Marudhuri Raja ………………………………………….
హైదరాబాద్ లో.. రక్తతిలకం..షూటింగ్ జరుగుతోంది..దర్శకుడు B. గోపాల్ . పరుచూరి బ్రదర్స్ రచయితలు.నేను వాళ్ళ దగ్గర సహకార రచయితని కావటంవల్ల..గోపాల్ గారు కూడా అడగటం వల్ల స్క్రిప్ట్ హెల్ప్ కోసం హైదరాబాద్ వెళ్ళాను..అదే టైంలో అక్కినేని వారి బర్త్ డే వచ్చింది..ఆయనకి గ్రీటింగ్స్ చెప్పటానికి గోపాల్ తదితరులు వెళ్తున్నారు.
చిన్నప్పటినుండి నాగేశ్వరరావు గారి ధీరాభిమానిని..ఆయన్ని చూసే అవకాశం ఇప్పటికి వచ్చిందని సంబరపడి నేనూ వస్తానని గోపాల్ గారి వెంట పడ్డాను.మేం వెళ్లే సరికి ఇంటి కాంపౌండ్ లో అభిమానుల సందోహం. ఆనందం,అరుపులు,కేకలు. ఆయన వాళ్ళ మధ్యలో ఉన్నారని ఎవరో చెప్పారు.గోపాల్ గారు నన్ను ఇంట్లోకి తీసుకువెళ్లి..ముందు ఉన్న చిన్న హాల్లో కూర్చోబెట్టి ” ఇక్కడే కూర్చో..మేం వెళ్లి ఆయనని కలసి,ఆయన తో కలిసి వస్తాం”అని వెళ్లాడు.
నాకు టెన్షన్ మొదలైంది.ఎన్నో సినిమాలతో మనసు తెరమీద మరపురాని చిత్రాలని ముద్ర వేసిన మహానటుడిని చూడ బోతున్నాను.దేవదాసు సినిమా చూస్తూ ఏడ్చి..ఆ పాటలు ఎన్నిసార్లు పాడినా అంత బాగా పాడలేక ఏడ్చిన అభిమానిని . అమరశిల్పి జక్కన లాంటి రంగుల అద్భుతాలు చూసిన ఈ రెండు కళ్ళు ఆయనని ప్రత్యక్ష్యం గా చూడబోతున్నాయి. కాళిదాసు,జయభేరి,తెనాలి రామకృష్ణ ఒకటేమిటి..ఎన్నో సినిమాలు ఎగబడి చూసిన “నేలటికెట్టు” ఇప్పుడు ఆయన నివాసంలో..సోఫాలో కూర్చుని దేవుడు,పరమగురువులు ఇచ్చిన అదృష్టానికి పొంగిపోతున్నది.
ఆయన పరిచయం కాగానే ఏం మాట్లాడాలి..ఎలా మాట్లాడాలి..అని ప్రిపేర్అవుతుండగా ఏదో అలికిడి. తల తిప్పి చూస్తే … వెనుకనే నాగేశ్వరరావు గారు లోపలి కొచ్చేశారు.ఒక్కరే.ఆ రూములో.. నేనూ..ఆయన..నమస్కారం చెయ్యటం కూడా మర్చిపోయాను..నోరు తెరిచి చూస్తూ..! ఆయన సహజమైన పరిశీలన చేసే చురుకు చూపులతో నా పాదాల దగ్గరనుండి తలవరకు మెరుపులా చూశారు. ఇద్దరి మధ్య పది సెకన్ల నిశ్శబ్ద పలకరింపులు జరిగాయి.
కొన్ని సార్లు నిశ్శబ్దం లో ఎంత మృదువైన సంగీతం వినిపిస్తుందో.! ఆయన నా ఆరోగ్యపరిస్థితి అర్ధం చేసుకున్నట్టున్నారు. లోపలికి వెళ్లిపోయారు.ఏమిటీ..ఇదంతా నిజమేనా..? ఎవరి సహాయం లేకుండా మా పరిచయం అయిపోయిందా..! నిజమైన అభిమానానికి ఇంత బలముంటుందా..!? ఇంతలో గోపాల్ గారు వచ్చారు..జరిగిన సీను,తిన్నషాకు చెప్పాను..ఆయన కూడా హ్యాపీ గా ఫీలై..కొన్ని క్షణాల్లో మళ్ళీ పరిచయం చేశాడు…15,20 నిముషాలు కూర్చుని నాగేశ్వరరావు గారు అందరితో మాట్లాడారు…B.గోపాల్ గారికి..మళ్ళీ థాంక్యూ.
ఆ తర్వాత ANR గారి ని చాలా సార్లు కలిశాను..కలిసి పని చేశాను. ఒక సారి ఆయనతో మాట్లాడుతూ “సార్..ప్రేక్షకుడి గా నేను అదృష్టవంతుడిని.గొప్పసినిమాలు చూశాను. టెక్నీషియన్ గా అంత గొప్ప సినిమాలు వ్రాసే అవకాశం రాదేమో.” అన్నాను. “అలా ఎందుకు నిరుత్సాహపడతారు.ప్రేక్షకుడిగా చూసిన సినిమాల్లోని మంచి విషయాలని, ఎమోషన్స్ ని తీసుకుని.. ఇప్పటి వాతావరణానికి,టెక్నిక్ కి తగ్గట్టు గాఎడాప్ట్ చెయ్యండి.”అన్నారు.
ఆయన ఎప్పుడు ఏ విషయం మాట్లాడినా,చెప్పేది వింటుంటే ప్రతి అక్షరం లో ఆత్మవిశ్వాసం, ప్రతిమాటలో ఒక ఆత్మధైర్యం, లోతయిన ఆయన కళ్ల కదలికల్లో భవిష్యత్ ని దర్శించగల జ్ఞానం..ఎన్ని సంపదలు.! ఈ గణనీయమైన గుణాలు ఇన్ని ఉండబట్టే కదా అయిదున్నర అడుగులు అటో ఇటో ఉన్న అక్కినేని వారు ఆకాశమంత ఎత్తు ఎదిగారు..సిక్సు ప్యాకులతో కాదు..చిలిపి కళ్ళతో అమ్మాయిలందరినీ ప్రేమనగర్ లోకి లాగేవాడు…కళలకు,శ్రమకి,స్వయంకృషికి, నిలువెత్తు కాంస్యశిల్పం మా “అక్కినేని నాగేశ్వర రావు గారు.”