ఈ కనుప్రియ అగర్వాల్ ఎవరో తెలుసా ?

Sharing is Caring...

పై ఫొటోలో కనిపించే మహిళ పేరు కనుప్రియ అగర్వాల్ . భారతదేశపు మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఈమే. నాడు ఆమెకు పెట్టిన పేరు దుర్గ. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దుర్గ మామూలు బాలికగానే పెరిగింది. కానీ తల్లి తండ్రులు మాత్రం కంగారు పడుతుండేవారు. అందరు పిల్లల మాదిరిగానే ఆడుతూ.. పాడుతూ పెరిగింది. 

43 ఏళ్ల కనుప్రియ ప్రస్తుతం తన కుటుంబం తో సంతోషంగా ఉన్నారు.ఆమె 8 ఏళ్ల చిన్నారికి తల్లి కూడా. ఇక దుర్గ  అక్టోబర్ 3, 1978 న పుణెలో జన్మించింది. ఒకప్పుడు లక్షలాది జంటలకు ఆశాకిరణం గా నిలిచిన  టెక్నిక్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) సాధించిన విజయానికి దుర్గ గుర్తుగా మారింది. ప్రపంచంలోనే రెండో టెస్ట్ ట్యూబ్ బేబీ గా దుర్గ చరిత్ర కెక్కింది.

లూయిస్ జాయ్ బ్రౌన్ జూలై 25 న ఇంగ్లాండ్‌లో పుట్టిన మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ. డాక్టర్ రాబర్ట్ ఎడ్వర్డ్స్,డాక్టర్ పాట్రిక్ స్టెప్టో ల పర్యవేక్షణలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీగా ఆమె జన్మించింది. సరిగ్గా 70 రోజుల తర్వాత దుర్గ ఇండియాలో పుట్టింది. IVF థెరపీని కనుగొన్న డాక్టర్ ఎడ్వర్డ్స్ 2010 లో మెడిసిన్ .. ఫిజియాలజీలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.

IVF థెరపీని  20 వ శతాబ్దపు గొప్ప వైద్య పురోగతి గా చెప్పుకోవచ్చు. 1978 నుండి అలాంటి రీ ప్రొడక్షన్ టెక్నాలజీల ద్వారా దాదాపు ఎనిమిది మిలియన్ల మంది పిల్లలు జన్మించారు. ఈ రంగంలో పురోగతిని సాధించిన దేశాలలో భారతదేశం ఒకటిగా గుర్తింపు సాధించింది.

దేశంలో IVF కి మార్గదర్శకత్వం వహించిన భారతీయ వైద్యుడు .. కనుప్రియను విజయవంతంగా అందించిన బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ్  దురదృష్టవశాత్తు దుర్గ పుట్టిన మూడు సంవత్సరాల తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. అధికార యంత్రాంగం వేధింపుల కారణంగా ఆయన తన బృందం సాధించిన విజయాలను ప్రపంచంతో పంచుకోలేకపోయాడు.

ఆమధ్య కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్ మెడికల్ కాలేజీలో కనుప్రియ 43 వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ ముఖోపాధ్యాయ రచనలకు జాతీయ స్థాయి గుర్తింపు కోసం అకాడమీ ఆఫ్ క్లినికల్ ఎంబ్రియోలజిస్ట్స్ (ఎసిఇ) డిమాండ్ చేసింది. కాలేజీలో ముఖోపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాగా తపన్ సిన్హా రాసిన హిందీ మూవీ ‘ఏక్ డాక్టర్ కి మౌత్ (ఒక వైద్యుడి మరణం) కి ముఖోపాధ్యాయ జీవితమే ఆధారం.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!