీసికెళ్లి యిచ్చాను.సిగరెట్? అన్నాను. ‘ఇవ్వండి’ అన్నారు. సిగిరెట్ యిచ్చి వెలిగించాను. ఎప్పుడు వెళ్తున్నావు? ఎవరెవరు? యిలాంటి మాటలు నడిచాయి. కె.వి.ఎస్.వర్మ ఇతర మిత్రులందరికీ బంగోరెని పరిచయం చేశాను. ఓ గంటన్నర మాతో గడిపారు బంగోరె. అందరం బిర్యానీ తిన్నాం. ఆయన రెండు చేతులూ పట్టుకుని Thanks చెప్పాను. తెల్లని లుంగీ, అర చేతుల చొక్కాతో నిరాడంబరంగా వున్న బంగోరె నన్ను హత్తుకుని, ‘‘వెళ్లొస్తాను మరి’’ అన్నారు.
చేయి తిరిగిన జర్నలిస్టు అయిన బంగోరె గొప్ప సహృదయంతో ఒక కుర్ర జర్నలిస్టుని కలవడానికి వచ్చారు. సాహిత్య పరిశోధనకు మారు పేరులా నిలిచి వెలిగిన బంగోరె- ఇక ఎప్పటికీ రారనీ, ఆయన్ని మరొక్కసారి కూడా చూసే అవకాశం దక్కదనీ అప్పుడు నాకు తెలీదు. బంగోరెకి మాత్రం ఆ విషయం అప్పటికే తెలుసని నా అనుమానం! అలా, మానవత్వం నిండిన ఒక మహోన్నత శిఖరం, నడిచివచ్చి… ఒక మట్టి బెడ్డని పలకరించి తిరిగి వెళుతూ చిక్కని చీకటిలో కలిసిపోయింది.
1982, అక్టోబరు 31, ఈనాడు ఆఫీసు. రేణిగుంట. సాయంత్రం ఆరున్నర. పేజీలు రెడీ చేసే పనిలో వున్నాను. రోజూ వుండే వార్తలే! ఏడు దాటుతోంది. టెలి ప్రింటర్ మీంచి తాజా వార్తని చింపి ఆ కాగితం ముక్క నాకిచ్చారు. భాక్రానంగల్ ప్రాజెక్టు మీది నుంచి సట్లెజ్ నదిలో దూకి బంగోరె ఆత్మహత్య! ఎనిమిది గంటలకు యివ్వాల్సిన ఈనాడు ఫస్ట్ ఎడిషన్, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు వెళుతుంది.
కుర్చీలో కూర్చుండిపోయాను నిశ్శబ్దంగా. కొద్దిసేపటి తర్వాత పతంజలి గారికి వార్త చూపించాను. ఆ విషాద వార్త రాసి ‘బంగోరె ఆత్మహత్య’ అని మొదటి పేజీలో పెట్టి భరించలేని ఒంటరితనంతో తడికళ్లతో మిగిలిపోయాను.రేణిగుంట చీకటి రోడ్డు మీద నడుస్తున్నాం.. పతంజలి, నామినీ, మేర్లపాక మురళి వున్నా…. వాళ్లేదో మాట్లాడుతున్నా… ఖలీల్ జిబ్రాన్ కవిత్వం చదువుతున్న బంగోరె గొంతేదో నాకు విన్పిస్తోంది. లోయల్లోకి పడిపోతున్న వాళ్లెవరో నన్ను పిలుస్తున్నట్టు అన్పిస్తో్ంది.
1982లో పంజాబ్ గవర్నర్ మర్రి చెన్నారెడ్డి. బంగోరె విషయం ఆయనికి చెప్పారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఒక కారు ఆరేంజ్ చేసి మృతదేహాన్ని నెల్లూరు పంపించారు చెన్నారెడ్డి. బంగోరె జేబులో ఆఖరి ఉత్తరం దొరికింది. నెల్లూరులో లెక్చరర్ అయిన ఆయన భార్య సుమిత్రకు రాసింది. ‘‘కలిసి ప్రయాణిద్దాం అనుకున్నాం. ఇక్కడితో నా ప్రయాణం ముగిసింది. నువ్వు కొనసాగించు…’’ అని రాశారు బంగోరె.
నీ పట్ల కఠినంగా ప్రవర్తించిన ఈ సమాజాన్ని క్షమించలేకపోయావా? ఆ బాధ నిన్ను అంతగా కుంగదీసిందా? నువ్వుంటే… నువ్వే గనక వుండి వుంటే… ఎన్నెన్ని పరిశోధనలు చేసే వాడివో…! ఎంత అమూల్యమైన తెలుగు సాహితీ చరిత్ర తవ్వి తీసేవాడివో! ఈ సమాజానికి ఎన్ని అపురూపమైన గ్రంథాలు అందివుండేవో..? ఇన్ని యూనివర్శిటీలు, ఇంత మంది పరిశోధక విద్యార్ధులు….! బంగోరె Unfinished గా వదిలేసిన పనిని, ఒక బాధ్యతగా తీసుకుని పరిశోధన కొనసాగించి, ఆ దార్శనికుని కల నిజం చేయడానికి నలుగురన్నా లేరా?
విశాఖలో వేమన-సి.ఆర్.రెడ్డి ప్రాజెక్టు ఆగిపోయిన బాధతో నెల్లూరు వెళ్లిపోయిన బంగోరెకి మద్రాసు వెళ్లి ఆరుద్రని కలవమని, పరిశోధనలో ఆయనకి సహకరించవచ్చుననీ, చందు సుబ్బారావు ఉత్తరం రాశారు. ‘‘వెళ్తాను. ఆరుద్రని కలవాలనే వుంది. నాకెందుకో విసుగ్గా వుంది’’ అని బంగోరె జవాబు రాశారు. మద్రాసు వెళ్లినట్టు లేదు. ప్రాజెక్టు ఆగిపోవడం, కుటుంబంలోని అసంతృప్తి ఏదో ఆయన్ని కల్లోల పరిచాయి.
ఎవరికీ చెప్పకుండానే హరిద్వార్ వెళ్లిపోయాడు. హృషీకేశ్.. హరిద్వార్ లో ఒంటరిగా తిరిగాడు. అలజడి, అశాంతి ఆవరించిన ఆ మనిషిని సట్లెజ్ నది కెరటాలు పిలిచాయో… ఏమో…..అక్టోబరు 31 రాత్రి ఏడు, ఎనిమిది గంటలకి ఆంధ్రా యూనిర్శిటీలో ఈ వార్త తెలిసింది. మాజీ రిజిస్ట్రారు, బంగోరెని బాగా యిష్టపడిన కె.వి.గోపాలరావు దగ్గర చందు సుబ్బారావు కూర్చుని వున్నారు. ‘‘మన వాడొక పిరికి పని చేశాడు’’ అన్నాడు చందు. గోపాలరావు గారు షార్ప్ గా రియాక్ట్ అయ్యారు. “No cowardice. It needs courage to commit suicide” అన్నారు.
బంగోరె రాసిన పుస్తకాల వివరాలు:
1. Speeches and essays of CR Reddy 2. గురజాడ కన్యాశుల్కం మొదటి కూర్పు. 3. బ్రౌన్ ప్రచురించిన తాతాచార్లు కథలు, డాక్టర్ జె.మంగమ్మ బుక్ ప్రింటింగ్ ఇన్ ఇండియాలాంటి వెన్నో వెలికి తీసి పరిష్కరించి ప్రచురించారు. 4. బ్రౌన్ జర్నలిజం చరిత్ర, బ్రౌన్ సాహిత్య చరిత్ర. 5. ఉన్నవ మాలపల్లిపై ప్రభుత్వ నిషేధాలు 6. ఆంధ్ర గీర్వాణ చందము. 7. వేమన-సి.ఆర్.రెడ్డి 8. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, వీరేశలింగం, అజ్ఞాత చరిత్రకారులు, జర్నలిస్టులపై పుస్తకాలు. 9. బ్రౌన్ జాబులు, ఆధునికాంధ్ర సాహిత్య శకలాలు- కడప జాబుల సంకలనం. 10. చంద్రిక కథ (తమిళం నుంచి అనువాదం). 11. విక్రమపురి మండల సర్వస్వం. ఇంకా కొన్ని వందల వ్యాసాలు, సమీక్షలు.
Pl Read it also …………….సట్లెజ్ కెరటాలు పిలిచాయా బంగోరె!